సాక్షి, అమరావతి : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్రంలో వాటిపై ఆశలు పెట్టుకున్న నేతల్లో ఉత్కంఠ మొదలైంది. రాష్ట్రానికి చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండడంతో వాటికి మార్చి 23వ తేదీన ఎన్నిక జరగనుంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవి, రేణుకా చౌదరి టీడీపీ తరఫున దేవేందర్‌గౌడ్ ప్రాతినిధ్యం వహించిన స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
రాష్ట్ర విభజన సమయంలో జరిగిన కేటాయింపులో తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్‌కి ఏపీ, ఏపీకి చెందిన సీఎం రమేష్‌కు తెలంగాణ ప్రాతినిథ్యం లభించింది. ప్రస్తుతం ఏపీలో ఖాళీ అవనున్న మూడు స్థానాల్లో రెండు తెలుగుదేశం పార్టీకి దక్కనుండగా ఒకటి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించనుంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించింది. టీడీపీ తనకు వచ్చే రెండు స్థానాలను ఎవరికి కేటాయించాలనేది ఇంకా నిర్ణయించలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై అంతర్గతంగా కసరత్తు చేస్తున్నారు.
పోటీలో ఆ ముగ్గురూ...
టీడీపీ తరఫున రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్న యనమల తనను రాజ్యసభకు పంపాలని చాలాకాలం నుంచి చంద్రబాబును కోరుతున్నారు. అయితే అసెంబ్లీ, ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉండే ఆయనను రాజ్యసభకు పంపితే తనకు ఇబ్బంది అవుతుందేమోననే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.
ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్నాను కాబట్టి తనకు ఇవ్వాలని కంభంపాటి కోరుతుండగా, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తనకు ఇవ్వాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి అడుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్ మళ్లీ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నప్పటికీ చంద్రబాబు సుముఖంగా లేనట్లు సమాచారం. ఎస్సీ మాదిగ వర్గంలో ఒకరికి ఈసారి అవకాశం ఇవ్వాలనే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే వర్ల రామయ్య, సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యే మసాల పద్మజ పేర్లు వినిపిస్తున్నాయి.
పార్టీయేతర వ్యక్తులకూ అవకాశం?
భవిష్యత్తు అవసరాలు, కార్పొరేట్ లాబీయింగ్ కోసం పార్టీయేతర వ్యక్తులకు కూడా రాజ్యసభ అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తతో చర్చలు కూడా జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో పార్టీకి చెందిన ప్రముఖుడికి కూడా రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment