రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తట్టుకోలేక ఆగుతున్న గుండెలు
Published Thu, Aug 8 2013 3:35 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
సాక్షి, ఏలూరు: రాష్ట్రాన్ని నిలువునా చీల్చుతుంటే తెలుగువారంతా విలవిల్లాడుతున్నారు. రాష్ట్రం ముక్కలవుతుంటే తట్టుకోలేక కొందరి గుండెలు ఆగిపోతున్నాయి. విడిపోయి బతకలేమని, తమ ప్రాణ త్యాగంతోనైనా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమంటూ మరికొందరు ఆత్మ బలిదానం చేస్తున్నారు. ఆవేదన నుంచి పుట్టిన ఆవేశంతో.. కన్నీళ్ల నుంచి జనించిన తెగింపుతో.. జై సమైక్యాంధ్ర అంటూ దిక్కులు పిక్కటిల్లేలా జనం గొంతెత్తి నినదిస్తున్నారు. ఎన్ని రోజులైనా, మరెన్ని కష్టాలెదురైనా విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకూ ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో నడుస్తున్న సమైక్య ఉద్యమ ఆందోళనలు బుధవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. అన్నివర్గాల ప్రజలు, వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్‌జీఓలు, విద్యార్థులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, పీసీసీ సభ్యుడు కొట్టు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
ఒకే రోజు నలుగురు మృతి.. పెయింటర్ ఆత్మబలిదానం
రాష్ట్ర విభజనను తట్టుకోలేక బుధవారం ఒక్కరోజే ఐదుగురు గుండెపోటుతో మరణించగా ఓ పెరుుంటర్ ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడు. ఇరగవరం మండలం కాకిలేరులో దిగుమర్తి రాజీవ్‌గాంధీ (24)అనే పెయింటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తిలి మండలం గుమ్మంపాడులో వినుకొండ వెంకటసుబ్బమ్మ అనే మహిళ (54), ఉండి గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీను (31), పెంటపాడు మండలం రామచంద్రపురానికి చెందిన మేనేటి కోటేశ్వరరావు(61), ఉంగుటూరు మండలం నారాయణపురంలో తాపీ కార్మికుడు కర్రి నాగరాజు(35) గుండెపోటు గురైతో మృతిచెందారు.
‘అందాల రాక్షసివే.. గుండెల్లో గుచ్చావే’
ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో సోనియాగాంధీని రాక్షసిగాను, కేసీఆర్‌ను మహిళగానూ చిత్రీకరించిన ఫ్లెక్సీలతో ప్రదర్శనలు చేశారు. ఆ ఫ్లెక్సీలను చెప్పులతో కొట్టారు. కేసీఆర్, సోనియాల దిష్టి బొమ్మలను దహనం చేశారు.వైఎస్సార్ సీపీ నాయకులు గుడిదేసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. జిల్లాలోని విద్యుత్ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాయి. కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చిన్నారులు భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్, శివాజీ వేషధారణలతో ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు. రైతాంగ సమాఖ్య ర్యాలీ భారీ నిర్వహంచింది. తెలుగుతల్లి చిత్ర పటం వద్ద సావిత్రి భూదేవ సేవా సంఘం 108 కొబ్బరి కాయలు కొట్టి నిరసన తెలిపింది. ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు, వసంతమహల్ సెంట ర్‌లో గాయత్రి పురోహితుల సంఘం, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ది పశ్చిమగోదావరి జిల్లా అధీకృత ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన బైక్‌లు, ట్రాక్టర్‌లు, ఆటోలతో ర్యాలీ నిర్వహించగా, లారీలు, టాటా మ్యాజిక్, జీప్‌లు, కార్ల సంఘాలు కూడా ర్యాలీ నిర్వహించా యి. దీంతో ఫైర్‌స్టేషన్ సెంటర్ నుంచి పాతబస్టాండ్ వరకు రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.
వంటా వార్పులు.. నిరసన దీక్షలు
పాలకొల్లు నియోజకవర్గంలో అనేకచోట్ల వంటావార్పు నిర్వహించారు. యలమంచిలి మండలం చించినాడలో రిలే నిరహారదీక్షలు ప్రారంభించారు. తణుకులో కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు వాహనాన్ని అడ్డుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు ఘెరావ్ చేశారు. ఆచంట, వ ల్లూరు, పెనుగొండ, మార్టేరు సెంటర్లలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆచంటలో జేఏసీ నాయకులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్‌లో మంత్రి పితానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమైక్యవాదులతో మంత్రి తనయుడు వెంకట్ వాగ్వివాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడిలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. కొవ్వూరు సంస్కృత పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పటం ఆకారంలో కూర్చుని సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపారు.
బంద్ విజయవంతం
నిడదవోలు పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. గణేష్ చౌక్‌లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహర దీక్షలు మూడవ రోజుకు చేరుకన్నాయి. కైకరంలో జాతీయ రహదారిపై వికలాంగులు రాస్తారోకో చేశారు. భీమవరం ప్రకాశం చౌక్ నిరసనలతో హోరెత్తింది. ఉండి మండలం మహదేవపట్నం, కాళ్ల మండలం పెద అమిరంలో రహదారులను దిగ్బంధించి రాస్తారోకో నిర్వహించారు. సోనియా, కేసీఆర్‌లకు పిండ ప్రదానం చేశారు. ఆకివీడులో ఆందోళనకారులు రిలే నిరాహార దీక్షలతోపాటు రాష్ట్రానికి, దేశానికి పట్టిన కీడు పోవాలని వేద పండితులతో అగ్ని హోమాన్ని నిర్వహించారు.
Advertisement
Advertisement