కేవీపీ, సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్‌లకు మళ్లీ రాజ్యసభ చాన్స్
నంది ఎల్లయ్య, రత్నాబారుుకి దక్కని అవకాశం
నాలుగో సీటుకు టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రాష్ట్రం నుంచి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్‌లను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ ముగ్గురూ రాజ్యసభ సిట్టింగ్ సభ్యులే కావడం విశేషం. మరో ఇద్దరు సిట్టింగ్ సభ్యులు నంది ఎల్లయ్య, రత్నాబారుులకు ఈసారి అవకాశం కల్పించలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ‘సమైక్య’ అభ్యర్థిని రంగంలోకి దింపుతామని పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో.. బలమైన అభ్యర్థులుగా భావించి సీమాంధ్ర ప్రాంతం నుంచి టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీలను కాంగ్రెస్ బరిలోకి దింపినట్లు చెబుతున్నారు.
ఇక తెలంగాణ నుంచి ఎం.ఎ.ఖాన్‌ను ఎంపికచేశారు. సుబ్బరామిరెడ్డి ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై సోమవారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌లు పార్టీ అధ్యక్షురాలితో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాత్రి 7.20 ప్రాంతంలో మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించిన 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన మొత్తం ఐదు స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో ప్రస్తుతం మూడుస్థానాలు గెలుచుకునేందుకే పూర్తి బలం ఉంది. ఇత ర పార్టీలు సహకరిస్తే మరోస్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్‌ఎస్ తరఫున కె.కేశవరావు బరిలోకి దిగుతుండడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ పార్టీకి అవకాశం ఇస్తూ.. నాలుగోస్థానాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమైనట్టు అభ్యర్థుల జాబితాను బట్టి అర్థమవుతోంది. దిగ్విజయ్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా
ఆంధ్రప్రదేశ్: టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్ ఛత్తీస్‌గఢ్: మోతీలాల్ వోరా గుజరాత్: మధుసూదన్ మిస్త్రీ హిమాచల్‌ప్రదేశ్: విప్లవ్ ఠాకూర్ మధ్యప్రదేశ్: దిగ్విజయ్‌సింగ్ మహారాష్ట్ర: మురళీ దేవ్‌రా, హుస్సేన్ ఉమర్ దాల్వే మణిపూర్: హజీ అబ్దుల్ సలాం మేఘాలయ: వాన్సుక్ సయ్యం ఒడిశా: రణ్‌జిబ్ బిశ్వత్.
నన్ను పార్టీ నమ్మింది: సుబ్బరామిరెడ్డి
రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక కావడంపై సుబ్బరామిరెడ్డి స్పందించారు. ‘సంప్రదాయాన్ని పక్కనబెట్టి నాకు మూడోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్‌కు నేను పూర్తిగా విధేయుడిని. ఎలాం టి పరిస్థితి ఉన్నా పార్టీ మాట జవదాట లేదు. నేను అజాత శత్రువునని పార్టీ నమ్మింది’ అని అన్నారు.
కాంగ్రెస్ పెద్దలు ముగ్గురే
Published Tue, Jan 28 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
Advertisement
Advertisement