Lok Sabha elections 2024: 21 రాష్ట్రాల పరిధిలో పోలింగ్‌ @ 102 నేడే! | Lok Sabha Elections 2024: Voting For The First Phase Of The 2024 Lok Sabha Elections Begins On 19th April - Sakshi
Sakshi News home page

Lok Sabha Elections Phase 1 Polling: 21 రాష్ట్రాల పరిధిలో పోలింగ్‌ @ 102 నేడే!

Published Fri, Apr 19 2024 5:07 AM | Last Updated on Fri, Apr 19 2024 8:17 AM

Lok Sabha elections 2024: Voting for the first phase of the 2024 Lok Sabha elections begins on 19 April 2024 - Sakshi

గురువారం జమ్మూకశ్మీర్‌లో దోడాలో పోలింగ్‌ సామగ్రి తీసుకెళ్తున్న పోలింగ్‌ సిబ్బంది

21 రాష్ట్రాల పరిధిలో జరగనున్న ఎన్నికలు

అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకూ పోలింగ్‌

1.87 లక్షల పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు

నేతల భవితవ్యం తేల్చనున్న 16.63 కోట్ల ఓటర్లు

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న సీఈసీ

సాక్షి, న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ అయిన లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. వీటితోపాటే  అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం 60, సిక్కింలోని మొత్తం 32 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. స్థానిక పరిస్థితులను బట్టి పోలింగ్‌ వేళల్లో మార్పులుచేర్చే అవకాశముంది. గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానే‹Ùకుమార్‌ సుఖ్‌బీర్‌సింగ్‌ సంధూ పోలింగ్‌ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఈసీ రాజీవ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

తొలి దశలో బరిలో నిల్చిన నేతలు..
కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ(నాగ్‌పూర్‌ నియోజకవర్గం), కిరెన్‌ రిజిజు(అరుణాచల్‌ వెస్ట్‌), సంజీవ్‌ భలియా(ముజఫర్‌నగర్‌), జితేంద్ర సింగ్‌(ఉధమ్‌పూర్‌), అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌(బికనీర్‌), ఎల్‌.మురుగన్‌(నీలగిరి), శర్బానంద సోనోవాల్‌(దిబ్రూగఢ్‌), భూపేంద్ర యాదవ్‌(అల్వార్‌) శుక్రవారం నాటి పోరులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, అరుణాచల్‌ మాజీ సీఎం నబాం టుకీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్‌కుమార్‌ దేవ్, కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్, డీఎంకే నాయకురాలు కనిమొళి, బీజేపీ తమిళనాడు చీఫ్‌ కె.అన్నామలై, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కమల్‌నాథ్‌ తనయుడు నకుల్‌నాథ్, లోక్‌ జనశక్తి పార్టీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్, బీజేపీ నేత జితిన్‌ ప్రసాద, నితిన్‌ ప్రామాణిక్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్‌ నేత కార్తీ చిదంబరం, ఏఎంఎంకే చీఫ్‌ టీటీవీ దినకరన్‌ పోటీచేస్తున్న స్థానాల్లోనూ శుక్రవారమే పోలింగ్‌ జరుగుతోంది.   

భారీగా ఏర్పాట్లు
తొలి దఫా పోలింగ్‌ కోసం 18 లక్షల మంది ఎన్నికల సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్లర్లు, 84 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు సమకూర్చారు.

తప్పకుండా ఓటేయాలి: సీఈసీ రాజీవ్‌
ప్రతి ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోసందేశం విడుదలచేశారు. ‘‘ భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేవి అత్యంత రమణీయమైన భావన. ఇందులో ఓటింగ్‌కు మించింది లేదు. భారతీయ ఓటర్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ఎండ వేడిమినీ అధిగమిస్తుంది. ఎన్నికలు మీవి. ఎవరిని ఎన్నుకోవాలనేది మీ ఇష్టం. మీ ప్రభుత్వాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ కుటుంబం, పిల్లలు, పల్లె, గ్రామం.. అంతెందుకు దేశం కోసం మీరు వేస్తున్న ఓటు ఇది’ అని రాజీవ్‌ వ్యాఖ్యానించారు. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

నాడు ఈ 102 సీట్లలో 45 చోట్ల యూపీఏ గెలుపు
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 102 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 45 చోట్ల యూపీఏ కూటమి విజయం సాధించింది. 41 స్థానాలను ఎన్‌డీఏ కూటమి కైవసం చేసుకుంది. ఈ 41లో బీజేపీ గెలిచినవే 39 ఉన్నాయి.  

 సమస్యాత్మక బస్తర్‌లోనూ..
మావోల దాడులు, పోలీసు బలగాల ఎదురుకాల్పుల మోతలతో దద్దరిల్లే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలోనూ శుక్రవారమే పోలింగ్‌ జరుగుతోంది. బస్తర్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఈనెల 16న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 29 మంది నక్సల్స్‌ మరణించిన నేపథ్యంలో ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఎన్నికలు నిర్వహిస్తోంది. బస్తర్‌లో 61 పోలింగ్‌బూత్‌లు సున్నితమైన ప్రాంతాల్లో, 196 బూత్‌లను సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. బస్తర్‌ నుంచి కాంగ్రెస్‌ ఫైర్‌బ్రాండ్‌ నేత కవాసి లఖ్మా బరిలో నిలిచారు. ఈయనకు పోటీగా మహేశ్‌ కశ్యప్‌ను బీజేపీ నిలిపింది. భద్రతా కారణాల రీత్యా కొన్ని బూత్‌లలో పోలింగ్‌ను మధ్యా హ్నం మూడు గంటలవరకే అనుమతిస్తారు. 191 ‘సంఘ్‌వారీ’ బూత్‌లను మహిళా సిబ్బంది నిర్వహిస్తారు. 42 ‘ఆదర్శ్‌’, 8 ‘దివ్యాంగ్‌జన్‌’, 36 యువ బూత్‌లనూ ఏర్పాటుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement