సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిధ్దం చేసేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) భేటీ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం జరుగుతున్న ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇచ్చి.. ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం సాయంత్రం పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా ‘భాగిదారీ న్యాయ్’(భాగస్వామ్య న్యాయం), ’కిసాన్ న్యాయ్’, ’నారీ న్యాయ్’, ’శ్రామిక్ న్యాయ్’,’యువ న్యాయ్’పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. ఇక.. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, రైతులకు వడ్డీలేని రుణాలు, ప్రస్తుతం కేంద్రం అందిస్తున్న సాయం పెంపు, యువత కోసం 30 లక్షల ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వ లేక ప్రైవేట్ రంగంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా లేక డిగ్రీ హోల్డర్‌కు అప్రెంటిస్ షిప్ శిక్షణకు రూ.లక్ష సాయం, 30 ఏళ్లలోపు యువత స్టార్టప్‌లకు నిధులు సమకూర్చడానికి రూ.5,000 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు, పేపర్ లీకేజీల నివారణకు ప్రత్యేక చట్టం, మహిళల కోసం నిరుపేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి రూ.లక్ష సాయం వంటి 25 హామీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మేనిఫెస్టో విడుదల మాత్రం తర్వాతే ఉటుందని పార్గీ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థుల ఎంపికపై సీఈసీ..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే పలు మార్లు భేటీ అయిన కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) మంగళవారం మళ్లీ సమావేశం కానుంది. ఇప్పటికే రెండు విడతలుగా 82 మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. 19న జరిగే భేటీలో తెలంగాణలోని మిగతా స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశాలున్నాయి. భేటీలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమ వారం మధ్యాహ్నం ముంబై నుంచి నేరుగా ఢిల్లీ చేరుకోగా, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహ మంగళవారం ఉదయానికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment