నేతల్లో గుబులు
- నోటిఫికేషన్ వస్తే ప్రాణసంకటమే
- ఎమ్మెల్యే అభ్యర్థుల శిరోభారమే
- కొద్ది గంటల్లో తేలనున్న నిర్ణయం
సాక్షి, మచిలీపట్నం/ విజయవాడ : మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల నేతల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడితే తమకు ప్రాణసంకటమేనని వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తాయని భావిస్తున్న మున్సిపల్ ఎన్నికలు సుప్రీంకోర్టు అక్షింతలతో ముందుకు జరిగాయి.
సోమవారం మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే మున్సిపల్ ఎన్నికలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఓడితే అసెంబ్లీ సీటు పోవడమే కాకుండా గెలుపుపై కూడా అనుమానాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వారిలో గుబులు మొదలైంది. డివిజన్ రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో తమ నియోజకవర్గాల పరిధిలోని డివిజన్లలో అభ్యర్థుల వేటలో పడ్డారు.
రిజర్వేషన్ల ప్రకటనతో అప్పటి వరకూ డివిజన్ అధ్యక్షులుగా, అభ్యర్థులుగా రంగంలో ఉన్నవారి బదులు ఆయా రిజర్వేషన్ల ఆధారంగా కొత్త వారిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సగం డివిజన్లు మహిళలకు రిజర్వు కావడంతో మహిళా అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టారు.
కాంగ్రెస్ నేతల్లో అయోమయం...
అధికార పక్ష ంలో పూర్తి అయోమయం నెలకొంది. అసలు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉండాలా లేదా అన్న విషయం తేల్చుకోలేని స్థితిలో ఉండగా మున్సిపల్ ఎన్నికలు వారిపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. వారు ఎటూ తేల్చుకోలేని స్థితిలో అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి డబ్బులు పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో మాజీ కౌన్సిలర్లు కొందరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు.
రాజకీయ నాయకుల హడావుడి...
పురపాలక సంఘాలకు రిజర్వేషన్లు ప్రకటించటంతో రాజకీయ నాయకుల్లో హడావుడి ప్రారంభమైంది. సాధారణ ఎన్నికల సమయంలో పురపాలక సంఘాల ఎన్నికలు జరుగుతాయా, జరిగితే ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై నాయకులు తమ అనునయులతో చర్చలు ప్రారంభించారు. ప్రస్తుతం శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే పురపాలక సంఘాల ఎన్నికలు వస్తే అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తలనొప్పులు ఖాయం.
కౌన్సిలర్లకు సీట్లు కేటాయించే సమయంలో సముచిత నిర్ణయం తీసుకోకుంటే సీటు ఆశించి భంగపడినవారు ఆయా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. వీటన్నింటిని సరిదిద్దుకోవాలంటే నాయకులకు తలబొప్పి కట్టడం ఖాయం. రాష్ట్ర విభజనపై రాష్ట్రపతి సంతకం చేసిన అనంతరం పురపాలక సంఘాల ఎన్నికలు జరిగితే ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తే తరువాత జరిగే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో అదే పార్టీని ఆదరించే అవకాశం ఉందని, ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీపై కచ్చితంగా పడుతుందని ఆ పార్టీ నాయకులు మధనపడుతున్నారు.