కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం
Published Thu, Aug 8 2013 2:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో.. తమ నియోజకవర్గాల్లో సమైక్య రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నా.. జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ తలపై తడిగుడ్డ వేసుకుని నిమ్మళంగా కూర్చున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ప్రజలకు అందుబాటులో లేకుండా హైదరాబాద్, ఢిల్లీల్లో లాబీయింగ్ పేరుతో పార్టీ అధిష్టానం నిర్ణయాలకు ‘తందాన’ అంటూ డ్రామాలాడుతూ తమను ఎన్నుకున్న ప్రజలకు ద్రోహం చేస్తున్నారు.గత ఎనిమిది రోజులుగా ఉద్యమ కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా అధికార పార్టీ నేతలు స్పందిం చకపోగా ఉద్యమకారులకు వెరచి తమ ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారు.
ఉద్యమకారుల ఒత్తిడికి తలొగ్గి ఎట్టకేలకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు రాజీనామా చేసినా.. ఆయన తన రాజీనామాను స్పీకర్‌కు కాకుండా ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడికి పంపడాన్ని కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ డ్రామాలో భాగమని సమైక్యవాదులు అనుమానిస్తున్నారు. కాగా అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వెళితే తమ భవి ష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పదవులను కాపాడుకునే చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు కోండ్రు మురళీ, శత్రుచర్ల విజయరామరాజులు ఎమ్మెల్యేలతో మాట్లాడి సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. పైగా ఉద్యమకారుల ముట్టడి నుంచి తప్పించుకునేం దుకు కృపారాణి, కోండ్రు మురళీలు తమ ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించుకున్నారు. అధిష్టాన దేవతలైన ఇందిర, రాజీవ్ విగ్రహాలకు సైతం పోలీసు కాపలా పెట్టించారు.
నేతల తీరుపై ఆగ్రహం
జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల తీరుపై సమైక్యాంధ్ర ఆందోళకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్నపాటి సాహసం కూడా చేయలేని దుర్బలులు మన నేతలని దుయ్యబడుతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు కోండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజులు సమైక్య ఉద్యమంపై ఏమాత్రం నోరుమెదపడం లేదని విమర్శిస్తున్నారు. ఇక ఢిల్లీలో తిష్ట వేసిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అధిష్టానం చెప్పేదానికి తలూపుతున్నారని, ఇటువంటి నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఇళ్ల నుంచి బయటకు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. మంత్రుల ఇళ్లకు, నేతల విగ్రహాలకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతున్నారు. అధిష్టానానికి ఎదురుతిరిగే ధైర్యం లేని ఎమ్మెల్యేలకు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పట్టుకుంది. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తమను వచ్చే ఎన్నికల్లో వారు ఓట్లు వేయరేమోనన్న భయంతో కొట్టుమిట్టాడుతున్నారు.
Advertisement
Advertisement