తమ్మిలేరుపై విభజన గ్రహణం | State Bifurcation effects tammileru reservoir | Sakshi
Sakshi News home page

తమ్మిలేరుపై విభజన గ్రహణం

Published Tue, Aug 13 2013 4:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

State Bifurcation effects tammileru reservoir

చింతలపూడి, న్యూస్‌లైన్ : పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న తమ్మిలేరు రిజర్వాయర్ భవిష్యత్ రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో ప్రశ్నార్థకంగా మారంది. జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరు పదేళ్లుగా క్రమేపీ తగ్గుతోంది. మెట్ట రైతుల కల్పతరువుగా ఉన్న ఈ రిజర్వాయర్‌కు శాశ్వతంగా సాగునీటి జలాలను అందించే మాట అటుం చితే.. తాజా పరిస్థితులు తమ్మిలేరు ప్రాజెక్ట్ ఉనికికే ప్రమాదం తెచ్చేలా కనిపిస్తున్నాయి. తమ్మిలేరు భవిష్యత్ ఏమిటనే ఆందోళన రైతుల్లో నెలకొంది. 
 
40 ఏళ్ల క్రితం తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మించగా, 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చింతలపూడి రాగా, ప్రాజెక్ట్ దుస్థితిని స్థానిక ప్రజాప్రతి నిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వైఎస్ ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను ఈ ప్రాజెక్ట్‌కు మళ్లించడం ద్వారా చింతల పూడి నియోజకవర్గంలో అదనంగా మరో 35 వేల ఎకరాలను సాగులోకి తెచ్చేలా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఆయన మరణించాక, ఇంది రాసాగర్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. 
 
తమ్మిలేరుకు శాశ్వత సాగు జలాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మెట్ట ప్రాంత రైతుల ఆశలు ఎండమావిగా మారారుు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజిస్తే గోదావరి జలాల తరలింపు అసలు సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టు పరిధిలోని సాగునీటిని వినియోగించుకునే విషయమై గతంలో అనేకసార్లు ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల రైతుల మధ్య వివాదాలు, ఘర్షణలు తలెత్తారుు. ఆంధ్రా కాలువ ద్వారా తమ్మిలేరుకు వచ్చే వరద నీటిని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచి అక్కడి ప్రజాప్రతి నిధులు అడ్డుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాశ్వతంగా వరద నీరు రాకుండా తెలంగాణ రైతులు అడ్డుకుంటారని జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
తమ్మిలేరు ప్రాజెక్ట్ స్వరూపమిదీ
ఖమ్మం జిల్లా పోతువారిగూడెం ప్రాంతంలో పుట్టిన ఈ వాగు వందల మైళ్లు ప్రయాణించి ఏలూరు వద్ద తూర్పు, పశ్చిమ తమ్మిలేరులుగా విడిపోయి కొల్లేరులో కలుస్తోంది. ఏలూరును వరద ముంపు నుంచి రక్షిం చేందుకు చింతలపూడి మండలం యర్రంపల్లి సమీపంలో నాగిరెడ్డిగూడెం వద్ద ఒక జలాశయాన్ని, కృష్ణా జిల్లా మంకొల్లు గ్రామం వద్ద గోనెల వాగు స్టోరేజి ట్యాంక్ నిర్మించేందుకు అంచనాలను రూపొందించారు. ఆ ప్రతిపాదనలలో భాగంగా 1962 ఫిబ్రవరి 13న అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం 1969లో రూ.2.70 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ వ్యయం పెరగడంతో 1974లో ఈ మొత్తాన్ని రూ.5.11 కోట్లకు పెంచారు. అయితే ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఖర్చు మొత్తం రూ.7.55 కోట్లకు చేరుకుంది. రిజర్వాయర్ ఎగువ భాగంలో 20,230 ఎకరాలు, దిగువ భాగంలో ఏలూరు వెళ్లే ఇరుపక్కలా 15 ఏటి కాలువల ద్వారా 14,200 ఎకరాలు తమ్మిలేరు నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడి సాగవుతున్నాయి. 
 
పశ్చిమ గోదావరి జిల్లాలోని తలార్లపల్లి, యర్రంపల్లి, యడవల్లి, కల్యాణంపాడు, తువ్వచెలక రాయుడుపాలెం గ్రామాలకు చెందిన 475 ఎకరాల పల్లం భూములకు, 3,769 ఎకరాల మెరక భూములకు నీరు సరఫరా అవుతోంది. కృష్ణాజిల్లాలో పోలవరం, చాట్రాయి, తుమ్మగూడెం, మంకొల్లు, సోమవరం గ్రామాలలో 1,855 ఎకరాల పల్లం భూములకు, 3,070 ఎకరాల మెరక భూములకు సాగునీరు దీనిద్వారానే అందుతోంది. తెలంగాణ ప్రకటనతో ఈ రెండు జిల్లాల్లోని వేలాది మంది రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 
 
ఇందిరా సాగర్‌ను పూర్తిచేయాలి
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంతో పాటు, వైఎస్ రాజశేఖరరెడ్డి కలలుగన్న ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం త్వరగా పూర్తిచేయాలి. తద్వారా తమ్మిలేరుకు సాగునీరు అందించాలి. వేలాది మంది రైతుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న తమ్మిలేరు ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం వల్ల వట్టిపోయే ప్రమాదం ఉంది. సీమాంధ్ర రైతుల వాణిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తాం. విభజనను అడ్డుకుంటాం. తమ్మిలేరును ర క్షించుకుంటాం. రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలు పంచుకోవాలి.                                                        
 - మద్దాల రాజేష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, చింతలపూడి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement