అదే జోరు.. అదే పోరు
Published Sat, Aug 10 2013 2:45 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉద్యమకారుల జోరు మరింత పెరిగింది. వారి డిమాండ్‌కు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తలొగ్గారు. శ్రీకాకుళం, టెక్కలి, ఆమదాలవలస, పలాస ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, కొర్ల భారతి, బొడ్డేపల్లి సత్యవతి, జుత్తు జగన్నాయకులు, ఎమ్మెల్యీ పీరుకట్ల విశ్వప్రసాద్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కిరణ్‌కు రాజీనామాలు సమర్పించారు. మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా రాజీనామా చేయాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు.
కొనసాగిన ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు
జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులు శుక్రవారం రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, ర్యాలీలు నిర్వహించారు. సోనియాగాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని విద్యుత్ ఉద్యోగులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. జర్నలిస్ట్ సంఘాలు జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాయి. పలు కళాశాలల ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డుల ఉద్యమం చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లిం సోదరులు జామియా మసీదు నుంచి వైఎస్‌ఆర్ కూడలి వరకూ ర్యాలీగా తరలివచ్చి మానవహారం నిర్వహించారు. ఎస్టీ వసతిగృహ విద్యార్థులు సూర్యమహల్ కూడలి నుంచి వైఎస్‌ఆర్ కూడలి మీదుగా పొట్టిశ్రీరాములు కూడలి వరకూ ర్యాలీ జరిపారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో డేఅండ్‌నైట్ కూడలి వద్ద విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు మానవహారం చేపట్టారు. పీఎస్‌ఎన్‌ఎం స్కూల్ నుంచి డేఅండ్‌నైట్ కూడలి వరకు 60 అడుగుల త్రివర్ణపతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, మహేష్‌బాబు ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో సూర్యమహల్ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. పాలకొండలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మానవహారం, ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ కార్యకర్తలు కళ్లకు నల్లగుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. ఎన్‌ఎంయూ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి రాస్తారోకో చేశారు. భామినిలో టీడీపీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. వీరఘట్టం మండలం తెట్టంగి జంక్షన్‌లో గ్రామస్తులు రాస్తారోకో చేసి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
పలాసలో సిక్కోలు ధూమ్‌ధామ్
పలాస- కాశీబుగ్గ పట్టణంలో ఉద్యమకారులు ‘సిక్కోలు ధూమ్‌ధామ్’ కార్యక్రమాన్ని చేపట్టా రు. పలాస ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. నరసన్నపేటలో జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పద్మావతి జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ర్యాలీ నిర్వహించా రు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కేసీఆర్, సోనియాగాంధీల దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఆమదాలవలసలో వంటావార్పు
ఆమదాలవలసలో సమైక్యాంధ్ర రక్షణ సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటావార్పు నిర్వహించారు. సరుబుజ్జిలి సెంటర్‌లో యువకులు రోడ్డును దిగ్బంధించి వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. ఇచ్ఛాపురంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. సోంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిపారు.
ఉద్యమంపై విద్యార్థుల ప్రచారం
ఎచ్చెర్లలో అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మండలంలోని పలు గ్రామాలకు వెళ్లి సమైక్యాంధ్ర ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. టెక్కలి, సంతబొమ్మాళి, నందిగాంల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. టెక్కలిలో జర్నలిస్టులు సమైక్యాంధ్ర చిత్రపటాలను పంపిణీ చేశారు.
రాజాంలో బంద్ విజయవంతం
రాజాంలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అన్నివర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 2,500 మంది జ్యూట్‌మిల్లు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో పలు చోట్ల సోనియా, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలతో శవయాత్రలు నిర్వహించారు. అనంతరం వాటిని దహనం చేశారు. పాతపట్నంలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మూడో రోజుకు చేరాయి. కొత్తూరు మండలం బలద, కౌలస్యపురం, నివగాంలలో బంద్ విజయవంతమైంది. వారణాసి- పర్లాఖిమిడి రోడ్డు మధ్యలో ట్రాక్టర్ తొట్టెలను అడ్డుపెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. బలదలో కేసీఆర్, సోనియాలకు పిండప్రదానం చేశారు. ఎల్‌ఎన్‌పేట యువ కులు ఏపీ రోడ్డుపై ధర్నా చేశారు.
Advertisement