ఓసీకి ఒకటి.. బీసీకి రెండు | TRS Rajya Sabha Candidates | Sakshi
Sakshi News home page

ఓసీకి ఒకటి.. బీసీకి రెండు

Published Mon, Mar 12 2018 2:21 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

TRS Rajya Sabha Candidates  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ ఆ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అధినేత కేసీఆర్‌ ఈ ముగ్గురి పేర్లను అధికారికంగా ప్రకటించారు. మొదటి నుంచీ అనుకున్న విధంగా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన సంతోష్‌కు అవకాశం దక్కగా, మిగిలిన ఇద్దరు అభ్యర్థుల విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.

యాదవుల కోటాలో చాలా మంది పోటీ పడినప్పటికీ నల్లగొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌కు అవకాశమిచ్చిన కేసీఆర్‌ అదే రీతిలో వరంగల్‌ జిల్లాకు చెందిన బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌ను కూడా పెద్దల సభ రేసులో నిలబెట్టి పార్టీ నేతలను సైతం ఆశ్చర్యపరిచారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన బడుగుల లింగయ్య 2015లో టీఆర్‌ఎస్‌లో చేరారు. బండ ప్రకాశ్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. వీరిద్దరి ఎంపికతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు అవకాశం ఇచ్చారనే చర్చ పార్టీలో జరుగుతోంది.

అయితే, సామాజిక సమీకరణల్లో భాగంగానే బండ ప్రకాశ్‌ను ఎంపిక చేశారని తెలంగాణ భవన్‌ వర్గాలంటున్నాయి. ముదిరాజ్‌ మహాసభ ద్వారా బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రకాశ్‌ను రాజ్యసభకు పంపడం బీసీలకు పెద్దపీట వేయడమేనని, అందులో భాగంగానే కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. ముఖ్యంగా బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాలను పంపడం ద్వారా ఆయా వర్గాలను ఆకర్షించాలనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మూడింటిలో రెండు స్థానాలను బీసీలకు కేటాయించారని గులాబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

టీఆర్‌ఎస్‌ తరఫున గతంలో ఒక ఓసీ నేతను రాజ్యసభకు పంపగా, ఇప్పుడు మరో ఓసీ అభ్యర్థిని పెద్దల సభ రేసులో నిలబెట్టారు. గతంలో ఈ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైన ముగ్గురిలో కూడా ఇద్దరు బీసీలుండగా, ఇప్పుడు మళ్లీ ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.  

బడుగుల లింగయ్య యాదవ్‌  
తల్లిదండ్రులు: అంతయ్య, యలమంచమ్మ
ఊరు: భీమారం, కేతేపల్లి మండలం, నల్లగొండ జిల్లా
వయసు: 58 ఏళ్లు
చదువు: బీఏ, బీఈడీ  
భార్య: నాగమణి,  
పిల్లలు: డాక్టర్‌ యస్వంత్, దీప్తి  
రాజకీయ అనుభవం: 1982లో టీడీపీలో చేరారు. 1985–87 వరకు కేతేపల్లి మండల తెలుగు యువత అధ్యక్షుడిగా, 1987–97లో కేతేపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా, 1995లో భీమారం ఎంపీటీసీగా, 1998 –2012 వరకు టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2009లో మహాకూటమి తరఫున స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి 26 ఓట్లతో నేతి విద్యాసాగర్‌ చేతిలో ఓడిపోయారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా పనిచేస్తూ 2015, మార్చి 16న టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.  

జోగినపల్లి సంతోష్‌కుమార్‌
తల్లిదండ్రులు: రవీందర్‌రావు, శశికళ
ఊరు: కొదురుపాక, బోయినపల్లి
మండలం, కరీంనగర్‌ జిల్లా
వయసు: 42 ఏళ్లు
చదువు: ఎంబీఏ, ఎంపీఎం
భార్య: రోహిణి
పిల్లలు: ఇషాన్, శ్రేయాన్‌
అనుభవం: సంతోష్‌ చదువు పూర్తయి ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన జెండా చేపట్టిన కేసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. 2004లో హరీశ్‌ మంత్రి అయిన తర్వాత ఈ బాధ్యతలను తీసుకున్న సంతోష్‌ అప్పటి నుంచి కేసీఆర్‌కు తోడు నీడగా ఉన్నారు. గత 13 ఏళ్లుగా కేసీఆర్‌ కన్నా ముందే ప్రారంభమయ్యే సంతోష్‌ దినచర్య కేసీఆర్‌ నిద్రకు విశ్రమించిన తర్వాతే ముగుస్తుంది. కేసీఆర్‌ ఢిల్లీలో ఉన్నా, గల్లీలో ఉన్నా సంతోష్‌ ఆయన వెన్నంటి ఉండాల్సిందే. అటు పార్టీలో, ఇటు కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ తలలో నాలుకగా ఉండే సంతోష్‌ వ్యక్తిగతంగా కూడా మంచిపేరు సాధించుకున్నారు. ప్రస్తుతం టీన్యూస్‌ ఎండీగా కూడా ఉన్నారు.  

బండ ప్రకాశ్‌ ముదిరాజ్‌
వయసు: 63 ఏళ్లు
చదువు: ఎంఏ, పీహెచ్‌డీ
అనుభవం: కుడా సభ్యుడిగా, వరంగల్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా, వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు కూడా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement