Rajya Sabha candidates
-
సానా, బీద పేర్లు ఖరారు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వ్యాపారవేత్తలు సానా సతీష్, బీద మస్తానరావు పేర్లను చంద్రబాబు ఎట్టకేలకు సోమవారం ఖరారు చేశారు. ఎన్డీయే కూటమి తరఫున మూడో స్థానాన్ని బీజేపీ కూడా తన అభ్యరి్థగా ఆర్. కృష్ణయ్యను ప్రకటించింది. రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారైన ఈ ముగ్గురూ మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వాస్తవానికి.. ఈ మూడు స్థానాలు అంతకుముందు వైఎస్సార్సీపీకి చెందినవే.కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీద మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. కృష్ణయ్యలను ప్రలోభాలతో రాజీనామా చేయించారు. ఆరి్థకంగా స్థితిమంతుడైన బీద మస్తానరావు రాజీనామా సమయంలోనే తిరిగి ఆ స్థానాన్ని తనకే కేటాయించేలా టీడీపీతో డీల్ కుదుర్చుకుని ఆ పార్టీలో చేరారు. కృష్ణయ్య సైతం మళ్లీ తనకే సీటు ఇచ్చే ఒప్పందంతో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తిరిగి సీట్లు ఇవ్వాలనే ఒప్పందం, భారీ ఆరి్థక లావాదేవీల నేపథ్యంలోనే వీరిద్దరికీ సోమవారం సీట్లను ఖరారుచేశారు.ఇక మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన స్థానాన్ని టీడీపీలో ప్రస్తుతం బలమైన లాబీయిస్టుగా ఉన్న సానా సతీష్‌కు కేటాయించారు. ఈయన గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. ఆయన చాలాకాలం నుంచి టీడీపీ, జనసేన పార్టీల కోసం పనిచేస్తూ భారీగా నిధులు సమకూరుస్తున్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీటు ఇచ్చారు.ఈ స్థానం కోసం మాజీ ఎంపీలు గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహనరావులు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. సానా సతీష్ లోకేశ్‌కి అత్యంత సన్నిహితుడిగా మారడం, పార్టీలో ఇప్పుడాయన చెప్పిన మాటే నడుస్తుండడంతో ఆయనకే రాజ్యసభ అవకాశం దక్కింది. పార్టీలో ఎంతోమంది సీనియర్లు, ముఖ్యులు ఉండగా వారందరినీ పక్కనపెట్టి లాబీయిస్టులుగా ఉన్న వీరిద్దరికీ పదవులివ్వడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. నాగబాబుకు మంత్రి పదవి.. నిజానికి.. ఈ మూడు స్థానాల్లో ఒకదాన్ని ఆశించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించి ఆ మేరకు ప్రకటన చేశారు. ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండింటిని టీడీపీ తీసుకోగా ఒకదాన్ని బీజేపీకి కేటాయించడంతో జనసేనకు అవకాశం లేకుండాపోయింది. అంతకుముందు.. సానా సతీష్‌కు ఇచి్చన స్థానాన్ని నాగబాబుకు ఇవ్వాలనే చర్చ జరిగింది. అయితే, సీఎం తనయుడు, మంత్రి లోకేశ్ సతీష్‌కే అవకాశమివ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో సతీష్‌కి రాజ్యసభ సీటు, నాగబాబుకి మంత్రి పదవిని ఖరారుచేశారు. మరోవైపు.. ఇప్పటిదాకా బీజేపీలో సభ్యత్వంలేని కృష్ణయ్య సోమవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆన్లైన్లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.టీడీపీలో తీవ్ర అసంతృప్తి.. ఇక ఈ ఎంపికలో చంద్రబాబు అనుసరించిన తీరుపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు, పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని కొత్తగా వచి్చన లాబీయిస్టులకు అవకాశం ఇవ్వడంపై ఆందోళన చెందుతున్నారు. ధనబలం ఉండి ఎక్కువ ఫండ్ ఇచ్చే వారికే చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారనే చర్చ జరుగుతోంది. యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహనరావు, వర్ల రామయ్య, దేవినేని ఉమా వంటి నేతలు కూడా ఈ పదవులను ఆశించినా వారిని పట్టించుకోలేదు. యనమల గతంలోనే తనను రాజ్యసభకు పంపాలని చంద్రబాబును కోరినా ఆయన ఆసక్తి చూపలేదు.ఇప్పుడూ ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కారణంతోనే ఇటీవల ఆయన చంద్రబాబును ధిక్కరిస్తూ లేఖ రాశారు. కాకినాడ సెజ్ భూముల వ్యవహారంలో చంద్రబాబు.. కేవీ రావుకు మద్దతిస్తూ ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుండగా యనమల కేవీ రావును దుయ్యబడుతూ చంద్రబాబుకే లేఖ రాశారు. వేల కోట్లు దోచేసిన కేవీ రావును వెనకేసుకుని రావడమేమిటనే రీతిలో లేఖాస్త్రం సంధించడం టీడీపీలో కలకలం రేపింది. కంభంపాటి కూడా రాజ్యసభ సీటు కోసం విశ్వప్రయత్నాలు చేసినా పట్టించుకోకపోవడంపై అసహనంతో ఉన్నారు. గత ఎన్నికల్లో తనకు మైలవరం సీటు ఇవ్వలేదని, ఇప్పుడు పదవుల విషయంలోనూ న్యాయం చేయడం లేదని ఉమా రగిలిపోతున్నారు. -
సీఎం జగన్ కి మా కృతజ్ఞతలు
-
వైఎస్సార్సీపీ ఖాతాలో మరో మూడు ఎంపీ స్థానాలు
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఈ మూడు స్థానాల గెలుపుతో.. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఏకగ్రీవమైన రాజ్యసభ సభ్యులకు ఎన్నికల అధికారులు ధృవ పత్రాలను అందించనున్నారు. కాగా, తాజా ఎన్నికలతో రాజ్యసభలో టీడీపీ జెండా మాయమయినట్టయింది. పార్టీ ఏర్పడిన 41 ఏళ్ల తర్వాత రాజ్యసభలో టీడీపీ సభ్యులు లేని పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ దీనస్థితికి ఇది నిదర్శనం. తన పార్టీకి బలం లేకున్నా.. చివరి వరకు ఓటుకు కోట్లు ఫార్ములా నమ్ముకున్న చంద్రబాబు.. ఆ ఎత్తులు పని చేయకపోవడంతో ఎన్నికల్లో అభ్యర్థిని దించే పని చెయ్యలేదు. చదవండి: 11/11 : రాజ్యసభలో YSRCP 100% స్కోరు -
బీజేపీ కొత్త వ్యూహం.. వారికి రాజ్యసభకు అవకాశం లేదు!
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల గెలుపే లక్ష్యంగా, పార్టీలో కీలకమైన నేతలకు లోక్‌సభలో ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. తాజాగా రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధిష్టానం కీలకమైన మార్పులు చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కేంద్ర మంత్రులకు మాత్రమే తిరిగి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించటం గమనార్హం. వచ్చే ఏప్రిల్ నెలలో పెద్దల సభలో బీజేపీ చెందిన 28 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న... ఏడుగురు కేంద్ర మంత్రులకు బీజేపీ తిరిగి రాజ్యసభకు అవకాశం ఇవ్వదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే వారిని వచ్చే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల బరిలో దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (గుజరాత్), విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), ఐటి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక). పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (రాజస్థాన్), మత్స్య మంత్రి పర్షోత్తమ్ రూపాలా (గుజరాత్), మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే(మహారాష్ట్ర), విదేశి వ్యవహరాల శాఖ మంత్రి వి. మురళీధరన్ (మహారాష్ట్ర)లు ఉన్నారు. అయా రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో ఏడుగురు మంత్రులకు బీజేపీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తన సొంతం రాష్ట్రం అయిన ఒడిశాలోని (సంబల్పూర్ లేదా ధేక్నాల్) సెగ్మెంట్ల నుంచి లోక్‌సభకు పోటీకి నిలపనున్నట్లు సమాచారం. మంత్రి భూపేందర్ యాదవ్‌ను రాజస్థాన్‌లోని (అల్వార్ లేదా మహేంద్రగఢ్) నియోజకవర్గం, మంత్రి చంద్రశేఖర్‌ను బెంగళూరులోని మూడు నియోజకవర్గాలు (సెంట్రల్, నార్త్, సౌత్)లో ఏదో ఒక స్థానంలో బరిలో దించనుంది. మంత్రి మాండవియాను గుజరాత్‌లోని (భావ్‌నగర్ లేదా సూరత్), మంత్రి రూపాలా రాజ్‌కోట్ నుంచి బీజేపీ పోటీలో నిలపనుంది. మంత్రి మురళీధరన్‌కు తన సొంత రాష్ట్రం కేరళ నుండి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ బీజేపీకి ఉనికి లేనప్పటికీ ఈసారి గెలుపే లక్ష్యంగా మురళీధరన్‌ను అక్కడ నిలబెడుతుందని సమాచారం. రెండు దఫాల్లో రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కేంద్ర మంత్రుకే తిరగి అవకాశం కల్పించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (ఒడిశా), ఫిషరీస్ మంత్రి ఎల్ మురుగన్ (మధ్యప్రదేశ్)లకు బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. రాజ్యసభలో బీజేపీకి చెందిన 28 మంది సభ్యులు పదవీ విరమణ చేయనుండగా.. ఇప్పటివరకు అయితే కేవలం నలుగురు సభ్యులను మాత్రమే తిరిగి ఎంపిక చేయటం గమనార్హం. బీజేపీ పెద్దల సభకు కొత్తవారికి అవకాశం కల్పించటంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడుగురు మంత్రులను కూడా రాజ్యసభకు కాకుండా పార్లమెంట్ ఎన్నికల బరి దించనున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ: ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ
ఢిల్లీ: తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక.. అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, చంద్రశేఖర్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి ఎంపిక చేసింది. మధ్య ప్రదేశ్ నుంచి అశోక్‌సింగ్‌ను ఏఐసీసీ ఎంపిక చేసింది. వీరంతా రేపు(గురువారం) నామినేషన్ వేయనున్నారు. రేణుకా చౌదరీ ఎవరి కోటా.? తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపిక చేసిన రేణుకా చౌదరీ పేరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విశాఖలో పుట్టిపెరిగిన రేణుకా చౌదరీ.. బెంగళూరులో చదువుకున్నారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1986 నుంచి 1998 వరకు తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా పని చేశారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 1998లో టిడిపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేణుకా ఖమ్మం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. వివాదస్పద ప్రకటనలు చేసి తరచుగా వార్తల్లోకెక్కే రేణుకా చౌదరీ మరోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. అనిల్ కుమార్ యాదవ్ పేరు ఆశ్చర్యమే.! తెలంగాణ నుంచి తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానికి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటన వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "నాలాంటి యువకుడికి అధిష్ఠానం రాజ్యసభ అవకాశం ఇవ్వడం అనందంగా ఉంది. కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు దక్కుతాయి అనడానికి ఇదే ఉదాహరణ. నాకు పదవి ఇవ్వడం అంటే యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి గుర్తించినట్టు.!. బీసీల తరపున కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు. కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తేవడమే రాహుల్ గాంధీ లక్ష్యం. బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ, నాకు రాజ్యసభ ఇవ్వడంతో కాంగ్రెస్ యువతకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. రాజ్యసభ అవకాశం ఇస్తారని.. నా జీవితంలో ఊహించలేదు" అని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. -
బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో బీజేబీ 12 మందితో రాజ్యసభ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. గుజరాత్ నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, మధ్యప్రదేశ్‌ను నలుగురు, ఒడిషా నుంచి ఒకరిని అభ్యర్థులుగా ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. గుజరాత్ నుంచి జేపీ నడ్డా, గోవింద్‌భాయ్ డోలాకియా, మయాంక్‌భాయ్ నాయక్, శ్వంత్‌సిన్హ్ జలంసింహ పర్మార్‌లను ఎంపిక చేయగా.. మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్, మేధా కుల్కర్ణీ, అజిత్ గోప్‌చాడేలతోమ కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి డా. ఎల్. మురుగన్, ఉమేష్‌నాథ్ మహారాజ్, బన్సిలాల్ గుర్జార్, మాయా నరోలియాలను ఎంపిక చేశారు. ఓడిశా నుంచి అశ్వీణీ వైష్ణవ్‌కు మరోసారి బీజేపీ అవకాశం కల్పించింది. ఇక..మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం బీజేపీలో చేరిన మాజీ సీఎం అశోక్ చౌహన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయటం గమనార్హం. గత ఆదివారం రాజ్యసభకు 14 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి విడత జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదిటి విడతలో ఉత్తరప్రదేశ్(7), బిహార్(2), చత్తీస్ఘఢ్(1), హర్యానా(1), కర్ణాటక(1), ఉత్తరాఖండ్(1), పశ్చిమ బెంగాల్(1) చొప్పున అభ్యర్థులను బీజేపీ జాబితా విడుదల చేసింది. ఇక.. 15 రాష్ట్రాల్లో ఏప్రిల్‌తో 56 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. -
నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు
-
సీఎం జగన్ ను కలిసిన YSRCP రాజ్యసభ అభ్యర్ధులు..
-
RS Election: YSRCP అభ్యర్థుల నామినేషన్ల దాఖలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ తరపున ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులైన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు.. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సీఎంను కలిసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్ధులకు సీఎం జగన్ బీఫాం అందజేశారు. సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్సార్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు నలుగురికు రాజ్యసభకు అవకాశం కల్పించగా.. తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. శాసన సభలో అత్యధిక బలం తమకే ఉందని, వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులం విజయం సాధిస్తామని చెప్పారు. సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, మళ్ళీ వైఎస్ జగన్‌ను గెలిలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రఘునాథరెడ్డి, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సీఎం జగన్ నాకు అవకాశం కల్పించారు సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాం రాష్ట్ర ప్రయోజనాలకోసం పనిచేస్తాం గొల్ల బాబూరావు, రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి సీఎం జగన్ చరిత్ర సృష్టించారు పేద వర్గాల వారికి రాజ్యసభ కి పంపిస్తున్నారు కోట్లు ఇచ్చిన దొరకని రాజ్యసభ స్థానాన్ని దళితుడినైన నాకు ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ విజయం తథ్యం మూడు స్థానాలు కూడా మేమే గెలుస్తాం చంద్రబాబు గతంలో దళితుడైన వర్ల రామయ్య ను అవమానించారు రాజ్యసభ సభ్యుడిని చేస్తానని మోసం చేశారు తన కులానికి చెందిన కనకమేడల కోసం వర్ల రామయ్య ని అవమానించారు సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు మేమే దక్కించుకుంటాం -
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
సాక్షి, ఢిల్లీ: పద్నాలుగు మంది రాజ్యసభ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. యూపీ నుంచి ఏడుగురిని, బీహార్ నుంచి ఇద్దరిని, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్,ఛత్తీస్‌గఢ్, వెస్ట్‌బెంగాల్ నుంచి ఒక్కొక్కరిని రాజ్యసభకు బీజేపీ ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్పీఎన్ సింగ్, డా.సుధాన్షు త్రివేది, తేజ్వీర్ సింగ్, సాధనాసింగ్, అమర్‌పాల్ మౌర్యా, డా సంగీత బల్వంత్, నవీన్‌జైన్‌ను అభ్యర్థులుగా బీజేపీ ఖారారు చేసింది. బిహార్ నుంచి ధర్మ్‌శీల గుప్తా, డా.భీంసింగ్.. ఛత్తీస్‌గఢ్ నుంచి దేవేంద్ర ప్రతాప్‌సింగ్, హర్యానా నుంచి సుభాష్ బరాలా, కర్ణాటక నుంచి నారాయణ కృష్ణాంశ, ఉత్తరాంఖండ్ నుంచి మహేంద్ర భట్, వెస్ట్ బెంగాల్ నుంచి సామిక్ భట్టాచార్యను ఖారారు చేస్తూ బీజేపీ జాబితా ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల కాగా.. 15 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది. అలాగే 16న నామినేషన్ల పరిశీలన, 20న విత్ డ్రాకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి: ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా? -
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి,అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులను గురువారం ఖరారు చేశారు. పార్టీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేశారు. ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ అభినందించారు. గురువారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు అభ్యర్థులు సీఎం జగన్‌ను కలిశారు. తమకు రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించినందుకు వారు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిది: మేడా రఘునాధరెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుణం తీర్చుకోలేనిది అని మేడా రాఘునాధరెడ్డి చెప్పారు. రాజ్యసభ అభ్యర్థులు రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని రఘునాధరెడ్డి చెప్పారు. వైఎస్సార్ మరణాంతరం వైఎస్ జగనే తమకు పెద్ద దిక్కని నమ్ముకున్నామన్నారు. సీఎం జగన్ తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని అన్నారు. ఊపిరి ఉన్నంతవరకు సీఎం జగన్ ఏది ఆదేశిస్తే అదే చేస్తామని చెప్పారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ బాధ్యత అప్పగించినా విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఇది సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు: వైవీ సుబ్బారెడ్డి పారీ్టకి క్రమ శిక్షణతో పనిచేసిన తమకు ఇది సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సీఎం జగన్ తమపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. నమ్మిన వారిని ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్తారు : గొల్ల బాబూరావు వైఎస్సార్ కుటుంబాన్ని నమ్మిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్తారని గొల్ల బాబూరావు అన్నారు. వైఎస్సార్ తర్వాత వైఎస్ జగన్‌ను నమ్మానని, కష్ట కాలంలో ఆయన వెంట అడుగులో అడుగేసి నడిచానని చెప్పారు. ‘అన్న నేను ఉన్నాను.. నిన్ను చూసుకుంటాను’ అని అన్నారని, అలాగే ఉన్నత స్థానం కోసం అవకాశం కల్పించారని తెలిపారు. తుది శ్వాస వరకు సీఎం జగన్ వెంట నడుస్తానని, వైఎస్సార్సీపీ గెలుపే ధ్యేయంగా పని చేస్తానని ఆయన చెప్పారు. -
రాజ్యసభకు డాక్టర్ కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు కె.లక్ష్మణ్‌కు ఆ పార్టీ రాజ్యసభ చాన్స్ ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం, సీనియర్లకు సముచిత గౌరవం ఇవ్వడం లక్ష్యంగా పార్టీ అధిష్టానం లక్ష్మణ్‌కు ఈ అవకాశం ఇచ్చినట్టుగా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. యూపీ నుంచి లక్ష్మణ్‌ను రాజ్యసభకు పంపనున్నారు. ఈ మేరకు నామినేషన్ వేసేందుకు ఆయన మంగళవారం యూపీలోని లక్నోకు వెళ్లనున్నారు. తనకు రాజ్యసభ అవకాశం కల్పించడం పట్ల కె.లక్ష్మణ్ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘సాధారణ కార్యకర్తకు లభించిన గౌరవం, గుర్తింపు ఇది. బీజేపీ తప్ప మరే పార్టీలోనూ ఇది సాధ్యం కాదు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలకు కృతజ్ఞతలు’’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఏబీవీపీ నుంచి మొదలై.. 1956 జూలై 3న హైదరాబాద్‌లో జన్మించిన లక్ష్మణ్.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, పీహెచ్డీ చేశారు. ఆయనకు భార్య ఉమ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బీసీ–మున్నురుకాపు çవర్గానికి చెందిన లక్ష్మణ్ ఓయూలో చదువుతున్నపుడే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో పనిచేశారు. 1980లో బీజేపీలో చేరారు. 1995–1999 మధ్య పార్టీ హైదరాబాద్ నగరశాఖకు అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా ఎదిగారు. 2016–2020 మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా.. 1994లో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కోదండరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 1999లో అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. తర్వాత 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2020 సెప్టెంబర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలంగాణ నుంచి బీజేపీ తరఫున మొదటిసారిగా రాజ్యసభకు వెళ్తున్నది లక్ష్మణే కావడం గమనార్హం. -
సోనియా జీ.. నాకు ఆ అర్హతే లేదా?: నటి నగ్మా
ముంబై: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయ్. నాయకత్వ లోపాల కారణంగా సీనియర్లు సైతం ఓవైపు పార్టీని వీడుతుంటే.. మరోవైపు ఇప్పుడు ‘రాజ్యసభ’ చిచ్చు మరికొందరిలో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది. తాజాగా మాజీ నటి, కాంగ్రెస్ నేత నగ్మా కాంగ్రెస్‌పై బహిరంగంగానే వ్యతిరేక పోస్ట్ చేశారు. సోనియా జీ.. కాంగ్రెస్ చేరిక సమయంలో రాజ్యసభ సీటును నాకు ఇస్తామని ఆఫర్ చేశారు. 2003 నాటికి కాంగ్రెస్ అధికారంలో లేదు. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు అవకాశం కోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. ఇప్పుడు ఇమ్రాన్(ఇమ్రాన్ ప్రతాప్ఘడిని ఉద్దేశించి)ను మహారాష్ట్ర నుంచి పెద్దల సభకు పంపిస్తున్నారు. అసలు నాకు ఆ అర్హతే లేదా? అని నగ్మా ట్విటర్ ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. SoniaJi our Congress president had personally committed to accommodating me in RS in 2003/04 whn I joined Congressparty on her behest we weren’t in power thn.Since then it’s been 18Yrs they dint find an opportunity Mr Imran is accommodated in RS frm Maha I ask am I less deserving — Nagma (@nagma_morarji) May 30, 2022 మా 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు వెనుకబడి పోయింది అంటూ ఓ ట్వీట్లో వైరాగ్యం ప్రదర్శించారు ఆమె. हमारी भी १८ साल की तपस्या कम पड़ गई इमरान भाई के आगे । https://t.co/8SrqA2FH4c — Nagma (@nagma_morarji) May 29, 2022 ఇదిలా ఉంటే.. జూన్ 10న జరగబోయే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఏడు రాష్ట్రాల నుంచి పది మంది సభ్యులతో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాజీవ్ శుక్లా, రంజిత్ కుమార్, హర్యానా నుంచి అజయ్ మాకెన్, మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్‌ఘడి, కర్ణాటక నుంచి జైరామ్ రమేష్, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ తన్హా, తమిళనాడు నుంచి చిదంబరం, రాజస్థాన్ నుంచి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తావారి(ముగ్గురు రాజస్థాన్ వాళ్లు కాకపోవడం గమనార్హం) పేర్లను ప్రకటించింది. ఇక బీజేపీ ఎనిమిది రాష్ట్రాల నుంచి 16 మందికి సీట్లు ఖారారు చేసింది. వీరిలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్(మహారాష్ట్ర), నిర్మలా సీతారామన్(కర్ణాటక) సైతం ఉన్నారు. Congratulations to all those who made it to the Rajya Sabha @ShuklaRajiv ji Ranjeet Ranjan ji @ajaymaken ji @Jairam_Ramesh ji @VTankha ji @ShayarImran ji @rssurjewala ji @MukulWasnik ji @pramodtiwari700 ji & @PChidambaram_IN ji. And to all those who r selected to the Rajya Sabha https://t.co/GSQ070QgOk — Nagma (@nagma_morarji) May 30, 2022 -
బీసీ వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం: విజయసాయిరెడ్డి
-
దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం
-
రాజ్య సభకు పారిశ్రామికవేత్తలు
-
వైఎస్సార్సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ నాలుగు స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా జూన్ 21తో పదవీ కాలం ముగియనున్న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సామాజిక వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావును ఎంపిక చేసి ఆయా వర్గాల అభ్యున్నతి పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డికి అవకాశం కల్పిస్తూ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ముఖ్య నేతలతో మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన అనంతరం పార్టీ అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. బీసీలకు సముచిత స్థానం: బొత్స అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిపాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక సాధికారతతో ఆయా వర్గాలను ప్రగతిపథంలో తేవాలన్నదే సీఎం లక్ష్యం. రెండేళ్ల క్రితం రాజ్యసభకు నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. నామినేటెడ్ పదవులతోపాటు నామినేషన్ పనుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ లేని రీతిలో సీఎం జగన్ 50 శాతం రాజ్యసభ స్థానాలను బీసీలకు కేటాయించారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్: సజ్జల బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆది నుంచి చెప్పడమే కాకుండా ఆచరించి చూపుతున్నారు. నాలుగు రాజ్యసభ స్థానాలకుగానూ రెండు స్థానాలను బీసీలకే కేటాయించారు. బీసీల అభ్యున్నతి కోసం జాతీయ స్థాయిలో రాజీలేని పోరాటం చేస్తున్న, బలహీన వర్గాలకు ఆర్.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. రాజ్యసభలో బీసీల గొంతుకను వినిపించి ఆ వర్గాలకు న్యాయం చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ఈ క్రమంలో బీసీ వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల క్రితం కూడా ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపారు. బీసీలకు చంద్రబాబు కత్తెరలు, ఇస్త్రీపెట్టెలు, పనికిరాని పనిముట్లు అంటగడితే... చట్టసభలు, మంత్రివర్గం, నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారు. వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల నేపథ్యాలు ఇవే.. 1.ర్యాగ కృష్ణయ్య పుట్టిన తేదీ: సెప్టెంబర్ 13, 1954 విద్యార్హతలు: ఎంఏ, ఎంఫిల్, ఎల్ఎల్ఎం (గోల్డ్ మెడల్) సొంతూరు: రాళ్లడుగుపల్లి, మొయిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ ► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994లో బీసీ సంఘం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ► విద్యార్థి దశ నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ► నిరుద్యోగుల కోసం 12 వేలకుపైగా ఉద్యమాలు, పోరాటాలతో రెండు వేలకుపైగా ప్రభుత్వంతో జీవోలు ఇప్పించారు. ► 2014లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ► 2018లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2. వేణుంబాక విజయసాయిరెడ్డి పుట్టిన తేదీ: జూలై 1, 1957 సొంతూరు: తాళ్లపూడి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యార్హతలు: చార్టర్డ్ అకౌంటెంట్ పదవులు: ► ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ► వరుసగా రెండుసార్లు టీటీడీ సభ్యుడిగా సేవలందించారు. ► వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభ (2016 జూన్ 22 నుంచి 2022 జూన్ 21 వరకు)కు ఎంపికయ్యారు. ► వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అనుబంధ సంఘాల ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► పెట్రోలియం, సహజవాయువు స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ► రాజ్యసభలో పది ప్రైవేటు మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. 3. బీద మస్తాన్‌రావు పుట్టిన తేదీ: జూలై 2, 1958 సొంతూరు: ఇస్కపల్లి, అల్లూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తల్లిదండ్రులు: రమణయ్య, బుజ్జమ్మ కుటుంబం: భార్య మంజుల, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విద్యార్హతలు: బీకాం, సీఏ (ఇంటర్) ► యాదవ సామాజికవర్గానికి చెందిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ► చెన్నైలో ప్రముఖ హోటల్ గ్రూప్‌లో ఫైనాన్షియల్ మేనేజర్‌గా పనిచేశారు. ► అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. వేలాది మందికి ఉద్యో్గగావకాశాలు కల్పించారు. ► కేంద్ర మత్స్య మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసలు పొందారు. ► బోగోల్ మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ► 2004 ఎన్నికల్లో అల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ► 2009 ఎన్నికల్లో కావలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ► 2014–19 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని డెవలప్మెంట్ అథారిటీ సలహా సభ్యులుగా పనిచేశారు. ► 2019లో నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ► 2019 డిసెంబర్లో వైఎస్సార్సీపీలో చేరారు. ► బీఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ► కోవిడ్ సమయంలో రూ.2.25 కోట్లు విలువ చేసే 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, రూ.కోటి విలువైన మొబిలైజర్స్ కోసం జిల్లా కలెక్టర్‌కు విరాళం ఇచ్చారు. ► 1998లో యూనివర్సిటీ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్ వాషింగ్టన్, యూఎస్ఏ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 4. నిరంజన్‌రెడ్డి పుట్టిన తేదీ: జూలై 22, 1970 సొంతూరు: నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ విద్యార్హతలు: హైదరాబాద్‌లో ఉన్నత విద్య, పుణెలో ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబయాసిస్‌లో న్యాయ విద్యను అభ్యసించారు. ► ఉమ్మడి రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ► 1994–95 నుంచి సుప్రీంకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ► రాజ్యాంగ అంశాలతోపాటు విభిన్న చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందారు. ► ఎన్నికల సంఘంతోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కొంతకాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. -
సామాజిక మహావిప్లవంలో ‘పెద్ద’ అడుగు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆవిష్కృతమైన సరికొత్త సామాజిక మహావిప్లవంలో మరో ముందడుగు పడింది. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 2 అంటే 50 శాతం స్థానాల్లో బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు(యాదవ)లను వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. ‘బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్’ అని 2019 ఫిబ్రవరి 18న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో స్పష్టం చేసిన సీఎం జగన్ మరోసారి ఆచరించి చూపారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఉమ్మడి ఏపీలో, రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో అలుపెరగని పోరాటాలు చేపట్టిన కృష్ణయ్య, విద్యావంతుడైన బీద మస్తాన్‌రావులను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా ఆ వర్గాల వాణిని పార్లమెంట్లో బలంగా వినిపించి సమస్యలు పరిష్కరించాలన్నది సీఎం లక్ష్యమని విశ్లేషిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా.. రెండేళ్ల క్రితం నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లను బీసీలైన పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టిబలిజ), మోపిదేవి వెంకటరమణ(మత్స్యకార)లకు సీఎం జగన్ కేటాయించి పెద్దల సభలో అవకాశం కల్పించారు. మూడేళ్లలో ఏపీ నుంచి ఖాళీ అయిన 8 రాజ్యసభ స్థానాల్లో సగం అంటే 4 స్థానాలను బీసీ వర్గాలకే కేటాయించడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ 50% రాజ్యసభ పదవులను బీసీలకు ఇచ్చిన దాఖలాలు లేవని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చట్టసభల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీ బిల్లును ప్రైవేట్ బిల్లుగా రాజ్యసభలో వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా ప్రవేశపెట్టడం, తాజాగా సగం సీట్లను వారికే కేటాయించడం బీసీల అభ్యున్నతిపై సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సాధికారతే లక్ష్యంగా.. ► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు (86.29 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో(88 శాతం) వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. మే 30, 2019న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ► జూన్ 8, 2019న తొలిసారిగా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 14 పదవులు (56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించి సామాజిక విప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఓసీ వర్గాలకు 11 పదవులు(44%) ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ స్థాయిలో మంత్రివర్గంలో స్థానం కల్పించిన దాఖలాలు లేవు. ► ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. నాలుగు (80%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అవకాశం కల్పించారు. ఎస్సీ మహిళ మేకతోటి సుచరితకు హోంమంత్రిగా అవకాశమిచ్చారు. దేశ చరిత్రలో రాష్ట్ర హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం అదే ప్రథమం. ► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌రాజు, మైనార్టీ మహిళ జకియా ఖానంలకు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో మండలి ఛైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళను నియమించడం ఇదే తొలిసారి. ► ఈ ఏడాది ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అందులో బీసీ, మైనార్టీలకు 11 పదవులు ఇచ్చారు. మాటల్లో కాదు.. చేతల్లో పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాతినిధ్యం ఇస్తే ద్వారా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అట్టడుగు వర్గాలకు చేరతాయని, ఇది ఆయా వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన, సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు బాటలు వేస్తుందన్నది సీఎం జగన్ విశ్వాసం. ► మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించారు. ► పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో తొమ్మిది (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67% పదవులను కేటాయించారు. ► 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 7 చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మేయర్ పదవుల్లో 92% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకోగా చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 % ఇచ్చారు. ► నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం వైఎస్సార్సీపీ సర్కారే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం వైఎస్ జగన్ సర్కారే. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60%పదవులు ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39%) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58% పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42%) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58% డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. -
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు.. నేపథ్యాలు ఇవే!
సాక్షి, అమరావతి: జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తూ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది వైఎస్సార్సీపీ. పైగా గత మూడేళ్లలో అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది కూడా. తాజాగా పెద్దల సభకు పంపుతున్న అభ్యర్థుల నేపథ్యాలను ఓసారి చూసుకుంటే.. ఆర్ కృష్ణయ్య ► ప్రముఖ బీసీ సంఘ ఉద్యమ నేత. ► సెప్టెంబర్ 13, 1954 వికారాబాద్ జిల్లా మొయిన్‌పేట మండలం రాళ్ళడుగుపల్లి లో జన్మించారు. ► ఎంఏ, ఎంఫిల్‌తో పాటు న్యాయ విద్యను సైతం అభ్యసించారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు కూడా. ► విద్యార్థి దశ నుంచే చురుకుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ► నిరుద్యోగుల కోసం 12 వేలకు పైగా ఉద్యమాలు.. పోరాటాలతో రెండు వేలకు పైగా జీవోలు సాధించిన ఉద్యమ నేతగా ఆర్.కృష్ణయ్యకు గుర్తింపు. ► ఎస్సీ, ఎస్టీ, బీసీల తరపున పోరాటాల్లో పాల్గొన్నారు ఆర్ కృష్ణయ్య. ► నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగుల తరపున నిరంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం సైతం పోరాటాలు చేశారు. ► 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా, రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా.. ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ► క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టి.. 2014లో ఎల్బీనగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ► 2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుండి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. బీద మస్తాన్‌రావు ► ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్సీపీ నేత బీద మస్తాన్‌రావు. ► జులై 2, 1958లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి గ్రామంలో జననం. ► విద్యార్హత బీకాం, సీఏ(ఇంటర్). బీసీ యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. స్థానికంగా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. ► చెన్నైలో ఓ ప్రముఖ హోటల్ గ్రూప్‌నకు ఫైనాన్షియల్ మేనేజర్‌గా పని చేసిన బీద మస్తాన్‌రావు.. అనతి కాలంలోనే ఆక్వా రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ► బోగోల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగానూ పని చేశారు. ► బీసీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కార్మిక, పరిశ్రమల, ఉపాధి శిక్షణ, పర్యాటక, సాంకేతిక సమాచార విభాగాల స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశారు. ► 2019లో నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేశారు కూడా. 2014 నుంచి 19 మధ్య క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అడ్వైజరీ మెంబర్‌గానూ పనిచేశారు. ► రాజకీయాలు, వ్యాపారాలతో పాటు సామాజిక సేవ, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు దక్కించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల పనితీరును పరిశీలిస్తున్నారు బీద మస్తాన్‌రావు. విజయసాయి రెడ్డి ► వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి. పూర్తి పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. ► 1957 జూలై 1న నెల్లూరు జిల్లా, తాళ్ళపూడి గ్రామంలో జననం. ► చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ చేసిన విజయసాయిరెడ్డి.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ గా పనిచేశారు. ► రెండుసార్లు వరుసగా టీటీడీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ► వైఎస్సార్సీపీ తరపున ఏకగ్రీవంగా ఇంతకు ముందు రాజ్యసభకు ఎన్నికై.. 22వ తేదీ జూన్ 2016 నుంచి 21 జూన్ 2022 వరకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహించారు. ► రాజ్యసభలో 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు విజయసాయి రెడ్డి(64). అంతేకాదు.. రూల్స్, పెట్రోలియం & సహజ వాయువు స్టాండింగ్ కమిటీలోనూ సభ్యుడిగా పని చేశారు. నిరంజన్ రెడ్డి ► సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుభవం ఉన్న న్యాయ నిపుణుల్లో ఒకరు. ► జులై 22 1970 అదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో జననం. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. ► హైదరాబాద్‌లోనే ఉన్నత విద్యంతా పూర్తి. పుణెలోని ప్రఖ్యాత న్యాయ కళాశాల సింబియాసిస్‌లో న్యాయవిద్య అభ్యసించించారు నిరంజన్‌రెడ్డి. ► ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 1992 నుంచి హైకోర్టు అడ్వొకేట్‌గా ప్రాక్టీస్. 1994-95 మధ్య సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ► రాజ్యాంగపరమైన అంశాలతోపాటు వేర్వేరు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక కేసులు వాదించిన నిరంజన్ రెడ్డి .. ఎన్నికల సంఘంతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కొంత కాలం స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. ► ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా పలు కేసుల్లో సేవలందించారు కూడా. -
రాజ్యసభకు నలుగురు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఖరారు
-
ఏపీ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్లను ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స, సజ్జల మీడియాకు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు బొత్స వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైఎస్సార్సీపీది ఒకేటే దారి అని, జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామన్నారు సజ్జల. గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధిని వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోందని సజ్జల తెలిపారు. -
కేజ్రీవాల్ ‘కీ’ స్టెప్.. రాజ్యసభకు హర్భజన్ సింగ్‌తో మరో నలుగురు.. ఎవరంటే..?
ఛండీగఢ్: జాతీయ పార్టీలకు షాకిస్తూ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తోంది పంజాజ్ భగవంత్ మాన్ సర్కార్. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ, మంత్రులకు టార్గెట్ ఇచ్చిన ఆప్ ప్రభుత్వం మరో సంచలన ప్రకటన చేసింది. ఐదుగురు విభిన్న వర్గాలకు చెందిన వ్యక్తులను రాజసభ్యకు నామినేట్ చేస్తూ దేశ రాజకీయాలను ఆకర్షించింది. సోమవారం పంజాబ్ రాష్ట్రం నుంచి ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. పంజాబ్ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఐదుగురు నూతన సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆప్ అభ్యర్థులుగా ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, క్రికెటర్ హర్భజన్ సింగ్, ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పియు) వ్యవస్థాపకుడు, ఛాన్సలర్ అశోక్ మిట్టల్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలను రాజ్యసభకు నామినేట్ చేసింది. నామినేషన్ దాఖలుకు సోమవారం చివరి రోజు కాగా మార్చి 31న ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న రాఘవ్ చద్దా.. అతిచిన్న వయసులో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అంతేకాకుండా చద్దా.. పంజాబ్ ఆప్ పార్టీ ఇంచార్జ్‌గా, ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ అందరికీ తెలిసిన వ్యక్తి. ఢిల్లీ ఐఐటి ప్రొఫెసర్ సందీప్ పాఠక్ చాలా కాలంగా ఆప్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు పాఠక్ అత్యంత సన్నిహితుడు. ఎన్నికల వ్యూహాల రచించడంతో కీలక పాత్ర పోషించారు. ఇక, విద్యా రంగంలో చేస్తున్న సేవలను గుర్తించిన ఆప్.. పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్‌ను తమ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాకు కూడా ఆప్ అవకాశం ఇచ్చింది. Meet AAP's 5 new Rajya Sabha MPs 🥳 1. Ashok Mittal 2. Harbhajan Singh 3. Raghav Chadha 4. Sandeep Pathak 5. Sanjeev Arora pic.twitter.com/wlRuemaajc — AAP (@AamAadmiParty) March 21, 2022 -
రాజ్యసభకు 12 మంది పేర్లను ప్రకటించిన కాంగ్రెస్
న్యూఢిల్లీ: రాజ్యసభకు 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వీరిలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, హరియాణా మాజీ సీఎం భూపీందర్ సింŠ హూడా కుమారుడు దీపేందర్ హూడా, న్యాయవాది కేటీఎస్ తుల్సి ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి దిగ్విజయ్ సింగ్, ఫూల్సింగ్ బరైయాలను ప్రకటించింది. ఈ రాష్ట్రంలో ఉన్న మూడు సీట్లకు గాను ఒక సీటుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టిపోటీ నెలకొంది. కాగా, ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ ఎన్నికలకు గాను ఇప్పటికే 9 మంది పేర్లను ప్రకటించిన బీజేపీ గురువారం మరో ఐదుగురి పేర్లను ప్రకటించింది. వీరిలో వెనుకబడిన వర్గానికి చెందిన నేత రామ్‌చంద్ర జంగ్రా, హరియాణాకు చెందిన దళిత నేత, పార్టీ ఉపాధ్యక్షుడు దుష్యంత్‌కుమార్ గౌతమ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇందు గోస్వామి, మహారాష్ట్ర నుంచి భగవత్ కరాడ్, మధ్యప్రదేశ్ నుంచి సుమేర్ సింగ్ సోలంకి ఉన్నారు. -
‘ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది’
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను నియమించిన ప్రక్రియ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ అన్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ పార్టీ బీ-ఫామ్‌ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. అనంతరం మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బీసీలకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు స్థానాలు బీసీలకు.. రాష్ట్ర అభివృద్ధి కోసం నత్వానికి.. పారిశ్రామిక అభివృద్ధి కోసం అయోధ్య రామిరెడ్డికి సీటు ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాయకులను చంద్రబాబు నాయుడులా వాడుకొని వదిలేయడం సీఎం జగన్‌కు తెలియదు. చంద్రబాబు నాయకులను కరివేపాకుల వాడి వదిలేస్తారు. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రధమ స్థానంలో సీఎం జగన్ ఉంటారు. బీసీ వర్గాలకు చెందిన తమకు రాజ్యసభ పదవులు వస్తాయని అనుకోలేద’ని అన్నారు. ( సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు ) ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారు : అయోధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా మేకిన్ ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వైఎస్ జగన్ రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉంది : నత్వాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి పరిమల్ నత్వాని అన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై తమ ఛైర్మన్ అంబానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించారని తెలిపారు. -
సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లిన రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, మోపిదేవి వెంకటరమణరావులు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ పార్టీ బీ-ఫామ్‌ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, ఎంపీ భరత్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పాల్గొన్నారు. (సగం బీసీలకే; బోస్, మోపిదేవిలకు అవకాశం) -
చంద్రబాబు నాటకంలో దళితులే పావులా ?
-
3 సీట్లు... 5 నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్ల కోసం టీఆర్ఎస్ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌రావు, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. శ్రమశక్తి పార్టీకి చెందిన జాజుల భాస్కర్ కూడా నామినేషన్ వేశారు. దీంతో ఈసారి రాజ్య సభ స్థానాలకు పోలింగ్ అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సోమవారం ఉదయం తొలుత టీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్. వి.నర్సింహాచార్యులకు అందజేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల, జగదీశ్‌రెడ్డి, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం, టి.పద్మారావు, చీఫ్ విప్ కొప్పుల, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు వెంటరాగా అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామినేషన్లను దాఖ లు చేశారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ సోమవారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్య దర్శికి అందజేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ ఉప నేత గీతారెడ్డి, విప్ సంపత్‌లతో కలసి ఆయన రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లను మంగళ వారం స్క్రూటినీ చేయనున్నారు. అనం తరం ఈనెల 15వ తేదీ వరకు ఉపసంహ రణ గడువు ఉంటుంది. ఈలోగా ఎవరైనా నామినేషన్‌ను ఉపసంహరించుకుంటే ము గ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం కచ్చితంగా పోటీ చేయాలని, పోలింగ్ జరిగేలా చూడాలని యోచిస్తోంది. తద్వారా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని మరోసారి తెరపైకి తేవాలన్న వ్యూహంతో తమ అభ్యర్థి చేత నామినేషన్ దాఖలు చేయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న పోలింగ్ అనివా ర్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
ఊరించి.. చివరికి హ్యాండిచ్చి
సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక తీరుపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆశావహులను చివరి వరకు ఊరించి, చివరకు హ్యాండివ్వడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేవలం వ్యక్తిగత, రాజకీయ అవసరాలే ప్రాతిపదికన సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ ఎంపికపై సీనియర్లు రగిలిపోతున్నారు. అధినేత చెప్పే మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన ఉండడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. అభ్యర్థుల ఖరారును చివరి వరకు సాగదీసి, చివరకు తమకు నచ్చిన వారికి ఇవ్వడం పార్టీ అధినాయకత్వానికి పరిపాటిగా మారిందని అంటున్నారు. గతంలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్‌లకు రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు, ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించారని చెబుతున్నారు. పార్టీకి ఆది నుంచి సేవలందిస్తున్న వారిని కాదని గతంలో టీజీ వెంకటేష్‌కు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎంతో మంది రాజ్యసభ సీటు ఆశించారని, వారందరినీ కాదని రవీంద్ర కుమార్‌ను ఎంపిక చేశారని, ఇది పార్టీ నేతలను విస్మరించడమేనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రాజ్య సభ స్థానంపై రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, పార్టీ సీనియర్ నేతలు బీద మస్తాన్‌రావు, వర్ల రామయ్య, మసాల పద్మజ, నల్లగట్ల స్వామిదాసు, హేమలత, జూపూడి ప్రభాకర్ వంటి వారు ఆశలు పెట్టుకున్నారు. పార్టీకి తాము చేసిన సేవలను అధినాయకత్వానికి వివరించి, రాజ్య సభకు అవకాశం ఇవ్వాలని కోరారు. వారికి న్యాయం చేస్తామని అధినాయకత్వం చెప్పింది. దీంతో వారు తమకు సీటు వస్తుందని కోటి ఆశలతో ఎదురు చూశారు. చివరి వరకు వారిని ఊరించిన అధినాయకత్వం, చివరకు తమకు నచ్చిన వారిని రాజ్యసభకు ఎంపిక చేసింది. మరీ ముఖ్యంగా వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దాదాపు ఖరారయింది. ఈమేరకు పార్టీ నాయకత్వం లీకులు కూడా ఇచ్చింది. ఆదివారం ఉదయం వరకు రామయ్యకు సీటు ఖరారయిందన్న వార్తలు వెలువడ్డాయి. ఆదివారం ఉదయం రామయ్య కుటుంబంతో సహా సీఎం నివాసానికి బయల్దేరారు. అయితే, చివరి నిమిషంలో రామయ్య పేరు జాబితా నుంచి మాయమైంది. ఆయన స్థానంలో కనకమేడల రవీంద్రకుమార్ పేరు జాబితాలోకి ఎక్కింది. దీంతో రామయ్య తీవ్ర మనస్తాపం చెందారు. విజయవాడ శివారు నుంచే ఆయన తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మరోవైపు.. తనకు అవకాశం ఇవ్వకపోవడంపై కంభంపాటి రామ్మోహన్రావు కూడా అసంతృప్తితో ఉన్నారు. రమేష్, రవీంద్ర ఎంపిక ఎంతవరకు న్యాయమని ఆశావహులంతా ప్రశ్నిస్తున్నారు. ఎంపిక తీరుపట్ల యనమలతోపాటు ఇతర సీనియర్లు కూడా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. -
ఓసీకి ఒకటి.. బీసీకి రెండు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ ఆ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అధినేత కేసీఆర్ ఈ ముగ్గురి పేర్లను అధికారికంగా ప్రకటించారు. మొదటి నుంచీ అనుకున్న విధంగా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన సంతోష్‌కు అవకాశం దక్కగా, మిగిలిన ఇద్దరు అభ్యర్థుల విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. యాదవుల కోటాలో చాలా మంది పోటీ పడినప్పటికీ నల్లగొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌కు అవకాశమిచ్చిన కేసీఆర్ అదే రీతిలో వరంగల్ జిల్లాకు చెందిన బండ ప్రకాశ్ ముదిరాజ్‌ను కూడా పెద్దల సభ రేసులో నిలబెట్టి పార్టీ నేతలను సైతం ఆశ్చర్యపరిచారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన బడుగుల లింగయ్య 2015లో టీఆర్ఎస్లో చేరారు. బండ ప్రకాశ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. వీరిద్దరి ఎంపికతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు అవకాశం ఇచ్చారనే చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే, సామాజిక సమీకరణల్లో భాగంగానే బండ ప్రకాశ్‌ను ఎంపిక చేశారని తెలంగాణ భవన్ వర్గాలంటున్నాయి. ముదిరాజ్ మహాసభ ద్వారా బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రకాశ్‌ను రాజ్యసభకు పంపడం బీసీలకు పెద్దపీట వేయడమేనని, అందులో భాగంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. ముఖ్యంగా బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాలను పంపడం ద్వారా ఆయా వర్గాలను ఆకర్షించాలనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మూడింటిలో రెండు స్థానాలను బీసీలకు కేటాయించారని గులాబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున గతంలో ఒక ఓసీ నేతను రాజ్యసభకు పంపగా, ఇప్పుడు మరో ఓసీ అభ్యర్థిని పెద్దల సభ రేసులో నిలబెట్టారు. గతంలో ఈ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైన ముగ్గురిలో కూడా ఇద్దరు బీసీలుండగా, ఇప్పుడు మళ్లీ ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బడుగుల లింగయ్య యాదవ్ తల్లిదండ్రులు: అంతయ్య, యలమంచమ్మ ఊరు: భీమారం, కేతేపల్లి మండలం, నల్లగొండ జిల్లా వయసు: 58 ఏళ్లు చదువు: బీఏ, బీఈడీ భార్య: నాగమణి, పిల్లలు: డాక్టర్ యస్వంత్, దీప్తి రాజకీయ అనుభవం: 1982లో టీడీపీలో చేరారు. 1985–87 వరకు కేతేపల్లి మండల తెలుగు యువత అధ్యక్షుడిగా, 1987–97లో కేతేపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా, 1995లో భీమారం ఎంపీటీసీగా, 1998 –2012 వరకు టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2009లో మహాకూటమి తరఫున స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి 26 ఓట్లతో నేతి విద్యాసాగర్ చేతిలో ఓడిపోయారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ 2015, మార్చి 16న టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. జోగినపల్లి సంతోష్‌కుమార్ తల్లిదండ్రులు: రవీందర్రావు, శశికళ ఊరు: కొదురుపాక, బోయినపల్లి మండలం, కరీంనగర్ జిల్లా వయసు: 42 ఏళ్లు చదువు: ఎంబీఏ, ఎంపీఎం భార్య: రోహిణి పిల్లలు: ఇషాన్, శ్రేయాన్ అనుభవం: సంతోష్ చదువు పూర్తయి ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన జెండా చేపట్టిన కేసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. 2004లో హరీశ్ మంత్రి అయిన తర్వాత ఈ బాధ్యతలను తీసుకున్న సంతోష్ అప్పటి నుంచి కేసీఆర్‌కు తోడు నీడగా ఉన్నారు. గత 13 ఏళ్లుగా కేసీఆర్ కన్నా ముందే ప్రారంభమయ్యే సంతోష్ దినచర్య కేసీఆర్ నిద్రకు విశ్రమించిన తర్వాతే ముగుస్తుంది. కేసీఆర్ ఢిల్లీలో ఉన్నా, గల్లీలో ఉన్నా సంతోష్ ఆయన వెన్నంటి ఉండాల్సిందే. అటు పార్టీలో, ఇటు కేసీఆర్ కుటుంబంలో అందరికీ తలలో నాలుకగా ఉండే సంతోష్ వ్యక్తిగతంగా కూడా మంచిపేరు సాధించుకున్నారు. ప్రస్తుతం టీన్యూస్ ఎండీగా కూడా ఉన్నారు. బండ ప్రకాశ్ ముదిరాజ్ వయసు: 63 ఏళ్లు చదువు: ఎంఏ, పీహెచ్డీ అనుభవం: కుడా సభ్యుడిగా, వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కూడా. -
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. టీడీపీకి దక్కే రెండు స్థానాలను ఓసీ, బీసీలకు చెరొకటి ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓసీ వర్గం నుంచి సీఎం రమేష్, బీసీల నుంచి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సచివాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించారు. సామాజిక సమీకరణలు, పార్టీ ప్రాధాన్యతలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఆదివారం దీనిపై తుది నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు తెలిసింది. -
రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ సస్పెన్స్
సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీలో ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనున్నా ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఒకవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండురోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేసినా టీడీపీ ఇంతవరకూ అభ్యర్థులనే ఖరారు చేయకపోవడం గమనార్హం. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండడంతో వారి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునేందుకు మార్చి 23వ తేదీన ఎన్నిక నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మూడింటిలో రెండు టీడీపీకి, ఒకటి వైఎస్సార్ సీపీకి దక్కే పరిస్థితి ఉంది. టీడీపీ అభ్యర్థిని ప్రకటించకపోవటంతో ఆశావహుల్లో రోజురోజుకూ టెన్షన్ పెరిగిపోతోంది. అధినేత చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే నాన్చుడు ధోరణి అనుసరి స్తుండటంపై పార్టీలో ఒకింత అసహనం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం టీడీపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. భారీగా ఆశావహుల జాబితా టీడీపీకి దక్కే రెండు స్థానాల్లో ఎస్సీ, బీసీలకు చెరొక స్థానం కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గానికి చెందిన సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యే మసాల పద్మజ, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, వర్ల రామయ్య పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బీసీల నుంచి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు రేసులో ఉన్నా చంద్రబాబు ఆయనకు అవకాశం ఇస్తారో లేదో అనుమానమే. తనను రాజ్యసభకు పంపాలని యనమల చాలాకాలం నుంచి కోరుతున్న విషయం తెలిసిందే. పారిశ్రా మికవేత్త బీద మస్తాన్‌రావుకు అవకాశం ఇవ్వాలని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు మంగళ వారం చంద్రబాబును కలిసి కోరారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలోని రెడ్డి సామాజికవర్గం నేతలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ఆ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మంత్రులతో సమావేశమైన నేతలు తమలో ఒకరికి సీటు దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనను మరోసారి కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ గట్టిగా కోరుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్రెడ్డిలు తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఓ అభ్యర్థిని సూచించిన జనసేన అధినేత? మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకుని రాజ్యసభకు పంపడానికి కొద్దిరోజుల క్రితం చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎంత ఒత్తిడి తెచ్చినా ముద్రగడ ఒప్పుకోలేదని, చంద్రబాబును నమ్మి టీడీపీలో చేరలేనని కుండబద్ధలు కొట్టడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నట్లు సమాచారం. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా తన తరఫున ఒకరిని రాజ్యసభకు ప్రతిపాదిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. నిజ నిర్థారణ కమిటీలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్న ఓ ముఖ్య నేతకు అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం జరిగింది. ఢిల్లీలో కార్పొరేట్ లాబీయింగ్ కోసం ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కంపెనీకి చెందిన వ్యక్తికి చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేశారనే ప్రచారం కూడా సాగింది. -
టీడీపీలో పోటీ పడుతున్న ‘ఆ ముగ్గురు’
సాక్షి, అమరావతి : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో వాటిపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఉత్కంఠ మొదలైంది. రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో వాటికి మార్చి 23వ తేదీన ఎన్నిక జరగనుంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, రేణుకా చౌదరి టీడీపీ తరఫున దేవేందర్‌గౌడ్ ప్రాతినిధ్యం వహించిన స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన కేటాయింపులో తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్‌కి ఏపీ, ఏపీకి చెందిన సీఎం రమేష్‌కు తెలంగాణ ప్రాతినిథ్యం లభించింది. ప్రస్తుతం ఏపీలో ఖాళీ అవనున్న మూడు స్థానాల్లో రెండు తెలుగుదేశం పార్టీకి దక్కనుండగా ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించింది. టీడీపీ తనకు వచ్చే రెండు స్థానాలను ఎవరికి కేటాయించాలనేది ఇంకా నిర్ణయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు. పోటీలో ఆ ముగ్గురూ... టీడీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్న యనమల తనను రాజ్యసభకు పంపాలని చాలాకాలం నుంచి చంద్రబాబును కోరుతున్నారు. అయితే అసెంబ్లీ, ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉండే ఆయనను రాజ్యసభకు పంపితే తనకు ఇబ్బంది అవుతుందేమోననే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్నాను కాబట్టి తనకు ఇవ్వాలని కంభంపాటి కోరుతుండగా, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తనకు ఇవ్వాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్ మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నప్పటికీ చంద్రబాబు సుముఖంగా లేనట్లు సమాచారం. ఎస్సీ మాదిగ వర్గంలో ఒకరికి ఈసారి అవకాశం ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే వర్ల రామయ్య, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యే మసాల పద్మజ పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీయేతర వ్యక్తులకూ అవకాశం? భవిష్యత్తు అవసరాలు, కార్పొరేట్ లాబీయింగ్ కోసం పార్టీయేతర వ్యక్తులకు కూడా రాజ్యసభ అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో చర్చలు కూడా జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో పార్టీకి చెందిన ప్రముఖుడికి కూడా రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
వెంకయ్య, నిర్మలా సీతారామన్‌లను ఎందుకు వద్దనుకున్నారు?
కేంద్రమంత్రులు ఎం వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్లకు బీజేపీ నాయకత్వం తిరిగి రాజ్యసభ టికెట్లు ఖరారు చేసినా, వారిని స్వరాష్ట్రం నుంచి కాకుండా వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎందుకు నామినేట్ చేస్తున్నట్టు? రాష్ట్రానికి చెందిన వీరిద్దరినీ కాదని మహారాష్ట్రకు చెందిన మరో కేంద్రమంత్రి సురేష్ ప్రభును లేదా మరొకరినో ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రతిపాదించడంలోని ఆంతర్యమేంటి. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ పొత్తు కొనసాగించే విషయంలో భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రెండేళ్ల కిందట రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో నిర్మలా సీతారామన్ బీజేపీ, టీడీపీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మిగిలిన రెండేళ్లకు మాత్రమే ఆమె ఎన్నిక కావడంతో వచ్చే జూన్ నెలాఖరుతో ఆమె పదవీ కాలం పూర్తవుతోంది. దాంతో ఈసారి జరగబోయే ఎన్నికల్లోనూ మిత్రపక్ష అభ్యర్థిగా నిర్మలా సీతారామన్‌ను తిరిగి ఏపీ నుంచే ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ఆమెను కర్ణాటక నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతకాలం కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆ రాష్ట్రం నుంచి కాకుండా రాజస్థాన్ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. వెంకయ్యను తిరిగి కర్ణాటక నుంచి ఎంపిక చేయరాదని ఇటీవలి కాలంలో ఆ పార్టీకే చెందిన కొందరు వ్యతిరేకించడం, ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రతిస్పందనలు రావడంతో వెంకయ్యనాయుడును రాజస్థాన్ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. వెంకయ్యనాయుడును కర్ణాటక నుంచి మార్చాలంటే ఆయనను ఏపీ నుంచి పార్టీ అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉంది. కానీ బీజేపీ నాయకత్వం ఆ పని చేయలేదు. ఈ విషయంలో స్వయంగా వెంకయ్యనాయుడే వద్దనుకున్నారా లేక పార్టీ జాతీయ నాయకత్వం ఆ ఆలోచన చేసిందా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ వెంకయ్యను కాదనుకుంటే నిర్మలా సీతారామన్ ను తిరిగి ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నిలపడానికి వీలుంది. బీజేపీ నాయకత్వం ఆ పని కూడా చేయలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీరిద్దరిలో ఒకరికి ఇక్కడినుంచి ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరినీ వేర్వేరు రాష్ట్రాల నుంచి అభ్యర్థులుగా ప్రకటించి మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభు పేరును పరిశీలించడం బీజేపీ రాజకీయ వ్యూహంతో వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీతో పొత్తు కొనసాగించే వ్యవహారంలో ఇప్పటికే ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం రానున్న రోజుల్లో అప్పటి పరిణామాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చన్న వ్యూహంతోనే ఏపీకి చెందిన వారిద్దరినీ కాదని వేరే రాష్ట్రానికి చెందిన నేతను ఎంపిక చేసినట్టు ఒక సీనియర్ నేత అభిప్రాయపడ్డారు. టీడీపీతో పొత్తు అంశాన్ని పునరాలోచన చేయాల్సిన పరిస్థితే వస్తే స్వరాష్ట్రం నుంచి నేతలు ఉంటే ఒత్తిడి వస్తుందన్న ఆలోచనతోనే వారిద్దరిని వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆ విషయంలో ఆ ఇద్దరు నేతలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశం కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉండొచ్చని వినిపిస్తోంది. -
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు అందలం
న్యూఢిల్లీ: వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీనియర్లకు ప్రాధన్యం ఇచ్చింది. పార్టీకి నమ్మకంగా ఉంటున్న సీనియర్ నాయకులకు అవకాశం ఇచ్చింది. కేంద్ర మాజీ మంత్రులు పి చిదంబరం, కపిల్ సిబల్, జైరాం రమేష్, అంబికా సోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. తమిళనాడుకు చెందిన పి చిదంబరం మహారాష్ట్ర నుంచి, జైరాం రమేష్ సొంతరాష్ట్రం కర్ణాటక నుంచి పోటీ చేయనున్నారు. కపిల్ సిబల్ ఉత్తరప్రదేశ్ నుంచి బరిలో దిగనున్నారు. అంబికా సోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో పాటు వివేక్ ఠంకా, ఛాయ వర్మలను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలైన సంగతి తెలిసిందే. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మాత్రం అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు కాస్త ఊరట కలిగించే విషయం. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకుగాను రాజ్యసభ ఎన్నికల్లో సీనియర్లకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. -
టిడిపీలో రాజ్యసభ సీట్ల చిచ్చు
-
టీడీపీలో సీట్ల చిచ్చు
రాజ్యసభ అభ్యర్థులుగా గరికపాటి, సీతారామలక్ష్మి బాబు అన్యాయం చేశారంటూ మోత్కుపల్లి, సోమిరెడ్డి ఆగ్రహం సమైక్యం కోసం రాజీనామా చేసిన తనకు టికెట్ ఇవ్వాలన్న హరికృష్ణ విజ్ఞప్తిని పట్టించుకోని చంద్రబాబు రాజ్యసభ అభ్యర్థులుగా గరికపాటి, సీతారామలక్ష్మిల పేర్లు ఖరారు పొలిట్‌బ్యూరో నేతలతో ఏకాంత సమావేశాల్లో అభ్యర్థుల పేర్లు చెప్పిన చంద్రబాబు పార్టీ అధినేత అన్యాయం చేశారంటూ మోత్కుపల్లి, సోమిరెడ్డిల తీవ్ర ఆగ్రహం సమైక్యం కోసం రాజీనామా చేసిన తనకు టికెట్ ఇవ్వాలని హరికృష్ణ విజ్ఞప్తి బావమరిది వినతిని సైతం పక్కనపెట్టిన టీడీపీ అధ్యక్షుడు.. సీటు నిరాకరణ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చిచ్చు రేపింది. పార్టీ నేతల నిరసనలు, ఆగ్రహావేశాల మధ్య పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో అన్యాయం చేశారంటూ చంద్రబాబుపై పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయగా.. మరో నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెనుతిరిగారు. సమైక్యాంధ్ర కోసం పదవికి రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ తనకు మరోసారి అవకాశమివ్వాలని కోరినా పక్కనపెట్టటంతో ఆయన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ తరఫున రాజ్యసభ బరిలో దింపడానికి ఇద్దరు నేతల పేర్లను ఖరారు చేయటంలో తీవ్ర అసంతృప్తులు, ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు మాత్రం ముందుగా తాను అనుకున్నట్టే గరికపాటి మోహన్‌రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ముందునుంచి భావిస్తున్నట్టుగానే మరో స్థానం కోసం పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పేరును ఖరారు చేశారు. చంద్రబాబు నివాసంలో ఆయన అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ పేర్లను చెప్పి ఆమోదింపజేశారు. అనంతరం రాత్రి విలేకరుల సమావేశంలో వీరిద్దరి పేర్లను ప్రకటించారు. మంగళవారం వీరు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసిన వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే వీరిని ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు. సాధారణ ఎన్నికల తర్వాత అయితే మోత్కుపల్లికి రాజ్యసభ టికెట్ ఇచ్చే వాడినన్నారు. గరికపాటి టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు వియ్యంకుడు. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. సీతారామలక్ష్మి కూడా సంపన్నురాలే. ఆమె భర్త సత్యనారాయణ జగదీష్ మెరైన్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీకి అధిపతి. నేతలతో ఏకాంత చర్చలు: ప్రస్తుతం ప్రాంతీయ భావోద్వేగాలు నెలకొన్న పరిస్థితుల్లో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు ఒక్కో సీటు ఇవ్వాలని టీడీపీ నేతలు పొలిట్‌బ్యూరో భేటీలో సూచించారు. ఈ సందర్భంగా బాబు నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణ నుంచి గరికపాటి, సీమాంధ్ర నుంచి నారాయణ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ పి.నారాయణ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు నిమ్మకాయల చినరాజప్ప, తోట సీతారామలక్ష్మిల పేర్లను వారికి చెప్పారు. గతంలో కార్పొరేట్ సంస్థలు నడిపే వ్యక్తులకు సీట్లు ఇచ్చామన్న విమర్శలు ఉన్నందున ఈసారి అలా జరక్కుండా చూడాల్సిందిగా వారు కోరారు. మోత్కుపల్లి ఆగ్రహం.. బుజ్జగింపులు: ఎంతో కాలంగా పార్టీకి సేవచేస్తుంటే ఈ రకంగా అవమానించడం దారుణమని చంద్రబాబు నివాసంలోనే నేతల వద్ద మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో తాను పార్టీని కాపాడేందుకు ముందున్నానని, ఎన్టీఆర్ భవన్‌కు ఎవ్వరూ రాని సమయంలో తాను అక్కడే తిష్టవేసి కార్యకర్తలకు మనోధైర్యం కల్పించానని, అలాంటి తనకు రాజ్యసభ సీటు ఇవ్వకుండా ఆర్థికంగా బలవంతులైన వారికి పెద్దపీట వేయటం దారుణమని మండిపడ్డారు. ఆవేశంగా చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చారు. టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, చింతమనేని ప్రభాకర్ పరుగున వచ్చి ఆయన్ను నిలువరించారు. నామా ఆయనకు నచ్చచెప్పి తిరిగి బాబు నివాసంలోకి తీసుకెళ్లారు. బాబు విలేకరుల సమావేశం ముగిసే వరకూ నామా, ముద్దుకృష్ణమ తదితరులు ఆయన్ను బుజ్జగిస్తూనే ఉన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏ సీటు కోరుకుంటే ఆ సీటు ఇస్తారని, ఎన్నికల ఖర్చు మొత్తాన్ని పార్టీ భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని హామీలు ఇచ్చారు. అయినా ఆయన శాంతించలేదు. అర్ధంతరంగా సోమిరెడ్డి నిష్ర్కమణ..: రాజ్యసభ సీటును ఆశించిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పొలిట్‌బ్యూరో సమావేశం నుంచి అర్ధంతరంగా నిష్ర్కమించారు. తన పేరు పరిశీలన దశలోనే తిరస్కరించారని పసిగట్టిన ఆయన చంద్రబాబుతో ఏకాంతంగా భేటీ అయ్యి అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయం చెప్పాల్సి ఉన్నప్పటికి వెనుదిరిగారు. ఫోన్లో కూడా ఆయన ఎవ్వరికీ స్పందించకుండా స్విచాఫ్ చేశారు. హరికృష్ణ కోరికా మన్నించలేదు..: సుదీర్ఘ విరామం తరువాత జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశానికి నందమూరి హరికృష్ణ హాజరయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తాను రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నందున ఈసారి సీటు తనకే కేటాయించాల్సిందిగా కోరారు. రాజ్యసభ సీటును ఆశిస్తూ సమావేశంలో పాల్గొనటం సరికాదని బయటకు వెళ్లారు. చంద్రబాబు మాత్రం బావమరిది విజ్ఞప్తిని పట్టించుకోలేదు. పొలిట్‌బ్యూరో సమావేశానికి ముందు చంద్రబాబు టీడీఎల్పీ కార్యాలయంలో శాసనసభ్యులతో సమావేశమయ్యారు. మరో ఎంపీ సి.ఎం.రమేష్ కాంగ్రెస్ తరఫున రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగిన జె.సి.దివాకర్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్‌రెడ్డిలతో రాజ్యసభ ఎన్నికలపై చర్చలు జరిపారు. -
కాంగ్రెస్ పెద్దలు ముగ్గురే
కేవీపీ, సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్లకు మళ్లీ రాజ్యసభ చాన్స్ నంది ఎల్లయ్య, రత్నాబారుుకి దక్కని అవకాశం నాలుగో సీటుకు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు! సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రాష్ట్రం నుంచి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్‌లను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ ముగ్గురూ రాజ్యసభ సిట్టింగ్ సభ్యులే కావడం విశేషం. మరో ఇద్దరు సిట్టింగ్ సభ్యులు నంది ఎల్లయ్య, రత్నాబారుులకు ఈసారి అవకాశం కల్పించలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ‘సమైక్య’ అభ్యర్థిని రంగంలోకి దింపుతామని పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో.. బలమైన అభ్యర్థులుగా భావించి సీమాంధ్ర ప్రాంతం నుంచి టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీలను కాంగ్రెస్ బరిలోకి దింపినట్లు చెబుతున్నారు. ఇక తెలంగాణ నుంచి ఎం.ఎ.ఖాన్‌ను ఎంపికచేశారు. సుబ్బరామిరెడ్డి ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై సోమవారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌లు పార్టీ అధ్యక్షురాలితో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాత్రి 7.20 ప్రాంతంలో మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించిన 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన మొత్తం ఐదు స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో ప్రస్తుతం మూడుస్థానాలు గెలుచుకునేందుకే పూర్తి బలం ఉంది. ఇత ర పార్టీలు సహకరిస్తే మరోస్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు బరిలోకి దిగుతుండడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ పార్టీకి అవకాశం ఇస్తూ.. నాలుగోస్థానాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమైనట్టు అభ్యర్థుల జాబితాను బట్టి అర్థమవుతోంది. దిగ్విజయ్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఆంధ్రప్రదేశ్: టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్ ఛత్తీస్‌గఢ్: మోతీలాల్ వోరా గుజరాత్: మధుసూదన్ మిస్త్రీ హిమాచల్‌ప్రదేశ్: విప్లవ్ ఠాకూర్ మధ్యప్రదేశ్: దిగ్విజయ్‌సింగ్ మహారాష్ట్ర: మురళీ దేవ్రా, హుస్సేన్ ఉమర్ దాల్వే మణిపూర్: హజీ అబ్దుల్ సలాం మేఘాలయ: వాన్సుక్ సయ్యం ఒడిశా: రణ్జిబ్ బిశ్వత్. నన్ను పార్టీ నమ్మింది: సుబ్బరామిరెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక కావడంపై సుబ్బరామిరెడ్డి స్పందించారు. ‘సంప్రదాయాన్ని పక్కనబెట్టి నాకు మూడోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్‌కు నేను పూర్తిగా విధేయుడిని. ఎలాం టి పరిస్థితి ఉన్నా పార్టీ మాట జవదాట లేదు. నేను అజాత శత్రువునని పార్టీ నమ్మింది’ అని అన్నారు. -
రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారు
న్యూఢిల్లీ: రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా కెవిపి రామచంద్ర రావు, ఎంఏ ఖాన్, తిక్కవరపు సుబ్బరామిరెడ్డి పేర్లను అధిష్టానం ఆమోదించింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర పార్టీ వ్యవహరాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా అధిష్టానం రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. దిగ్విజయ్ సింగ్ ఈ సాయంత్రం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలిసి తాను రాజ్యసభ టిక్కెట్ ఆశిస్తున్నట్లు చెప్పారు. దిగ్విజయ్ అభ్యర్థనను సోనియా మన్నించారు. ఆయనకు టిక్కెట్ కేటాయించారు.