సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆవిష్కృతమైన సరికొత్త సామాజిక మహావిప్లవంలో మరో ముందడుగు పడింది. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 2 అంటే 50 శాతం స్థానాల్లో బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు(యాదవ)లను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. ‘బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్’ అని 2019 ఫిబ్రవరి 18న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో స్పష్టం చేసిన సీఎం జగన్ మరోసారి ఆచరించి చూపారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఉమ్మడి ఏపీలో, రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో అలుపెరగని పోరాటాలు చేపట్టిన కృష్ణయ్య, విద్యావంతుడైన బీద మస్తాన్‌రావులను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా ఆ వర్గాల వాణిని పార్లమెంట్‌లో బలంగా వినిపించి సమస్యలు పరిష్కరించాలన్నది సీఎం లక్ష్యమని విశ్లేషిస్తున్నారు.
రెండేళ్ల క్రితం కూడా..
రెండేళ్ల క్రితం నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లను బీసీలైన పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టిబలిజ), మోపిదేవి వెంకటరమణ(మత్స్యకార)లకు సీఎం జగన్ కేటాయించి పెద్దల సభలో అవకాశం కల్పించారు. మూడేళ్లలో ఏపీ నుంచి ఖాళీ అయిన 8 రాజ్యసభ స్థానాల్లో సగం అంటే 4 స్థానాలను బీసీ వర్గాలకే కేటాయించడం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలోనూ 50% రాజ్యసభ పదవులను బీసీలకు ఇచ్చిన దాఖలాలు లేవని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చట్టసభల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీ బిల్లును ప్రైవేట్ బిల్లుగా రాజ్యసభలో వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా ప్రవేశపెట్టడం, తాజాగా సగం సీట్లను వారికే కేటాయించడం బీసీల అభ్యున్నతిపై సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని స్పష్టం చేస్తున్నారు.
సామాజిక సాధికారతే లక్ష్యంగా..
► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు (86.29 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో(88 శాతం) వైఎస్సార్‌సీపీ అఖండ విజయాన్ని సాధించింది. మే 30, 2019న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు.
► జూన్ 8, 2019న తొలిసారిగా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 14 పదవులు (56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించి సామాజిక విప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఓసీ వర్గాలకు 11 పదవులు(44%) ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ స్థాయిలో మంత్రివర్గంలో స్థానం కల్పించిన దాఖలాలు లేవు.
► ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. నాలుగు (80%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అవకాశం కల్పించారు. ఎస్సీ మహిళ మేకతోటి సుచరితకు హోంమంత్రిగా అవకాశమిచ్చారు. దేశ చరిత్రలో రాష్ట్ర హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం అదే ప్రథమం.
► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌రాజు, మైనార్టీ మహిళ జకియా ఖానంలకు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో మండలి ఛైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళను నియమించడం ఇదే తొలిసారి.
► ఈ ఏడాది ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అందులో బీసీ, మైనార్టీలకు 11 పదవులు ఇచ్చారు.
మాటల్లో కాదు.. చేతల్లో
పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాతినిధ్యం ఇస్తే ద్వారా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అట్టడుగు వర్గాలకు చేరతాయని, ఇది ఆయా వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన, సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు బాటలు వేస్తుందన్నది సీఎం జగన్ విశ్వాసం.
► మండలిలో వైఎస్సార్‌సీపీకి 32 మంది సభ్యులు ఉంటే 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించారు.
► పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. జడ్పీ చైర్‌పర్సన్ పదవుల్లో తొమ్మిది (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు.
► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్‌సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67% పదవులను కేటాయించారు.
► 13 కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 7 చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మేయర్ పదవుల్లో 92% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకోగా చైర్‌పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 % ఇచ్చారు.
► నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ సర్కారే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం వైఎస్ జగన్ సర్కారే.
► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60%పదవులు ఇచ్చారు.
► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39%) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58% పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్‌లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్‌లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
► 137 కార్పొరేషన్‌లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42%) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58%
డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్‌లు, 3 ఎస్సీ కార్పొరేషన్‌లు, ఒక ఎస్టీ కార్పొరేషన్‌లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు.
సామాజిక మహావిప్లవంలో ‘పెద్ద’ అడుగు!
Published Wed, May 18 2022 3:25 AM | Last Updated on Wed, May 18 2022 8:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment