తొలి దశలో దిగ్గజాల పోరు | Lok sabha elections 2024: 8 Union ministers, two former CMs, one ex-governor in fray in first phase of LS polls | Sakshi
Sakshi News home page

తొలి దశలో దిగ్గజాల పోరు

Published Thu, Apr 18 2024 6:23 AM | Last Updated on Thu, Apr 18 2024 6:23 AM

Lok sabha elections 2024: 8 Union ministers, two former CMs, one ex-governor in fray in first phase of LS polls - Sakshi

బరిలో 8 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలు, ఒక మాజీ గవర్నర్‌

సాక్షి,  న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా, ఏకంగా ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒక మాజీ గవర్నర్‌సహా 8 మంది కేంద్ర మంత్రలు, ఇద్దరు సీఎంలు రేపు జరగబోయే లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరులో పోటీపడుతున్నారు. రేపు పోలింగ్‌ జరగబోయే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ప్రచారం బుధవారంతో ముగిసింది. తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఎదురవుతున్నాసరే పక్కా వ్యూహరచనతో ముందడుగు వేస్తున్నారు.          

నితిన్‌ గడ్కరీ
మహారాష్ట్రలోని నాగ్‌ పూర్‌ నియోజకవర్గంలో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్దమైన బీజేపీ నేత నితిన్‌ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014లో ఏడుసార్లు ఎంపీగా గెలిచిన విలాస్‌ ముట్టెంవార్‌పై 2.84 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గడ్కరీ తన సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్‌ సారథి నానా పటోలేను 2019లో ఇదే నాగ్‌పూర్‌లో 2.16 లక్షల మెజారిటీతో మట్టికరిపించి తనకు ఎదురులేదని గడ్కరీ నిరూపించారు.

అయితే ఇటీవల స్థానికంగా బాగా పట్టు సాధించిన కాంగ్రెస్‌ నేత వికాస్‌ థాకరే(57) గడ్కరీకి గట్టి సవాలు విసురుతున్నారు. నాగ్‌పూర్‌ వెస్ట్‌ ఎమ్మెల్యేగా ఉన్న థాకరే కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు. ప్రకాశ్‌ అంబేద్కర్‌కు చెందిన వంచిత్‌ బహుజన్‌ అఘాడి పార్టీ సైతం థాకరేకి మద్దతు పలికింది. కాంగ్రెస్‌లో అన్ని వర్గాలు ఒక్కటై థాకరే విజయం కోసం పనిచేస్తుండడంతో గడ్కరీ అప్రమ్తత మయ్యారు. కాంగ్రెస్‌ నేతలు నిరుద్యోగం, స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. దీంతో గడ్కరీ ఆయన సతీమణి, కుమారుడు, కోడలు సైతం నిప్పులు కక్కే ఎండల్లో విరివిగా ప్రచారం చేశారు.

కిరెన్‌ రిజిజు: 2004 నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో దూకారు. 52 ఏళ్ల రిజిజుకు ఈసారి నబాం టుకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యారు. టుకీ అరుణాచల్‌ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ప్రస్తుతం ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కూడా. టుకీకి కరిష్మా తక్కువేం లేదు. దీంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది.

సర్బానంద సోనోవాల్‌: నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్‌ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్‌ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్‌ ఈసారి లోక్‌సభలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలికి బీజేపీ ఈసారి టికెట్‌ నిరాకరించి సోనోవాల్‌ను నిలబెట్టింది.

సంజీవ్‌ భలియా: ఉత్తరప్రదేశ్‌లో కులరాజ కీయాలకు పేరొందిన ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంజీవ్‌ భలియా పోటీకి నిలబడ్డారు. ఈయనకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి హరీంద్ర మాలిక్, బహుజన్‌సమాజ్‌ పార్టీ అభ్యర్థి దారాసింగ్‌ ప్రజాపతి నుంచి గట్టిపోటీ ఉంది. ఈ త్రిముఖపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో.

జితేంద్ర సింగ్‌: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ హయాంలో సహాయ మంత్రిగా సేవలందించారు. హ్యాట్రిక్‌ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు.

భూపేంద్ర యాదవ్‌: రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్‌ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ బాలక్‌ నాథ్‌ను పక్కనబెట్టిమరీ పార్టీ ఈయనకు టికెట్‌ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లలిత్‌ యాదవ్‌ ఈయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. జిల్లాలోని మత్స్య ప్రాంతంలో యాదవుల మద్దతు ఇద్దరికీ ఉండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

అర్జున్‌రాం మేఘ్వాల్‌: రాజస్థాన్‌లోని బికనీర్‌ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌తో మాజీ కాంగ్రెస్‌ మంత్రి గోవింద్‌ రామ్‌ మేఘ్వాల్‌ తలపడుతున్నారు.

ఎల్‌.మురుగన్‌: తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్‌.మురుగన్‌ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక్కడ డీఎంకే సిట్టింగ్‌ ఎంపీ, మాజీ కేంద్ర టెలికం మంత్రి ఏ.రాజా నుంచి మురుగన్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్‌ తొలిసారిగా నీలిగిరి నుంచి నిలబడ్డారు.

తమిళిసై సౌందరరాజన్‌: తెలంగాణ గవర్నర్‌గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ చెన్నై సౌత్‌ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు.

బిప్లవ్‌కుమార్‌ దేవ్‌: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌ ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్‌ త్రిపురలో బిప్లవ్‌ దేవ్‌కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆశిశ్‌ కుమార్‌ సాహా నిలబడ్డారు. ఇద్దరికీ ఈ నియోజకవర్గంపై గట్టిపట్టుంది. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement