సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను ఓ కొలిక్కి తెచ్చేందుకు బీజేపీ సిద్ధమయ్యింది. ఇందుకోసం గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ కానుంది. భేటీ తర్వాత.. శుక్రవారం తొలి జాబితాలో వందకిపైగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతకు ముందు.. ఇవాళ అనేక రాష్ట్రాల నేతలతో బీజేపీ అధిష్టానం మేధోమథనం జరిపింది.
బుధవారం బీజేపీ సీనియర్ నేత అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో మాట్లాడారు. మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతో భేటీ జరిగింది. జాబితా తుది కూర్పుపై షా, నడ్డాలు వాళ్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం ప్రకటించబోయే తొలి జాబితాలో.. మూడొంతుల అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగే అభ్యర్థుల జాబితాపై పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా వంటి అగ్రనేతల పేర్లు తొలి జాబితాలోనే ఉండనున్నట్లు పార్టీ వర్గాలు లీకులు ఇచ్చాయి. అయితే.. 2019లోనూ ఇలానే అగ్రనేతల పేర్ల జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. కానీ, ఆ సమయంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక లిస్ట్ ఇచ్చింది. అయితే..
స్ట్రాటజీ ఇలా..
ఈసారి మాత్రం ముందుగానే లిస్ట్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు కారణం.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు. ఆ అనుభవం దృష్ట్యా ఈసారి భిన్నంగా ముందుగానే ప్రకటించాలనుకుంటోంది. తద్వారా ఎన్నికల ప్రచారానికి సమయం దొరుకుతుందనేది బీజేపీ స్ట్రాటజీ. ఉదాహరణకు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం గతంలో ఎన్నడూ గెలవని 39 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్‌లలో సత్ఫలితాలను రాబట్టింది. అందుకే.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల తొలి జాబితా కోసం అదే స్ట్రాటజీని ఫాలో కానున్నట్లు స్పష్టమవుతోంది. ఫస్ట్ లిస్ట్‌లో.. 2019 ఎన్నికల్లో గెలవని స్థానాలను కూడా చేర్చాలనే యోచనలో కమల అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఆ సంఖ్య 130 దాకా ఉండొచ్చని.. తొలి జాబితాలో దక్షిణ ప్రాంతం నుంచి అత్యధిక స్థానాల ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.
తెలంగాణలో ఆయనకు పక్కా..
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. తెలంగాణ నుంచి 6 నుంచి పదిమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్ ఎంపీ రాములు గురువారం నాడే బీజేపీలో చేరనున్నారు. అయితే.. రేపటి లిస్ట్‌లో ఆయన పేరును కూడా ప్రకటించే ఛాన్స్ ఉందని.. నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వనున్నారని ప్రచారం నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment