సమైక్యాంధ్ర ఉద్యమాలు వల్ల స్తంభించిన పాలన
Published Sat, Aug 10 2013 2:19 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
ఏలూరు, న్యూస్‌లై న్ : సమైక్యాంధ్ర కోసం చేపట్టిన ఆందోళనలు ఉవ్వెత్తున సాగుతుండటంతో జిల్లాలో పరిపాలనా వ్యవస్థ స్తంభించింది. 10 రోజులుగా ఉద్యోగులు సైతం నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో పనిచేసేవారు లేక కార్యాలయూలు వెలవెలబోతున్నాయి. జూన్ నెలాఖరు నుంచి పంచాయతీ ఎన్నికల కోడ్ అమలు కావడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పడకేశాయి. మరోవైపు గోదావరి వరదలతో కీలక శాఖల అధికారులు సహా య, పునరావాస కార్యక్రమాలపై దృష్టి సారించాల్సి వచ్చింది.
దీంతో సుమారు నెలరోజులపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించాయి. గతనెల 30న రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నట్టు సీడబ్ల్యూసీ ప్రకటించడంతో ఆరోజు సాయంత్రం నుంచే ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకూ వారంతా పోరుబాటలోనే ఉన్నారు. దీంతో అన్ని కార్యాలయాల్లో పరిపాలన కుంటుపడింది. రెవెన్యూ, పశుసంవర్థక, నీటి పారుదల, వ్యవసాయ, విద్యా శాఖలకు చెందిన ఉద్యోగులంతా ఎడతెగకుండా ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి సైతం నాలుగు వారాల నుంచి జరగటం లేదు.
నిలిచిపోయిన రుణాలు
సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో బ్యాం కుల వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభిం చిపోయాయి. నిరసనకారులు ఎక్కడికక్కడ బ్యాంకులను మూయించివేస్తున్నారు. మరోవైపు రుణాల పంపిణీ ఎక్కడిక్కడే నిలిచి పోయింది. వ్యవసాయానికి సంబంధించి ఈ ఖరీఫ్‌లో రూ.2,450 కోట్లను రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు కేవలం రూ.2,150 కోట్లను మాత్రమే బ్యాంకర్లు అందజేశారు.
ఇంకా రూ.300 కోట్లు పంపిణీ చేయూల్సి ఉంది. కౌలుదారులకు ఈ సీజన్‌లో రూ.150 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.53.04కోట్లు మాత్రమే ఇచ్చారు. గత ఏడాది పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసే విషయంలోనూ జాప్యం జరుగుతోంది. మొత్తం రూ.129 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయూల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.92 కోట్లు మాత్రమే అందాయి. ఇంకా రూ.37 కోట్లను పంపిణీ ఎలా చేయాలో అర్థంకాక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందటం గగనంగా మారింది.
ఆగస్టు 15 వేడుకలపైనా ప్రభావం
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈ నెల 13 నుంచి ఎన్జీవోలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. వీఆర్వో, గ్రామకార్యదర్శి స్థాయి నుంచి అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పోరుబాట పట్టనున్నారు. ఈ పరిస్థితి ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం సందర్భంగా రుణాలు అందించే పరిస్థితి ఉండకపోవచ్చని యంత్రాంగం చెబుతోంది.
Advertisement
Advertisement