నిందితులకు పోలీసులు మద్దతు పలుకుతున్నారు
సినీ నటి జత్వానీ మొబైల్ ఫోన్, ఐపాడ్‌లలో కీలక సమాచారం ఉంది
దాన్ని జత్వానీకి ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు
హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి
కీలక విషయాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్న హైకోర్టు
సాక్షి, అమరావతి: బాధితుడినే నిందితుడిగా మార్చి.. నిందితులకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని కుక్కల విద్యాసాగర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఇలాంటి ఘటన చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. సినీ నటి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సినీనటి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులు విద్యాసాగర్ నుంచి బలవంతంగా రూ.కోటి వరకు గుంజితే.. పోలీసులు రివర్స్‌లో అతనిపైనే కేసుపెట్టి ప్రాసిక్యూట్ చేయాలంటున్నారని వివరించారు. జత్వానీకి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారం ఉందని, డబ్బు కోసం విద్యాసాగర్‌ను బెదిరించిన మెసేజ్‌లు అందులో ఉన్నాయని తెలిపారు.
అందుకే వాటిని భద్రపరచాలని తాము న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. జత్వానీ చాటింగ్ మెసేజ్‌లను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బయటపెట్టడం లేదని తెలిపారు. జత్వానీ రెండు ఆధార్ కార్డులు కలిగి ఉన్నారని, కేంద్రం ఎవరికీ రెండో ఆధార్ కార్డు ఇవ్వదన్నారు. జత్వానీ సోదరుడికి అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని, ఈ విషయంలో కూడా పోలీసులు మౌనంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని, ఇందుకు జత్వానీని ఓ సాధనంగా వాడుకుంటోందన్నారు.
ఆ బాధ్యత పోలీసులపై ఉంది
నిరంజన్‌రెడ్డి వాదనలపై హైకోర్టు స్పందిస్తూ.. ఇలాంటి కీలక విషయాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానిస్తూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట
మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. బీజేపీ నేత, ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై దాడి కేసులో సురేష్ రిమాండ్‌ను కోరవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో సురేష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయన విషయంలో కఠిన చర్యలేవీ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసులో దర్యాప్తును కొనసాగించవచ్చని పోలీసులకు స్పష్టం చేస్తూ పోలీసుల విచారణకు హాజరు కావాలని నందిగంను ఆదేశించారు. ఈ వ్యాజ్యంలో పోలీసుల తరఫున పీపీ వాదనల నిమిత్తం న్యాయమూర్తి విచారణను ఈ నెల 16కి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment