
ఢిల్లీ: తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించింది. రేణుక చౌదరి, అనిల్‌కుమార్ యాదవ్‌కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్‌కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం.
ఇక.. అజయ్ మాకెన్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, చంద్రశేఖర్‌లను రాజ్యసభ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి ఎంపిక చేసింది. మధ్య ప్రదేశ్ నుంచి అశోక్‌సింగ్‌ను ఏఐసీసీ ఎంపిక చేసింది. వీరంతా రేపు(గురువారం) నామినేషన్ వేయనున్నారు.
రేణుకా చౌదరీ ఎవరి కోటా.?
తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపిక చేసిన రేణుకా చౌదరీ పేరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విశాఖలో పుట్టిపెరిగిన రేణుకా చౌదరీ.. బెంగళూరులో చదువుకున్నారు. 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1986 నుంచి 1998 వరకు తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా పని చేశారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. 1998లో టిడిపిని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేణుకా ఖమ్మం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. వివాదస్పద ప్రకటనలు చేసి తరచుగా వార్తల్లోకెక్కే రేణుకా చౌదరీ మరోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు.
అనిల్ కుమార్ యాదవ్ పేరు ఆశ్చర్యమే.!
తెలంగాణ నుంచి తనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానికి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటన వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "నాలాంటి యువకుడికి అధిష్ఠానం రాజ్యసభ అవకాశం ఇవ్వడం అనందంగా ఉంది. కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు దక్కుతాయి అనడానికి ఇదే ఉదాహరణ. నాకు పదవి ఇవ్వడం అంటే యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి గుర్తించినట్టు.!. బీసీల తరపున కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు. కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తేవడమే రాహుల్ గాంధీ లక్ష్యం. బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ, నాకు రాజ్యసభ ఇవ్వడంతో కాంగ్రెస్ యువతకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. రాజ్యసభ అవకాశం ఇస్తారని.. నా జీవితంలో ఊహించలేదు" అని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.