వేగంగా విభజన ప్రక్రియ | Bifurcation process is speedup | Sakshi
Sakshi News home page

వేగంగా విభజన ప్రక్రియ

Published Wed, Apr 23 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

వేగంగా విభజన ప్రక్రియ

వేగంగా విభజన ప్రక్రియ

ఢిల్లీలో ప్రత్యూష్‌సిన్హా కమిటీ ముందు హాజరైన సీఎస్ మహంతి
     
అఖిల భారత సర్వీసు అధికారుల  విభజన మార్గదర్శకాలపై చర్చ
ఏపీ భవన్ విభజనపై ఉన్నతాధికారుల  కీలక సమావేశం

 
  న్యూఢిల్లీ: రాష్ట్ర విభ జనకు సంబంధించిన ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 30 నాటికి అన్ని విభాగాల్లో విభజన ప్రక్రియను పూర్తి చేయాలన్న కేంద్రం ఆదేశాల మేరకు అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా విభజనకు సంబంధించి మంగళవారం సైతం ఢిల్లీలో కీలక భేటీలు జరిగాయి. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనపై ఏర్పాటుచేసిన ప్రత్యూష్‌సిన్హా కమిటీ ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి హాజరై కీలక చర్చలు జరిపారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూనేవారి విభజనకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే దిశగా వీరి సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కూడా ఉన్నతాధికారులు మరో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఏపీ భవన్ విభజనకు సంబంధించి వారు దాదాపు ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరోపక్క బుధవారం రాష్ట్ర స్థాయి ఉద్యోగుల విభజనకు సంబంధించి ఏర్పాటైన కమల్‌నాథన్ కమిటీ కేంద్ర హోంశాఖ ముందు హాజరై తన కసరత్తును వారికి వివరించనుంది.  ఇదిలా ఉండగా నార్త్‌బ్లాక్‌లోని హోంశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రత్యూష్ సిన్హాతో పాటు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మ, పర్యావరణ శాఖ, హోంశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి పాల్గొన్నారు. ఈ కమిటీ సుమారు నాలుగు గంటల పాటు రెండు విడతలుగా సమావేశమై అఖిలభారత సర్వీసు అధికారుల విభజన మార్గదర్శకాల తయారీపై కసరత్తు చేసింది. విభజన అనంతరం ఏ రాష్ట్రానికి వెళ్లాలనే విషయంలో తమకు ఆప్షన్లు ఉండాల్సిందేనని అఖిలభారత సర్వీసు అధికారులు ఇప్పటికే స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులకు ఆప్షన్లు ఇవ్వాలా? రోస్టర్ విధానాన్ని అవలంబించాలా? లేక స్థానికత ఆధారంగా నిర్ణయం చేయాలా? అన్న దానిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుందన్న అంశంపై వివరాలు తెలియరాలేదు. అధికారుల విభజన మార్గదర్శకాల తయారీ పూర్తి కాలేదని, దీనికి మరో మూడు, నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.
 
ఏపీ భవన్ విభజన కొలిక్కి!:

 ఇక ఏపీభవన్‌లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, సిబ్బంది, భవనాలు, తదితరాల విభజనకు సంబంధించి ఆర్‌అండ్‌బీ శాఖ ప్రధాన కార్యదర్శి శ్యాంబాబు, జీఏడీ ప్రోటోకాల్ ముఖ్య కార్యదర్శి రమణారెడ్డి, జీఏడీ కార్యదర్శి శివశంకర్, రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు వీరి సమావేశం జరిగింది. ప్రస్తుతం ఉన్న సీఎం కాటేజ్‌ను ఆంధ్రప్రదేశ్‌కు, శబరి బ్లాక్‌లో తెలంగాణ ముఖ్యమంత్రికి కాటేజ్‌ను కేటాయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక  ఏపీభవన్‌లో 30 వాహనాలు ఉండగా వాటిని ఆంధ్రకు 15, తెలంగాణకు 14 చొప్పున పంచారు. అలాగే ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో వాడే రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇరువైపులా ఒక్కోటి చొప్పున, ఇక మిగిలిన మరో వాహనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఏపీభవన్‌లో ప్రస్తుతం ఉన్న క్యాంటీన్, వీఐపీ డైనింగ్ హాల్, అంబేద్కర్‌ఆడిటోరియాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నిర్వహించేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

 ఉద్యోగుల విభజన మే 7 తర్వాతే?

 ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఏపీ భవన్ ఉద్యోగుల విభ జనను ఎలా చేయాలన్నది మే 7 తర్వాతే నిర్ణయించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ భవన్‌లో 31 మంది ఆంధ్రా ప్రాంతం వారు, 11 మంది తెలంగాణవారు, మరో 48 మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. వీరిని స్థానికత ఆధారంగా పంచితే తెలంగాణకు కొరత ఏర్పడుతుంది. ఈ దృష్ట్యా సింగిల్ పోస్టులన్నీ తెలంగాణకు, డబుల్ పోస్టులున్న చోట్ల సీనియర్‌లు తెలంగాణకు, జూనియర్‌లను ఆంధ్రాకు కేటాయించేలా మొదట ఉన్నతాధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. దీనివల్ల కొందరు ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్న దృష్ట్యా సీమాంధ్రలో ఎన్నికలు ముగిసిన అనంతరమే ఉద్యోగుల విభ జన చేపడతారని తెలుస్తోంది. అప్పటివరకు కేవలం పోస్టుల విభజనను పూర్తి చేస్తారని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement