అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను నియమించిన ప్రక్రియ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ అన్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ పార్టీ బీ-ఫామ్‌ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
అనంతరం మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బీసీలకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు స్థానాలు బీసీలకు.. రాష్ట్ర అభివృద్ధి కోసం నత్వానికి.. పారిశ్రామిక అభివృద్ధి కోసం అయోధ్య రామిరెడ్డికి సీటు ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాయకులను చంద్రబాబు నాయుడులా వాడుకొని వదిలేయడం సీఎం జగన్‌కు తెలియదు. చంద్రబాబు నాయకులను కరివేపాకుల వాడి వదిలేస్తారు. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రధమ స్థానంలో సీఎం జగన్ ఉంటారు. బీసీ వర్గాలకు చెందిన తమకు రాజ్యసభ పదవులు వస్తాయని అనుకోలేద’ని అన్నారు. ( సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు )
ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారు : అయోధ్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా మేకిన్ ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.
వైఎస్ జగన్ రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉంది : నత్వాని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి పరిమల్ నత్వాని అన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై తమ ఛైర్మన్ అంబానీ, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment