‘ఉగ్రవాదుల మృతిపై సోనియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారు’ | Sakshi
Sakshi News home page

‘ఉగ్రవాదుల మృతిపై సోనియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారు’

Published Fri, Apr 26 2024 12:49 PM

JP Nadda Says Sonia Gandhi cried for terrorists Over Batla House encounter - Sakshi

పట్నా: 2008లో జరిగిన బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదుల మరణంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాం‍ధీ కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. లోక్‌సభ ఎ‍న్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బిహార్‌లోని మధుబని ర్యాలీలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

‘బాట్లా ఎన్‌కౌంటర్‌ సమయంలో ఉగ్రవాదులు మరణిస్తే.. కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారని ఆ పార్టీ నేతలు అన్నారు. ఆమె ఉగ్రవాదుల  కోసం ఏడ్చారు.   ఉగ్రవాదులతో ఏం సంబంధం ఉంది?. ఉగ్రవాదులపై సానుభూతి చూపాల్సిన కారణం ఏంటి? ఉగ్రవాదులతో ఉన్న లింక్‌ ఏంటి?. కాంగ్రెస్‌ పార్టీ, ఇండియా కూటమి దేశాన్ని బలహీనపరిచేందుకు దేశ వ్యతిరేకులకు మద్దతగా నిలుస్తుంది. దేశాన్ని బలహీనపరిచే వారిపట్ట కాంగ్రెస్‌ పార్టీ సానుభూతి ప్రదర్శిస్తుంది. ఇండియా కూటమి ఒక అహంకారపూరితమై కూటమి. అటువంటి కూటమికి మీరు (ప్రజలు) మద్దతు పలుకుతారా?’ అని నడ్డా  అన్నారు.

2008లో బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఢిల్లీ పోలీసు ఇన్స్‌పెక్టర్ మోహన్‌ శర్మా, ఇద్దరు ఉగ్రవాదలు మరణించారు. 2012  ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్‌ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యల గుర్తు చేస్తూ జేపీ నడ్డా.. సోనియా గాంధీపై  విమర్శలు గుప్పించారు.

‘బాట్లా ఎన్‌కౌంటర్‌ జరిగిన సమయంలో నేను మంత్రిని కాదు. అయితే ఆ ఎన్‌కౌంటర్‌ విషయంలో సానియా గాంధీ కన్నీరు పెట్టుకున్నారు’ అని సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. అదే సమయంలో మరో కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సల్మాన్‌ ఖుర్షీద్‌  వ్యాఖ్యలను ఖండించారు. ‘సోనియా గాంధీ కన్నీరుపెటుకోలేదు. సల్మాన్ ఖుర్షీద్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంతంగా అనుకున్నవి మాత్రమే’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల  ప్రచారంలో ఈ విషయంపై జేపీ నడ్డా వ్యాఖ్యలు చేయటంతో మళ్లీ తెరపైకి వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement