భాజపా కా సంకల్ప్.. మోదీ కీ గ్యారంటీ–2024 పేరుతో బీజేపీ మేనిఫెస్టో
24 కీలక అంశాలతో ఎన్నికల ప్రణాళిక విడుదల
పేదలు, యువత, రైతులు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం
దేశంలో ఇక ఉమ్మడి పౌరస్మృతి
మరో ఐదేళ్లపాటు పేదలకు ఉచిత రేషన్
నిరుపేదలకు మూడు కోట్ల ఇళ్లు
దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైళ్లు
70 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.5 లక్షల ఉచిత వైద్యం
రక్షణ, వంటనూనెలు, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి
‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ దిశగా అడుగులు వేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘భాజపా కా సంకల్ప్.. మోదీ కీ గ్యారంటీ–2024’ పేరుతో అధికార బీజేపీ సార్వత్రిక ఎన్నికల సంకల్ప పత్రాన్ని (మేనిఫెస్టో) విడుదల చేసింది. పేదలు, యువత, రైతులు, మహిళలకు (జీవైఏఎన్)లకు మేనిఫెస్టోలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చిరు వ్యాపారులు, విశ్వకర్మలు, కారి్మకులకు భరోసా కల్పించారు. సురక్షిత, సమృద్ధ భారత్‌తోపాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అన్ని రంగాల్లో సమగ్ర వికాసం, సాంకేతికత, నవీన ఆవిష్కరణలు వంటి హామీలు ఇచ్చారు.
ఆదివారం ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్ తదితరులు సంకల్ప పత్రాన్ని విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో లబి్ధపొందిన ఒక మహిళతోపాటు మరో ముగ్గురికి సంకల్ప పత్రం తొలి కాపీలను మోదీ అందజేశారు. అంతకంటే ముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని నివాళులరి్పంచారు. రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో 27 మంది కమిటీ సభ్యులు సుమారు 15 లక్షల మంది నుంచి సలహాలు సూచనలు స్వీకరించి, సంకల్ప పత్రాన్ని రూపొందించారు. 24 అంశాలతో కూడిన 57 పేజీలతో మేనిఫెస్టోను సిద్ధం చేశారు.
సంకల్ప పత్రంలోని 24 అంశాలు..
‘2047 నాటికి వికసిత భారత్’ లక్ష్య సాధనే ధ్యేయంగా బీజేపీ మేనిఫెస్టోలో 24 కీలక అంశాలను చేర్చారు. పేద కుటుంబాల సేవ, మధ్యతరగతి కుటుంబాల విశ్వాసం, మహిళా సాధికారత, యువతకు అవకాశాలు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత, రైతులకు గౌరవం, మత్యకార కుటుంబాల సమృద్ధి, కారి్మకులకు గౌరవం, ఎంఎస్‌ఎంఈలక చేయూత, చిరు వ్యాపారులు, విశ్వకర్మల సాధికారత, సబ్‌కా సాథ్ సబ్ కా వికాస్, విశ్వబంధు భారత్, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, గ్లోబల్ తయారీ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ లివింగ్, వారసత్వం–అభివృద్ధి, సుపరిపాలన, ఆరోగ్య భారత్, నాణ్యమైన విద్య, క్రీడల వికాసం, అన్ని రంగాల్లో సమగ్ర వికాసం, సాంకేతికత–నూతన ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల భారత్ వంటి అంశాలు ఉన్నాయి.
బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు
► ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడం
► 80 కోట్ల మంది పేదలకు మరో ఐదేళ్లపాటు ఉచిత రేషన్
► ఐదేళ్లలో పేదల కోసం మరో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం
► దివ్యాంగులకు అనుకూలంగా ఇళ్ల నిర్మాణం
► దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లు
► వందేభారత్ రైళ్ల విస్తరణ
► ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా
► ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచడం
► 70 ఏళ్లుపైబడిన వయోజనులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ.5 లక్షల విలువైన ఉచిత వైద్యం
► వృద్ధుల కోసం ఆయుష్ శిబిరాలు
► రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వృద్ధులకు చేయూత
► ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ వర్తింపు
► మూడు కోట్ల మంది మహిళలను లఖ్‌పతీ దీదీలుగా మార్చే ప్రణాళిక
► పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పేదల నివాసాలకు ఉచిత విద్యుత్ సరఫరా
► మహిళాపారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
► ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
► మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు
► ఎప్పటికప్పుడు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
► ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం
► సేవారంగంలో స్వయం సహాయక సంఘాల అనుసంధానం
► గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్, ఎల్రక్టానిక్స్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, వాహన రంగాల్లో ప్రపంచస్థాయి హబ్‌ల ఏర్పాటు
► విద్యుత్తు వాహనాల రంగానికి మరింత ప్రోత్సాహం
► రక్షణ, వంటనూనెలు, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి
► విదేశాల్లోని భారతీయుల భద్రతకు చర్యలు
పదేళ్లుగా అభివృద్థి పథంలో భారత్: జేపీ నడ్డా
వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో చెప్పేదే బీజేపీ మేనిఫెస్టో అని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం పదేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని, వచ్చే ఐదేళ్లు కూడా ఇది కొనసాగుతుందని నడ్డా వివరించారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నామని, అందరి సహకారం, సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీ విశ్వసిస్తోందని పేర్కొన్నారు.
ఉమ్మడి పౌరస్మృతి అవసరం: మోదీ
దేశంలో ఉమ్మడి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత మేనిఫెస్టోల్లోనే ఈ హామీ ఇచి్చనప్పటికీ దాన్ని పూర్తి చేయలేకపోయామని చెప్పారు. గత సంకల్ప పత్రంలో ఇచి్చన ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి హామీలను నెరవేర్చామని గుర్తుచేశారు. ఆదివారం మేనిఫెస్టో విడుదల సందర్భంగా మోదీ మాట్లాడారు. సంకల్ప పత్రాన్ని ‘మోదీ కీ గ్యారంటీ’గా అభివరి్ణంచారు.
వికసిత భారత్‌లో అంతర్భాగమైన యువ శక్తి, నారీ శక్తి, పేదలు, రైతులు అనే నాలుగు స్తంభాలను తమ సంకల్ప పత్రం బలోపేతం చేస్తుందని అన్నారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ దిశగా అడుగులు వేస్తామన్నారు. దేశాభివృద్ధికి అడ్డుగోడగా మారిన అవినీతిపై యుద్ధం కొనసాగిస్తామని వెల్లడించారు. అవినీతిపరులు ఎంతటివారైనా కటకటాల వెనక్కి పంపిస్తామని, ఇది తన గ్యారంటీ అని స్పష్టం చేశారు. గరీబ్, యువ, అన్నదాత, నారీ(జీవైఏఎన్)ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ సంకల్ప పత్రం రూపొందించామని పేర్కొన్నారు.
దేశంలోని యువత ఆకాంక్షలను ఈ పత్రం ప్రతిబింబిస్తోందన్నారు. వందేభారత్, బుల్లెట్ రైళ్లను మరింత విస్తరిస్తామని తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు మార్గం పూర్తి కావొచి్చందని, ఇక ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లో కూడా బుల్లెట్ రైలు మార్గాలు అందుబాటులోకి తీసుకొస్తామని, దీనిపై త్వరలో అధ్యయనం ప్రారంభిస్తామని చెప్పారు. ‘140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలే మోదీ మిషన్. జూన్ 4వ తేదీన ఎన్నికలు ఫలితాలు వచ్చాక వంద రోజుల్లోనే సంకల్ప పత్రాన్ని అమలు చేసే ప్రణాళికతో పని చేస్తున్నాం’ అని ప్రధానమంత్రి మోదీ వివరించారు.
బీజేపీ మేనిఫెస్టోని విశ్వసించలేం: ఖర్గే
బీజేపీ మేనిఫెస్టోపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం ఘాటుగా స్పందించారు. గత పదేళ్ల కాలంలో పేదల కోసం ఏమీ చేయని ప్రధాని మోదీ ఇప్పుడు కొత్తగా హామీలు గుప్పించడం ఏమిటని ప్రశ్నించారు. అది మేనిఫెస్టో కాదు, జుమ్లా పత్రం అని మండిపడ్డారు. ‘‘రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గతంలో ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచుతానని, చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు.
గడిచిన పదేళ్లలో దేశంలోని ప్రజలందరికీ మేలు చేసేంత పెద్ద పని ఆయన ఏమీ చేయలేదు. పదేళ్లలో పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మోదీకి ఏమాత్రం ఆందోళన లేదు. పేదల సంక్షేమం కోసం ఏమీ చేయని ప్రధానమంత్రిని, బీజేపీ మేనిఫెస్టోను విశ్వసించలేం’’ అని ఖర్గే పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రికి 14 ప్రశ్నలను ‘ఎక్స్’ వేదికగా ఖర్గే సంధించారు.
యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేశారా? ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీ సంగతేంటి? ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 46 శాతం ఎందుకు పెరిగాయి? మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడంలేదు? మహిళలపై అఘాయిత్యాలను ఎందుకు ఆపడం లేదు? 100 కొత్త స్మార్ట్ సిటీల సంగతేంటి? 2020 నాటికి గంగానదిని ప్రక్షాళన చేస్తామన్న హామీ ఎటుపోయింది? అంటూ మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment