వెంకయ్య, నిర్మలా సీతారామన్‌లను ఎందుకు వద్దనుకున్నారు?
కేంద్రమంత్రులు ఎం వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌లకు బీజేపీ నాయకత్వం తిరిగి రాజ్యసభ టికెట్లు ఖరారు చేసినా, వారిని స్వరాష్ట్రం నుంచి కాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎందుకు నామినేట్ చేస్తున్నట్టు? రాష్ట్రానికి చెందిన వీరిద్దరినీ కాదని మహారాష్ట్రకు చెందిన మరో కేంద్రమంత్రి సురేష్ ప్రభును లేదా మరొకరినో ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రతిపాదించడంలోని ఆంతర్యమేంటి. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పొత్తు కొనసాగించే విషయంలో భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండేళ్ల కిందట రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో నిర్మలా సీతారామన్ బీజేపీ, టీడీపీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మిగిలిన రెండేళ్లకు మాత్రమే ఆమె ఎన్నిక కావడంతో వచ్చే జూన్ నెలాఖరుతో ఆమె పదవీ కాలం పూర్తవుతోంది. దాంతో ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ మిత్రపక్ష అభ్యర్థిగా నిర్మలా సీతారామన్‌ను తిరిగి ఏపీ నుంచే ఎంపిక చేస్తారని అంతా భావించారు.
కానీ అందుకు విరుద్ధంగా ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకాలం కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆ రాష్ట్రం నుంచి కాకుండా రాజస్థాన్ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. వెంకయ్యను తిరిగి కర్ణాటక నుంచి ఎంపిక చేయరాదని ఇటీవలి కాలంలో ఆ పార్టీకే చెందిన కొందరు వ్యతిరేకించడం, ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రతిస్పందనలు రావడంతో వెంకయ్యనాయుడును రాజస్థాన్ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు.
వెంకయ్యనాయుడును కర్ణాటక నుంచి మార్చాలంటే ఆయనను ఏపీ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉంది. కానీ బీజేపీ నాయకత్వం ఆ పని చేయలేదు. ఈ విషయంలో స్వయంగా వెంకయ్యనాయుడే వద్దనుకున్నారా లేక పార్టీ జాతీయ నాయకత్వం ఆ ఆలోచన చేసిందా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ వెంకయ్యను కాదనుకుంటే నిర్మలా సీతారామన్ ను తిరిగి ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నిలపడానికి వీలుంది. బీజేపీ నాయకత్వం ఆ పని కూడా చేయలేదు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరిద్దరిలో ఒకరికి ఇక్కడినుంచి ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరినీ వేర్వేరు రాష్ట్రాల నుంచి అభ్యర్థులుగా ప్రకటించి మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభు పేరును పరిశీలించడం బీజేపీ రాజకీయ వ్యూహంతో వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీతో పొత్తు కొనసాగించే వ్యవహారంలో ఇప్పటికే ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం రానున్న రోజుల్లో అప్పటి పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చన్న వ్యూహంతోనే ఏపీకి చెందిన వారిద్దరినీ కాదని వేరే రాష్ట్రానికి చెందిన నేతను ఎంపిక చేసినట్టు ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తు అంశాన్ని పునరాలోచన చేయాల్సిన పరిస్థితే వస్తే స్వరాష్ట్రం నుంచి నేతలు ఉంటే ఒత్తిడి వస్తుందన్న ఆలోచనతోనే వారిద్దరిని వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆ విషయంలో ఆ ఇద్దరు నేతలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశం కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉండొచ్చని వినిపిస్తోంది.