సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ జోడీతోనే ఢిల్లీ సమగ్రాభివృధ్ధి సాధ్యమని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఢిల్లీ భవిష్యత్తు కేంద్రంతో ముడిపడి ఉన్నందున ఢిల్లీలో బీజేపీకే పట్టం కట్టాలన్నారు. మంగళవారం సాయంత్రం వెంకయ్య నాయుడును ఆయన నివాసంలో కిరణ్ బేడీ కలుసుకున్నారు. ఢిల్లీలోని దక్షిణాది రాష్ట్రాల ఓటర్ల మద్దతు లభించేలా చూడాలని కోరారు. ఢిల్లీ అభివృధ్ధి కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాల గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే అక్రమ కాలనీల క్రమబద్ధీకరణ మొదలుకొని ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, నిరుపేదలకు ఇళ్ల స్థలాల వంటి పనులు చేసింది. ఎన్నో ఏళ్లుగా అపరిషృ్కతంగా ఉన్న సమస్యలను పరిష్కరించింది. దక్షిణాది ఓటర్లు సహా మిగిలిన వారంతా ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మరింత అభివృధ్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు. బీజేపీ వద్ద డబ్బులు తీసుకొని తమ పార్టీకి ఓటేయాలంటూ ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ చేసినవ్యాఖ్యలపై వెంకయ్య ఘాటుగా స్పందించారు. ‘కాంగ్రెస్‌తో కలిసి అధికారం అందుకుని, అది సాధ్యంకాక పలాయనం చిత్తగించిన కేజ్రీవాల్ తీరును విమర్శిస్తూ సొంత పార్టీ నేతలే బయటకు వస్తున్నారు. డబ్బులు తీసుకోవాలంటూ తప్పుగా మాట్లాడితే ఢిల్లీ ప్రజలు సైతం బుద్ధిచెబుతారు’ అని అన్నారు.
మెజార్టీ ఇవ్వకుంటే ప్రజలకే ఇబ్బంది: బేడీ
ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వకపోతే ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడటం ఖాయమని కిరణ్ బేడీ అన్నారు. బీజేపీకి పట్టం కడితేనే నగర ప్రజల వికాసంతోపాటు, మహిళా భద్రతకు తమ ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. తన అనుమతి లేకుండా తన ఫొటోలను ప్రచారానికి ఆప్ వాడుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే దీనిపై న్యాయపోరాటం చేసేందుకు తన వద్ద తగినంత సమయం లేదని పేర్కొన్నారు. ఈ ఎన్ని కల్లో తమ పార్టీ గెలుపు తథ్యమంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు.
మోదీ, బేడీ జోడీతోనే అభివృద్ధి
Published Mon, Jan 26 2015 10:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement