
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు అయ్యారు. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్లను ఖరారు చేశారు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.
అందరితో సంప్రదించిన తర్వాతే నలుగురి పేర్లను ఖరారు చేసినట్లు బొత్స, సజ్జల మీడియాకు తెలిపారు. విజయసాయిరెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపాలని నిర్ణయించినట్లు బొత్స వెల్లడించారు. అలాగే జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మరో బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డిలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో ఇద్దరు బీసీలేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా వైఎస్సార్‌సీపీది ఒకేటే దారి అని, జనాభా దామాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నామన్నారు సజ్జల. గత మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధిని వైఎస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటోందని సజ్జల తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment