'దివీస్'‌పై దిగజారుడు రాజకీయం | Chandrababu Politics On Divis Laboratories | Sakshi
Sakshi News home page

'దివీస్'‌పై దిగజారుడు రాజకీయం

Published Sat, Dec 12 2020 2:56 AM | Last Updated on Sat, Dec 12 2020 4:42 PM

Chandrababu Politics On Divis Laboratories - Sakshi

సాక్షి, అమరావతి /సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడి దృష్టిలో అది వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ. అధికారం లేకుంటే మాత్రం కాలుష్యం వెదజల్లే పరిశ్రమ!!. ఇదీ తెలుగుదేశం పార్టీ ద్వంద్వ నీతి. ఫార్మా దిగ్గజం దివీస్‌ ల్యాబరేటరీస్‌కు చెందిన యూనిట్‌ విషయంలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే... తమ నిర్వాకాలన్నీ రాష్ట్ర ప్రజలు మరిచిపోయారని ఆ పార్టీ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఫార్మా యూనిట్‌ ఏర్పాటుకు దివీస్‌ సన్నాహాలు మొదలుపెట్టడాన్ని సాకుగా తీసుకుని.. వాస్తవాలను కప్పిపుచ్చి, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటన మరీ చిత్రం. ఎందుకంటే దివీస్‌కు అనుమతులిచ్చిందీ, కాకినాడ సెజ్‌ నుంచి భూములు వెనక్కి తీసుకుని మరీ కేటాయింపులు చేసిందీ సాక్షాత్తూ చంద్రబాబు ప్రభుత్వమే. పైపెచ్చు దివీస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పట్లో తూర్పుగోదావరి జిల్లా కోన ప్రాంతంలో 82 రోజుల పాటు పోలీసు రాజ్యం.. అరెస్టుల పర్వం కొనసాగించింది కూడా టీడీపీ సర్కారే. దివీస్‌ ప్రతిపాదనకు బాబు కేబినెట్‌ ఆమోదం తెలపడం, అందుకనుగుణంగా తొలుత ప్రభుత్వం, ఆ తర్వాత ఏపీఐఐసీ జీవోలు ఇవ్వడం, తక్కువ ధరకే భూములు కట్టబెట్టడం.. ఈ మొత్తం వ్యవహారాన్ని వెనక నుంచి నడిపించిన నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు... ఇపుడు ప్లేటు ఫిరాయించడాన్ని స్థానికులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. 
2015లో కేసెజ్‌ నుంచి దివీస్‌కు భూమి కేటాయిస్తూ టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో,  భూ కేటాయింపు ప్రక్రియను పూర్తిచేస్తూ ఏపీఐఐసీ ఇచ్చిన ఉత్తర్వులు 

బాబు హయాంలో జరిగింది ఇదీ..
► వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీఎంఆర్‌ కాకినాడ సెజ్‌ (కేసెజ్‌) కోసం (పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు కోసం) ప్రభుత్వం కాకినాడ సమీపంలో 10,400 ఎకరాల భూమి సేకరించి ఇచ్చింది.
► 2014 సెప్టెంబర్‌ 27న దివీస్‌ ల్యాబొరేటరీస్‌ కాకినాడ సమీపంలోనే సముద్ర తీర కోన ప్రాంతం, తొండంగి మండలం ఒంటిమామిడి వద్ద సుమారు రూ.790 కోట్ల పెట్టుబడితో ఫార్మా యూనిట్‌ (యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రిడియంట్స్‌ తయారీ) ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసింది.
► ఈ ప్రతిపాదన రాగానే ఫైల్‌ వాయువేగంతో కదిలింది. కాకపోతే దివీస్‌ ప్రతిపాదించిన ప్రాంతంలో భూమి అప్పటికే కే–సెజ్‌కు కేటాయించి ఉంది.
► దీంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. కేసెజ్‌పై ఒత్తిడి తీసుకువచ్చి దానికి కేటాయించిన భూమిలో.. 2,094.74 ఎకరాలతో కూడిన ఒక భాగంలో 505 ఎకరాలను దివీస్‌కు ఇప్పించేలా ఒప్పించారు.
► ఇందుకు బదులుగా మరోచోట కేసెజ్‌కు 279.38 ఎకరాల భూమి ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. దీన్ని నాటి కేబినెట్‌ ఓకే చేసింది. 
► యనమల సభ్యుడిగా ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీబీ) సిఫారసుల మేరకు.. దివీస్‌కు ప్రత్యేక రాయితీలిస్తూ 2015 జూలై 15న ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది.
► మంత్రివర్గ ఆమోదానికి అనుగుణంగా కేసెజ్‌ నుంచి 505 ఎకరాలు వెనక్కి తీసుకొని దివీస్‌కు కేటాయిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ 2015 సెప్టెంబర్‌ 14న ఉత్తర్వులు జారీ చేసింది.
► ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ఏపీఐఐసీ కూడా 2015 అక్టోబర్‌ 17న ఉత్తర్వులు జారీ చేసి భూ కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. కారు చౌకగా ఎకరం రూ.6 లక్షలకు కట్టబెట్టింది.
► అయితే దివీస్‌కు ఇచ్చిన 505 ఎకరాలు కే సెజ్‌ మధ్యలో ఉండటంతో దానిలోకి వెళ్లడానికి కనీసం రోడ్డు కూడా లేక ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. 
► తాజాగా అప్రోచ్‌ రోడ్డు నిర్మించుకునేందుకు దివీస్‌ చర్చలు జరుపుతోంది. 
► తమ యూనిట్‌తో ఎలాంటి కాలుష్యం ఉండదని చెబుతూ.. హైదరాబాద్‌తో పాటు విశాఖ, నెల్లూరు జిల్లాల్లో ఉన్న యూనిట్లలో తాము తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను స్థానికులకు తెలియజేస్తోంది.
► పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలను శుద్ధి చేసి, సముద్రపు నీటిలో ఉండే ఉప్పు శాతం కంటే తక్కువ స్థాయికి తెచ్చి పైప్‌లైన్‌ ద్వారా సముద్రంలో 1.5 కి.మీ దూరంలో కలిపేలా తీసుకుంటున్న చర్యలను సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు.
► దీనివల్ల మత్స్య సంపదకు, భూగర్భ నీటికి ఎటువంటి హాని కలగదంటూ అవగాహన కల్పిస్తున్నారు.
► ఈ వాస్తవాలన్నిటినీ పక్కనబెట్టి ఇదేదో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నట్లుగా... కోన ప్రాంతం దెబ్బతింటుందంటూ యనమల యాగీ చేయటమే విచిత్రం.

‘కోన’పై ఉక్కుపాదం
దివీస్‌ పరిశ్రమపై 2016 జూన్‌ 22న పంపాదిపేటలో కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 14 గ్రామాల నుంచి వందలాది మంది 2016 ఆగస్టు నుంచి ఉద్యమం నడిపారు. ఆ ఏడాది చివరి వరకూ సాగిన ఈ ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. బడుగు, బలహీనవర్గాలు, దళిత రైతులు, మత్స్యకారులపై కక్ష కట్టి, కోన ప్రాంతంలో 82 రోజుల పాటు పోలీసు రాజ్యం నడిపించింది. బయటి ప్రాంతాల నుంచి బంధువులను కూడా కోన గ్రామాలకు రానివ్వకుండా పొలిమేరల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లనివ్వకుండా నెలల తరబడి 144 సెక్షన్‌ కొనసాగించి భయానక వాతావరణం సృష్టించారు. మహిళలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించారు. సుమారు 400 మందిని అరెస్టు చేశారు.  
బాబు హయాంలో పంపాదిపేట గ్రామంలో మహిళలను ఈడ్చుకెళ్తున్న పోలీసులు 

దివీస్‌ను తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమే
కోన ప్రాంతంలో దివీస్‌ పరిశ్రమ చిచ్చు పెట్టింది టీడీడీ ప్రభుత్వమే. దివీస్‌ పరిశ్రమకు 500 ఎకరాలు కేటాయించినట్టు అసెంబ్లీ సాక్షిగా అప్పటి ఆర్థిక మంత్రి యనమల ప్రకటించారు. పరిశ్రమ వద్దంటూ పోరాటం చేస్తున్న మమ్మల్ని హింసించారు. తప్పుడు కేసులు బనాయించారు. అప్పుడలా చేసి ఇప్పుడు స్థానికంగా ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడటం వింతగా ఉంది.
– అంగుళూరి అరుణ్‌కుమార్, దివీస్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుడు, కొత్తపాకలు గ్రామం, తొండంగి మండలం
కోన ప్రజలపై దాష్టీకం ప్రదర్శించారు
టీడీపీ ప్రభుత్వం అనుమతించిన దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమించిన మాపై పోలీసులు అన్యాయంగా, అక్రమంగా దౌర్జన్యకాండ జరిపారు. అరెస్టులు చేశారు. మహిళలు, వృద్ధులని కూడా చూడకుండా విచక్షణారహితంగా లాఠీలతో జులుం ప్రదర్శించారు. దివీస్‌కు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నాం.
– చొక్కా కాశీ ఈశ్వరరావు, 
మత్స్యకార నాయకుడు, నర్శిపేట గ్రామం, తొండంగి మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement