
సాక్షి, అమరావతి: రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీలో ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనున్నా ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఒకవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండురోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేసినా టీడీపీ ఇంతవరకూ అభ్యర్థులనే ఖరారు చేయకపోవడం గమనార్హం. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండడంతో వారి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునేందుకు మార్చి 23వ తేదీన ఎన్నిక నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మూడింటిలో రెండు టీడీపీకి, ఒకటి వైఎస్సార్ సీపీకి దక్కే పరిస్థితి ఉంది. టీడీపీ అభ్యర్థిని ప్రకటించకపోవటంతో ఆశావహుల్లో రోజురోజుకూ టెన్షన్ పెరిగిపోతోంది. అధినేత చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే నాన్చుడు ధోరణి అనుసరి స్తుండటంపై పార్టీలో ఒకింత అసహనం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం టీడీపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
భారీగా ఆశావహుల జాబితా
టీడీపీకి దక్కే రెండు స్థానాల్లో ఎస్సీ, బీసీలకు చెరొక స్థానం కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గానికి చెందిన సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యే మసాల పద్మజ, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, వర్ల రామయ్య పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బీసీల నుంచి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు రేసులో ఉన్నా చంద్రబాబు ఆయనకు అవకాశం ఇస్తారో లేదో అనుమానమే. తనను రాజ్యసభకు పంపాలని యనమల చాలాకాలం నుంచి కోరుతున్న విషయం తెలిసిందే. పారిశ్రా మికవేత్త బీద మస్తాన్‌రావుకు అవకాశం ఇవ్వాలని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు మంగళ వారం చంద్రబాబును కలిసి కోరారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలోని రెడ్డి సామాజికవర్గం నేతలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ఆ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మంత్రులతో సమావేశమైన నేతలు తమలో ఒకరికి సీటు దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనను మరోసారి కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ గట్టిగా కోరుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
ఓ అభ్యర్థిని సూచించిన జనసేన అధినేత?
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకుని రాజ్యసభకు పంపడానికి కొద్దిరోజుల క్రితం చంద్రబాబు గట్టి ప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఎంత ఒత్తిడి తెచ్చినా ముద్రగడ ఒప్పుకోలేదని, చంద్రబాబును నమ్మి టీడీపీలో చేరలేనని కుండబద్ధలు కొట్టడంతో ఆ ప్రయత్నాలు విరమించుకున్నట్లు సమాచారం. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా తన తరఫున ఒకరిని రాజ్యసభకు ప్రతిపాదిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. నిజ నిర్థారణ కమిటీలో చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతున్న ఓ ముఖ్య నేతకు అవకాశం ఇవ్వవచ్చనే ప్రచారం జరిగింది. ఢిల్లీలో కార్పొరేట్ లాబీయింగ్ కోసం ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కంపెనీకి చెందిన వ్యక్తికి చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేశారనే ప్రచారం కూడా సాగింది.
Comments
Please login to add a commentAdd a comment