
అంతర్జాతీయంగా కొత్త మార్కెట్ల వైపు భారత్ చూపు
ప్రపంచ మార్కెట్‌కు ఆకర్షణీయ ప్రత్యామ్నాయంగా మారే అవకాశం
దేశీయ పరిశ్రమ ఆశాభావం
సవాళ్లను అవకాశంగా మలుచుకోవాలంటున్న మార్కెట్ వర్గాలు
భారత్ నుంచి గత ఏడాది 87.4 బిలియన్ డాలర్ల విలువైన వస్తు, సేవలు అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అయితే, ఈ కాలంలో అమెరికా నుంచి భారత్‌కు అయిన దిగుమతులు 41.8 బిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే అగ్రరాజ్యంతో వ్యాపారంలో మనదే పైచేయి అన్నమాట. యూఎస్‌లో పాగా వేసిన భారత్.. ప్రస్తుత మార్కెట్లలో మరింత చొచ్చుకుపోవడంతోపాటు కొత్త మార్కెట్లకు విస్తరించే సమయం ఆసన్నమైంది.
అయితే ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రపంచ వాణిజ్యాన్ని ఒక కుదుపు కుదపడం.. అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదన్న అంచనాల నేపథ్యంలో భారత్ ముందు సవాళ్లు లేకపోలేదు. ఈ సవాళ్లను అవకాశంగా మలుచుకోవాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం యూఎస్ ప్లస్ నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ మార్కెట్‌కు నమ్మదగిన ఆకర్షణీయ, ఆర్థిక భాగస్వామిగా అవతరించాలని అంటున్నాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్
చూపు భారత్ వైపు..
రిస్క్ ను తగ్గించడానికి లేదా కొత్త మార్కెట్ల కోసం చూస్తున్న గ్లోబల్ కంపెనీలు సుంకం లేని లేదా తక్కువ సుంకం కలిగిన కేంద్రంగా భారత్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చైనా ఉత్పత్తులపై అధిక సుంకం కారణంగా భారత్‌కు అతిపెద్ద ప్రయోజనం చేకూరవచ్చని బోరా మల్టీకార్ప్ ఎండీ ప్రశాంత్ బోరా తెలిపారు.
అలాగే, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలపై అమెరికా విధిస్తున్న పరస్పర సుంకాలు భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తాయని అంటున్నారు. వచ్చే 2–3 ఏళ్లలో భారతీయ ఎగుమతిదార్లకు 50 బిలియన్ డాలర్లకుపైగా అదనపు వ్యాపార అవకాశాలు లభిస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ అంచనా వేస్తోంది.
విశ్వసనీయ భాగస్వామిగా..
భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే వాస్తవాన్ని చాలా మంది విస్మరిస్తున్నారు. అపార దేశీయ వినియోగం, బలమైన స్వ దేశీ సరఫరా వ్యవస్థ దృష్ట్యా మన దేశం సా పేక్షంగా మంచి స్థానంలో ఉంది. ట్రంప్ సుంకాలు భారత్‌కు అపార అవకాశాలను తేవొచ్చు.
పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉ న్న దేశాలకు అత్యంత విశ్వసనీయ ఆర్థిక భాగస్వామిగా మా రడానికి గల అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడాని కి వేగంగా అనుసరించాల్సిన విధానాలను రూపొందించాలి. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్
వ్యూహాత్మక స్థానంగా..
ప్రతీకార సుంకాల నేపథ్యంలో కంపెనీలు తమ దృష్టిని భారత్‌పైకి మళ్లించవచ్చు. భారీ, పెరుగుతున్న వినియోగదారుల కేంద్రంగా విదేశీ సంస్థలకు వ్యూహాత్మక స్థా నంగా మన దేశం మారొచ్చు. వివిధ దేశాలకు విస్తరించాలని చూస్తున్న కంపెనీలకు ఆకర్షణీయ ప్రత్యామ్నాయంగా భారత్ నిలుస్తుంది. ప్రపంచ ఎల్రక్టానిక్స్ తయారీదారులకు ప్రాధాన్యత గమ్యస్థానంగా మారే చాన్స్ ఉంది. ఏఐ, పునరుత్పాదక శక్తి వంటి విభాగాల్లో ఆవిష్కరణ, ఆర్‌అండ్‌డీ కేంద్రంగా అవతరించడానికి భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. – డి.విద్యాసాగర్, ఎండీ, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్
ప్రత్నామ్నాయం లేదు..
జనరిక్ డ్రగ్స్ విషయంలో భారత్‌కు ప్రత్నామ్నాయ దేశం లేదు. టారిఫ్‌లకు సంబంధించి అమెరికాతో బ లంగా చర్చించే స్థానంలో ఉన్నాం. యూఎస్ తన ఆర్థిక బలాన్ని ప్రద ర్శిస్తే.. జనరిక్స్‌లో యూఎస్‌కు అతిపెద్ద సరఫరాదారుగా మన స్థానాన్ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే పూర్తిగా అమెరికా మార్కెట్‌పై ఆధారపడకుండా దీర్ఘకాలంలో కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ఇందుకు యూఎస్ ప్లస్ విధానం సరైన పరిష్కారం.
– రవి ఉదయ్ భాస్కర్‌మాజీ డైరెక్టర్ జనరల్, ఫార్మెక్సిల్
కొత్త మార్కెట్లకు విస్తరించాలి..
ఇప్పటివరకు వివిధ దేశాలు చైనాపై ఆధారపడకూడదని చైనా ప్లస్ నినాదం అందుకున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎగుమతుల విషయంలో యూఎస్ ప్లస్ నినాదంతో ముందుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. 2024లో భారత్ నుంచి ఎగుమతులు 5.58 శాతం ఎగిసి 814 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇందులో యూఎస్ వాటా 10.74 శాతం మాత్రమే. అంటే సింహభాగం ఎగుమతులు ఇతర దేశాలకు జరుగుతున్నాయన్న మాట.
ఎగుమతుల పరంగా యూఎస్‌పై ఆధారపడటం తగ్గించి కొత్త మార్కెట్లకు విస్తరించాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. అలాగే ప్రపంచ మార్కెట్లు అంత మెరుగ్గాలేవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే పనిలో దేశాలు నిమగ్నమవుతాయి. నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకు లభించే మార్కెట్‌వైపు దృష్టిసారిస్తాయి.
ఈ పరిస్థితిని భారత్ అవకాశంగా మలుచుకోవాలి. దీర్ఘకాలంలో భారత్ తన ఉత్పాదకతను మెరుగుపరచాలి. డిమాండ్ పెంచేందుకు తయారీ ఖర్చులను తగ్గించాలి. భారత్‌లో ఉత్పత్తులు ఖరీదు ఎక్కువన్న భావన తొలగేలా చేయాలి. దీనికోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని బలోపేతం చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం సూచించింది.
2024లో భారత్ –అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ: 129.2 బిలియన్ డాలర్లు
భారత్ నుంచి యూఎస్‌కు ఎగుమతులు: 87.4 బిలియన్ డాలర్లు. వృద్ధి 4.5 శాతం
యూఎస్ నుంచి భారత్‌కు దిగుమతులు: 41.8 బిలియన్ డాలర్లు. వృద్ధి 3.4 శాతం
వాణిజ్య లోటు: 45.7 బిలియన్ డాలర్లు. వృద్ధి 5.4 శాతం
2005తో పోలిస్తే ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా 2023 నాటికి రెండింతలై 2.4 శాతానికి చేరిక