సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సన్నద్ధంలో భాగంగా కమలదళం స్పీడ్ పెంచింది. తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో 35 శాతం ఓటింగ్‌తో పది సీట్లను గెలుపొందాలంటూ జాతీయ నాయకత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా రాష్ట్ర పార్టీ కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లను 5 క్లస్టర్లుగా విభజించారు. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ధర్మారావుతో పాటు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్య దర్శులు నలుగురిని ఈ క్లస్టర్లకు ఇన్‌చార్జిలుగా నియమించారు. వచ్చే నెల 5 తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ ఐదు క్లస్టర్లలో బీజేపీ ఎన్నికల రథయాత్రలను నిర్వహించనున్నారు.
రోజుకు రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పదిరోజుల్లో ఆయా లోక్‌సభ క్లస్టర్లలోని అసెంబ్లీ సెగ్మెంట్లను కవర్ చేయాలని నిర్ణయించారు. క్లస్టర్ల పరిధిలోకి వచ్చే లోక్‌సభ సీట్లలోని ముఖ్యనేతలంతా ఈ రథయాత్రల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలు కవర్ అయ్యేలా రథయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా ఆయా క్లస్టర్ల వారీగా రథయాత్రల నిర్వహణ కమిటీలు, ఆయా బాధ్యతల నిర్వహణకు వివిధ బృందాల ఏర్పాటు వంటివి ఖరారు కానున్నట్టు తెలిసింది.
రాష్ట్రానికి అగ్రనేతల వరుస టూర్లు
ఫిబ్రవరి ఆఖర్లో లేదా మార్చి మొదటివారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చుననే అంచనాల నేపథ్యంలో పార్టీ అగ్రనాయకులు రాష్ట్ర పర్యట నకు రానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 28న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కరీంనగర్ లోక్‌సభ క్లస్టర్ పరిధిలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ క్లస్టర్ పరిధిలో ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో కూడా పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు.
ఇక వివిధ అభివృద్ధికార్యక్రమాలతో పాటు పార్టీపరంగా నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొనేందుకు ఈ నెలాఖరులోగా ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయని పార్టీనాయకులు చెబుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో మోదీ పాల్గొనవచ్చునని తెలుస్తోంది. అదేవిధంగా ఈ నెలాఖరులో లేదా వచ్చేనెల మొదటివారంలో జరిగే పార్టీ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment