ఉద్యమ సత్తా రాజీనామా బాట
Published Sat, Aug 10 2013 2:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్య ఉద్యమ సత్తా ఏమిటో తెలిసొచ్చింది.. పది రోజుల తర్వాత ప్రజల మనోగతమేమిటో మన ప్రజాప్రతినిధులకు అవగతమైంది. రాజీనామాలు చేయక తప్పదని అర్థమైంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర పరిరక్షణకు జిల్లాలో మహోద్ధృతంగా సాగుతున్న ఉద్యమానికి వెరచి అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దిగివచ్చారు. తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే రాజీనామా లేఖలను స్పీకర్‌కు కాకుండా ముఖ్యమంత్రికి శుక్రవారం సమర్పించారు. శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి, పలాస ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, బొడ్డేపల్లి సత్యవతి, కొర్ల భారతి, జుత్తు జగన్నాయకులుతోపాటు ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ తమ పదవులకు రాజీనామా చేశారు.
గత పదిరోజులుగా ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నా.. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నా నాన్చుడు ధోరణి అవలంభించిన ఈ నేతలు.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాజీనామా చేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఇన్నాళ్లు రాజీనామాలు చేయకుండా, ఉద్యమానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడించడానికి సమైక్యవాదులు కార్యాచరణ రూపొం దించారు. దీంతో వారికి రాజీనామా చేయకతప్పలేదు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు రెండు రోజుల క్రితమే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు పెరిగింది.
ముఖం చూపని మంత్రులు
జిల్లాలో పదిమంది ఎమ్మెల్యేలు ఉండగా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నిర్ణయం మేరకు ఉద్యమానికి ముందే రాజీనామా చేశారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ అనర్హతకు గురయ్యారు, మిగిలిన ఎనిమిది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఐదుగురు రాజీనామా చేశారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులుతోపాటు మంత్రులుగా ఉన్న రాజాం, పాతపట్నం ఎమ్మెల్యేలు కోండ్రు మురళీమోహన్, శత్రుచర్ల విజయరామరాజులు రాజీనామాలకు ఇప్పటికీ వెనకాడుతున్నారు. ప్రజల మనోభావాలను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఉద్యమాలకు భయపడి ప్రజలకు దూరంగా ఉంటున్నారు. పది రోజుల నుంచి నియోజకవర్గాలకే రావడంలేదు. ఇద్దరూ వలస వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారే కావడంతో స్థానికంగా నివాసం ఉండటం లేదు. ఒకరు ఒడిశాలో ఉంటుంటే, మరొకరు విశాఖపట్నంలో ఉంటున్నారు. సమైక్యాంధ్ర ఆందోళనకు మద్దతుగా రాజీనామాలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు లేకుండా చేస్తామని ఆందోళనకారులు వీరిని హెచ్చరిస్తున్నారు.
రాజాంలో కాంగ్రెస్ నేతలకు ఎదురు దెబ్బ
మంత్రి కోండ్రు నియోజకవర్గమైన రాజాంలో సమైక్య ఉద్యమం ఊపందుకుంది. ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి అనుచరులకు పరాభవం జరిగింది. శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ప్రత్యేకంగా ఒక బ్యానర్ తయారుచేసుకొని ర్యాలీలో కలిసిపోయారు. అనంతరం జరిగిన సభలో కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు ప్రయత్నించగా ఉద్యమకారులు అడ్డుకున్నారు. ‘మీకు మాట్లాడే అర్హత లేదు, ఉద్యమం నుంచి వెళ్ళిపోవాలంటూ’ నినాదాలు చేశారు. నచ్చజెప్పడానికి ఎంత ప్రయత్నించినా వినకపోగా మంత్రికి, కాంగ్రెస్‌కు, సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాము మంత్రి కోండ్రు మురళి ఆదేశాల మేరకు ఉద్యమంలోకి వచ్చామని కాంగ్రెస్‌వారు చెప్పడంతో ఆందోళకారులు మరింత రెచ్చిపోయారు. మాయమాటలు చెప్పుకుంటూ ఎంతకాలం తిరుగుతారని నిలదీశారు. ఇదిలా ఉండగా శుక్రవారం కూడా జిల్లాలో అన్ని చోట్లా నిరసన ప్రదర్శనలు జరిగాయి. శ్రీకాకుళంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. నరసన్నపేటలో కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. ఎచ్ఛెర్ల అంబేద్కర్ యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థులు వినూత్న రీతిలో ఆందోళన సాగిస్తున్నారు. నిరాహార దీక్షలు చేపట్టారు. చర్చా గోష్టులు నిర్వహిస్తున్నారు. ఆమదాలవలస, పాలకొండ, పలాస తదితర ప్రాంతాల్లో రాస్తారోకోలు, మానవహారాలు, రోడ్లపైనే వంటావార్పులు చేపట్టారు.
Advertisement
Advertisement