రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల గెలుపే లక్ష్యంగా, పార్టీలో కీలకమైన నేతలకు లోక్‌సభలో ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. తాజాగా రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధిష్టానం కీలకమైన మార్పులు చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కేంద్ర మంత్రులకు మాత్రమే తిరిగి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించటం గమనార్హం. వచ్చే ఏప్రిల్ నెలలో పెద్దల సభలో బీజేపీ చెందిన 28 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.
రాజ్యసభ సభ్యులుగా ఉన్న... ఏడుగురు కేంద్ర మంత్రులకు బీజేపీ తిరిగి రాజ్యసభకు అవకాశం ఇవ్వదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే వారిని వచ్చే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల బరిలో దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వారిలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (గుజరాత్), విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), ఐటి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక). పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (రాజస్థాన్), మత్స్య మంత్రి పర్షోత్తమ్ రూపాలా (గుజరాత్), మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే(మహారాష్ట్ర), విదేశి వ్యవహరాల శాఖ మంత్రి వి. మురళీధరన్ (మహారాష్ట్ర)లు ఉన్నారు. అయా రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో ఏడుగురు మంత్రులకు బీజేపీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తన సొంతం రాష్ట్రం అయిన ఒడిశాలోని (సంబల్‌పూర్ లేదా ధేక్నాల్) సెగ్మెంట్ల నుంచి లోక్‌సభకు పోటీకి నిలపనున్నట్లు సమాచారం. మంత్రి భూపేందర్ యాదవ్‌ను రాజస్థాన్‌లోని (అల్వార్ లేదా మహేంద్రగఢ్) నియోజకవర్గం, మంత్రి చంద్రశేఖర్‌ను బెంగళూరులోని మూడు నియోజకవర్గాలు (సెంట్రల్, నార్త్, సౌత్)లో ఏదో ఒక స్థానంలో బరిలో దించనుంది. మంత్రి మాండవియాను గుజరాత్‌లోని (భావ్‌నగర్ లేదా సూరత్), మంత్రి రూపాలా రాజ్‌కోట్ నుంచి బీజేపీ పోటీలో నిలపనుంది. మంత్రి మురళీధరన్‌కు తన సొంత రాష్ట్రం కేరళ నుండి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ బీజేపీకి ఉనికి లేనప్పటికీ ఈసారి గెలుపే లక్ష్యంగా మురళీధరన్‌ను అక్కడ నిలబెడుతుందని సమాచారం.
రెండు దఫాల్లో రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కేంద్ర మంత్రుకే తిరగి అవకాశం కల్పించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (ఒడిశా), ఫిషరీస్ మంత్రి ఎల్ మురుగన్ (మధ్యప్రదేశ్)లకు బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. రాజ్యసభలో బీజేపీకి చెందిన 28 మంది సభ్యులు పదవీ విరమణ చేయనుండగా.. ఇప్పటివరకు అయితే కేవలం నలుగురు సభ్యులను మాత్రమే తిరిగి ఎంపిక చేయటం గమనార్హం. బీజేపీ పెద్దల సభకు కొత్తవారికి అవకాశం కల్పించటంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడుగురు మంత్రులను కూడా రాజ్యసభకు కాకుండా పార్లమెంట్ ఎన్నికల బరి దించనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment