రాష్ట్రానికి మోదీ, షా, నడ్డా  | BJP High Command Focus on Lok Sabha Elections 2024: telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి మోదీ, షా, నడ్డా 

Published Tue, Feb 27 2024 2:25 AM | Last Updated on Tue, Feb 27 2024 2:26 AM

BJP High Command Focus on Lok Sabha Elections 2024: telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుస ఎన్నికల  పర్యటనలతో హోరెత్తించనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసంగా పది ఎంపీ సీట్లు గెలుపొందాలన్న లక్ష్యం నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రచారాన్ని ప్రారంభించక ముందే బీజేపీ ఉధృత ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. ఆ మేరకు ఆ పారీ్టల అభ్యర్థుల ప్రకటనకు ముందే ఈ నెలాఖరులోగా బీజేపీ అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారపర్వంలోకి దూకాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

షెడ్యూల్‌ ఇచ్చేలోగానే మోదీ 2 సభలు... 
ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోగానే ఆదిలాబాద్, సంగారెడ్డిల్లో ఏర్పాటు చేసిన సభలకు ప్రధాని మోదీ విచ్చేసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని తెలుస్తోంది. ఆయా సభలకు ముందు రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారం¿ోత్సవాలు, శంకుస్థాపనలను మోదీ చేతుల మీదుగా చేపట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. గత పదేళ్ల పాలనలో కేంద్రంలో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతితో పాటు జాతీయ, రాష్ట్రస్థాయిల్లో కాంగ్రెస్‌ పార్టీ తీరును, రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ సర్కారు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై మోదీ సునిశిత విమర్శలు చేస్తారని రాష్ట్ర పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

29న బీజేపీ తొలి జాబితా...? 
ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాష్ట్రంలోని 17 సీట్లలో మెజారిటీ (అంటే 12 స్థానాలకు) అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ 29న ఇద్దరు లేదా ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు, ఐదారుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరి చేరికను బట్టి ఎవరు గట్టి అభ్యర్థులు అవుతారో వారి బలాబలాల ప్రాతిపదికన పేర్లను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, మరింత మెరుగైన అభ్యర్థుల కోసం అన్వేషణలో భాగంగా... జహీరాబాద్, పెద్దపల్లి, నల్లగొండ, వరంగల్, ఖమ్మం సీట్లకు క్యాండిడేట్ల ఎంపికను పెండింగ్‌లో పెట్టినట్టుగా పార్టీ నాయకులు చెబుతున్నారు. 

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేలోగానే అగ్రనేతల విస్తృత ప్రచారం 

  • ఆదిలాబాద్, సంగారెడ్డి సభలకు పీఎం మోదీ 
  • ఆ తర్వాత అమిత్‌ షా, జేపీ నడ్డా ప్రచారం  
  • 4న హైదరాబాద్‌లో అమిత్‌ షా సభ! 
  • 29న బీజేపీ తొలి జాబితా? 
  • 12 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు 

4న అమిత్‌ షా రాకుంటే మోదీ? 
వచ్చే నెల 4న హైదరాబాద్‌లో సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా పాల్గొంటారని తెలుస్తోంది. ముందుగా రాష్ట్ర పర్యటన ఖరారైతే అదే రోజున అమిత్‌ షా బదులు మోదీ సభ ఉండొచ్చునని సమాచారం. ఈ సభ కోసం గచ్చిబౌలి, సరూర్‌నగర్‌ స్టేడియాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలు కవర్‌ చేసేలా (ఐదు వేర్వేరు ప్రాంతాల్లో) చేపట్టిన విజయసంకల్పయాత్రల ముగింపు సందర్బంగా హైదరాబాద్‌లో మార్చి 2న అమిత్‌షా సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని తొలుత భావించారు. ఐతే 2వ తేదీకి బదులు 4న రాష్ట్రానికి వచ్చేందుకు అమిత్‌షా సమయం కేటాయించడంతో అదేరోజున సభను నిర్వహించాలని నిర్ణయించినట్టు పారీ్టవర్గాల సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement