ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్‌ ఎజెండా: జేపీ నడ్డా | Sakshi
Sakshi News home page

ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్‌ ఎజెండా: జేపీ నడ్డా

Published Tue, May 7 2024 5:18 AM

సోమవారం నల్లగొండ జనసభలో తనకు బహూకరించిన ఖడ్గంతో జేపీ నడ్డా

సాక్షి, పెద్దపల్లి/సాక్షి, యాదాద్రి, నల్లగొండ టూటౌన్‌: ‘ఏ అంటే ఏఐఎంఐఎం.. బీ అంటే బీఆర్‌ఎస్‌.. సీ అంటే కాంగ్రెస్‌. ఈ మూడు ఏబీసీ పార్టీలు ముస్లిం లీగ్‌ ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఇవి తబ్లిగీ జమాతేను అనుసరిస్తున్నాయి’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. రజాకార్‌ పాలనను సమర్ధించే పార్టీలుగా వాటిని అభివర్ణించారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఆ పార్టీలు నిర్వహించవని.. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. సోమవారం పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలోని పెద్దపల్లి జిల్లా కేంద్రంతోపాటు భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్, నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని నల్లగొండ పట్టణంలో నిర్వహించిన జన సభల్లో ఆయన ప్రసంగించారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం 
ప్రధాని మోదీ దేశంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపిస్తున్నారని నడ్డా దుయ్యబట్టారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలోంచి 4% కోత పెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు తెచ్చిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవి దక్కేలా చూస్తామన్నారు. 

ఎస్సీ, ఎస్టీ,  ఓబీసీ రిజర్వేషన్లు తొలగించబోమనే విషయాన్ని లిఖితరూపంలో ఇచ్చే దమ్ముందా..? అని ప్రధాని మోదీ నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తే.. ఇప్పటివరకు రాహుల్‌ స్పందించలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, మతం పేరిట ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  

శ్రీరాముని వ్యతిరేకి కాంగ్రెస్‌.. 
శ్రీరాముడు, సనాతన ధర్మం, దేశాన్ని వ్యతిరేకించేది కాంగ్రెస్‌ పార్టీ అని నడ్డా ఆరోపించారు. సనా తన ధర్మం గురించి కాంగ్రెస్‌ మిత్రపక్షమైన డీఎంకే ఎన్ని విమర్శలు చేసినా సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ స్పందించలేదన్నారు. దేశాన్ని ముక్కలు చేస్తామన్న వారికి రాహుల్‌ మద్దతిస్తున్నారని ఆరోపించారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు జరిపితే అందుకు ఆధారాలు అడిన పార్టీ కాంగ్రెస్‌ అని దుయ్యబట్టారు. 

అలాంటి వారికి అధికారమిస్తే దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మరోవైపు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరిట కేసీఆర్‌ పేదలను మోసగించారని నడ్డా ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను కేసీఆర్‌ ఉపయోగించలేదని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా దానిపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే డబుల్‌ బెడ్రూం ఇళ్లు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. 

5వ ఆర్థిక శక్తిగా భారత్‌.. 
గత పదేళ్లలో ప్రధాని మోదీ దేశం విలువను పదింతలు పెంచారని నడ్డా తెలిపారు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలతో విదేశీ ఎగుమతులు పెరిగాయని చెప్పారు. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారత్‌ మోదీ విధానాలతో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. 

మోదీ పాలనలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. అందుకే దేశాభివృద్ధికి పాటుపడుతున్న బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని నడ్డా కోరారు. ఆయా సభల్లో పార్టీ ఎంపీ అభ్యర్థులు గోమాస శ్రీనివాస్‌ (పెద్దపల్లి), బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి), శానంపూడి సైదిరెడ్డి (నల్లగొండ)తోపాటు సిట్టింగ్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత, పార్టీ రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement