పండుగనాడూ ఆగని ఉద్యమ జ్వాల
Published Sat, Aug 10 2013 2:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
సాక్షి, రాజమండ్రి : పండుగైనా పోరు ఆగలేదు. తొమ్మిదోనాడు కూడా జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగింది. రంజాన్ సందర్భంగా శుక్రవారం ఆందోళనలకు జేఏసీ విరామం ప్రకటించడంతో దుకాణాలు తెరుచుకున్నాయి. బస్సులు కూడా తిరిగాయి. కానీ నిరసనలు కొనసాగాయి. ముస్లింలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో సమైక్య నినాదం మార్మోగింది. ఆర్యవైశ్యులు, రిక్షా కార్మికులు, ఉపాధి సిబ్బంది వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
రిక్షావాలాల సమైక్య నినాదం
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పిఠాపురం, సీతానగరంలలో రిక్షా కార్మికులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారు. పిఠాపురంలో రిక్షాలతో ర్యాలీ చేశారు. మానవహారం నిర్వహించి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు పాల్గొన్నారు.
రాజమండ్రిలో..
రాజమండ్రిలో మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట అన్ని విభాగాల జేఏసీల సమాఖ్య చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరాయి. పలువురు న్యాయవాదులు దీక్షల్లో పాల్గొన్నారు. బార్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నిరశన దీక్షలు కొనసాగుతున్నాయి. గౌతమీఘాట్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించి కోటగుమ్మం వద్ద పొట్టిశ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రాజమండ్రి రూరల్ నియోజక వర్గం కడియంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ల ర్యాలీ జరిగింది. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరాయి. కాతేరులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోలో ఆ పార్టీ నాయకుడు, సినీ నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సంఘం సమైక్య నినాదం
కాకినాడలో ఆర్యవైశ్య సంఘాలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. రామారావుపేటలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. రాజోలులో ఆర్యవైశ్య సంఘం సభ్యులు ర్యాలీలు చేశారు. కాకినాడ కొత్తపేట చేపల మార్కెట్ నుంచి మహిళలు మెయిన్‌రోడ్డు మీదుగా సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర సాగించి బాలాజీ చెరువు సెంటర్‌లో అంత్యక్రియలు చేశారు. డీఎంఅండ్ హెచ్‌ఓ కార్యాలయం ముందు వైద్య ఆరోగ్య ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజూ కొనసాగాయి. రోటరీ క్లబ్ సభ్యులు లక్ష సంతకాల సేకరణ చేపట్టారు.
సమైక్యాంధ్ర ఉద్యమ బాటలో...
పెద్దాపురంలో చేనేత కార్మికులు, రైతులు వేర్వేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. సామర్లకోటలో ఎమ్మార్పీస్ కార్యకర్తలు ప్రదర్శన జరిపారు. తునిలో ఆటోవర్కర్ల సంఘం ప్రతినిధులు ఆటోలతో ర్యాలీ చేసి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. జాతీయ రహదారిపై కబడ్డీ ఆడారు. ఏలేశ్వరంలో మండల టైలర్స్ యూనియన్ సభ్యుల ర్యాలీ జరిగింది. ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ దీక్షలు ఆరో రోజు కొనసాగాయి. అన్నవరం, ప్రతిపాడు మండలాల్లో కేబుల్ ఆపరేటర్లు, శంఖవరంలో వికలాంగులు ర్యాలీ నిర్వహించారు. రౌతులపూడి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి.
జేఏసీ ఆధ్వర్యంలో జగ్గంపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొనసాగుతున్న నిరవధిక దీక్ష శిబిరాన్ని మంత్రి తోట నరసింహం సందర్శించారు. రాజానగరం వద్ద గైట్ విద్యార్థులు జాతీయ రహదారిని ముట్టడించి నినాదాలు చేశారు. రాజానగరంలో అడుసుమిల్లి రమేష్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. మంత్రి తోట నరసింహం అతడిని పరామర్శించారు. కోరుకొండలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ఆధ్వర్యంలో మోటార్‌సైకిల్ ర్యాలీ చేశారు. లక్ష్మీనరసింహ తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో మేస్త్రుల ర్యాలీ జరిగింది. అనపర్తిలో తెలుగుదేశం ర్యాలీలో నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో మండపేటలో కలువపువ్వు సెంటర్‌లో వంటా వార్పు జరిగింది. రాయవరంలో జేఏసీ సభ్యులు ప్రజలకు గులాబీలు పంచారు. కపిలేశ్వరపురంలో నిర్మాణ రంగ కార్మికులు ర్యాలీ చేశారు. కె.గంగవరం మండలం పామర్రులో స్థానికులు వంటా వార్పు నిర్వహించారు.
రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ బైక్ ర్యాలీ
రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తొమ్మిదో రోజు దీక్షలలో 28వ డివిజన్ మహిళలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పార్టీ యువనేత జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఏవీ అప్పారావు రోడ్‌లో యువకులు మోకాళ్లపై నడుస్తూ సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.
ఆందోళనబాటలో ముస్లింలు
రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రార్థనలు ఇతర కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ముస్లింలు సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. రంగంపేటలో ముస్లింలు సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర విభజన యత్నాలకు నిరసనగా రంపచోడవరంలో జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింల నిరసన ప్రదర్శన జరిగింది. రావులపాలెంలో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రదర్శనలో పలువురు ముస్లింలు పాల్గొన్నారు. మామిడికుదురులో ముస్లింలు రాస్తారోకో చేశారు.
కోనసీమలో నిరసనలు
అమలాపురంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల డ్రైవర్లు, క్లీనర్ల సంఘం ఆధ్వర్యంలో 150 బస్సులతో భారీ ర్యాలీ జరిగింది. కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. గ్రామాల్లో జేఏసీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు సాగాయి. గడియార స్తంభం సెంటర్ వద్ద ఆర్టీసీ ఉద్యోగ సంఘం ఎన్‌ఎంయూ రిలే దీక్షలు శుక్రవారం ఏడో రోజుకు చేరాయి. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, నియోజక వర్గ కో ఆర్డినేటర్లు మిండగుదిటి మోహన్, చింతా కృష్ణమూర్తి, ఇతర పార్టీల నేతలు మద్దతు పలికారు. ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట జేఏసీ నిర్వహిస్తున్న శిబిరంలో బార్ అసోసియేషన్ సభ్యులు, ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్లు, మేట్‌లు పాల్గొన్నారు. కొత్తపేటలో గంగిరెద్దుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధుల పేర్లతో ప్లకార్డులు కట్టి ఊరేగించారు.
ఆలమూరులో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బ్యాక్‌వాక్ చేశారు. అయినవిల్లి మండలం సిరిపల్లి, ఎన్. పెదపాలెం గ్రామాల్లో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో వంటా వార్పు చేశారు. కేసీఆర్ దిష్టి బొమ్మ తగులబెట్టారు. మామిడికుదురు మండలం పాశర్లపూడిలో సమైక్యాంధ్రకు మద్దతుగా కొండాలమ్మ ట్రాక్టర్ నిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో రాజోలు మండలం తాటిపాక రేవు వరకూ ట్రాక్టర్ల ప్రదర్శన జరిగింది. ట్రాక్టర్‌లో కేసీఆర్ దిష్టిబొమ్మ ఉంచి డప్పులతో ఊరేగించారు. అంబాజీపేట మండలంలో జర్నలిస్టుల నిరసన ప్రదర్శన జరిగింది. మలికిపురంలో ఎస్సీ సంక్షేమసంఘ సభ్యులు నిరాహార దీక్షలను ప్రారంభించారు. రాజోలు మండలం గొంది లో వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
నేటినుంచి మంత్రి భార్య నిరవధిక దీక్ష
తన భార్య సరస్వతి (వాణి) శనివారం నుంచి సమైక్యాంధ్ర పరిరక్షణ నినాదంతో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్టు మంత్రి తోట నరసింహం ప్రకటించారు. కాకినాడలో ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో రాజీనామా సమర్పించిన అనంతరం మంత్రి తోట శుక్రవారం జిల్లాకు చేరుకున్నారు. సామర్లకోట రైల్వే స్టేషన్, జగ్గంపేట, దోసకాయలపల్లి గ్రామాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగానే తాను పదవికి రాజీనామా చేశానన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని బలోపేతం చేస్తానని, అవసరమైతే జిల్లా జేఏసీకి నాయకత్వం వహిస్తానని పేర్కొన్నారు.
Advertisement
Advertisement