సంకల్ప్ పత్రాన్ని విడుదల చేయనున్న ప్రధాని మోదీ, నడ్డా, అమిత్ షా
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా హామీలు ఉండే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను బీజేపీ అగ్ర నాయకత్వం ఆదివారం విడుదల చేయనుంది. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంకల్ప్ పత్రాన్ని ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన అజెండాలుగా నిలిచిన అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి హామీలను ఇప్పటికే నెరవేర్చిన తరుణంలో ఈసారి అలాంటి ఏఏ కీలకమైన హామీలకు మేనిఫెస్టోలో చోటుకలి్పస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. ప్రధాని మోదీ తరచూ ప్రస్తావించే నాలుగు ప్రధాన కులాలు.. పేదలు, రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా హామీలను ప్రస్తావించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మేనిఫెస్టో రూపకల్పనపై కమిటీ ఛైర్మన్, రక్షణ మంత్రి రాజ్‌నా«థ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యులతో కూడిన కమిటీ ఇప్పటికే రెండుసార్లు భేటీ అయింది. మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలకోసం నమో యాప్ సహా 35 రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇలా లక్షలాది మంది పార్టీ మద్దతుదారుల నుంచి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని ముఖ్యాంశాలను రూపొందించినట్లు తెలుస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మార్గసూచీని ప్రకటించడంతో పాటు మోదీ గ్యారెంటీలకు సంబంధించిన హామీలను మరోమారు ప్రకటించే అవకాశాలున్నాయి. మతపరమైన అంశాలతో పాటు జాతీయవాద అంశాలను ప్రధానంగా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలున్నాయని కమలనాథులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment