చీటర్లు, లూటర్లెవరో ప్రజలు తేలుస్తారు
రాష్ట్ర విభజన వ్యవహారంలో చీటర్లు (మోసగాళ్లు), లూటర్లు (దోపిడీదారులు) ఎవరో ప్రజలే తేలుస్తారని బీజేపీ నేత ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజన సాఫీగా, ఒక పద్ధతి ప్రకారం జరగలేదని చెప్పడమే పాపమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వాలంటూనే సీమాంధ్ర సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావించడం నేరమా? అన్నారు.
ప్రాంతానికో మాట మాట్లాడి, పూటకో డ్రామా అడిన వారి సంగతేమిటో తేల్చే రోజులు దగ్గరపడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీని ప్రధానిని చేసేందుకు బీజేపీకి, ఆ పార్టీ మద్దతుదార్లకు (వారెవ్వరో స్పష్టంగా చెప్పలేదు) ఓటేయాలని అభ్యర్థించారు. ‘మోడీని ప్రధానిని చేద్దాం’ నినాదంతో ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో డాక్టర్ రామారావు అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్యతో పాటు బీజేపీ జాతీయ కోశాధికారి పీయుష్ గోయల్, అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్, జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, ఉభయ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు కె.హరిబాబు, జి.కిషన్‌రెడ్డి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎన్.రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి, రఘురామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు నరేంద్ర మోడీపై రాసిన పాటల క్యాసెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... 2009లో చిదంబరం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కల్పించిందని, దాని కొనసాగింపుగా జరిగిన ఉద్యమంలో వేయి మందికి పైగా అమరులయ్యారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 2014 సాధారణ ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయమే రెండేళ్ల కిందటే తీసుకొని ఉంటే ప్రస్తుత పరిస్థితి నెలకొని ఉండేది కాదన్నారు. విభజన బిల్లుపై పార్లమెంటులో చర్చ సందర్భంలో తమ పార్టీ నేతలు సుష్మా స్వరాజ్, అద్వానీలతో పాటు తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ సమయంలో ఏమి చేయాలని నాలుగు రోజులు నిద్రలేని రాత్రులు గడిపానన్నారు. తెలంగాణ రావాలి, సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలనడం ఏవిధంగా ద్రోహమో చెప్పాలన్నారు.
బాగో, జాగో అంటూ సీమాంధ్రుల్లో భయాందోళనలు సృష్టించారని, వాటిని పారదోలేందుకు ప్రధానితో ప్రకటన చేయించిన ఏకైక వ్యక్తిని తానేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను గానీ, తన కుమార్తె గానీ పోటీ చేయబోమని ప్రకటించారు. కొందరు మళ్లీ రాష్ట్రాన్ని కలుపుతామనడంపై స్పందిస్తూ, ఇదేమైనా పాతాళ భైరవి సినిమానా? అని ఎద్దేవా చేశారు. పీయుష్ గోయల్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రధానైతే పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలన్నది లక్ష్యమన్నారు. హైదరాబాద్‌కు మజ్లిస్ పార్టీయే ప్రధాన సమస్యని కిషన్‌రెడ్డి అన్నారు. హరిబాబు మాట్లాడుతూ సీమాంధ్రకు ప్యాకేజీ బీజేపీ కృషేనని చెప్పారు.