జిల్లాలో పరిస్థితి ఇదీ..
- విజయవాడలో వెంకయ్య చక్కర్లు
- సీమాంధ్రులను సాంత్వనపరిచేందుకు యత్నం
- కాంగ్రెస్‌ను ఎండగట్టాలంటూ పార్టీ శ్రేణులకు ఉద్బోధ
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రాంతానికి తీవ్ర నష్టం కలిగించే విషయంలో కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ రెండూ సమాన పాత్ర పోషించాయి. విభజన జరగదంటూ సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రజల్ని మభ్యపెడితే, విభజన చివరి అంకంలో సీమాంధ్రకు అండగా ఉన్నట్లు బీజేపీ నేతలు నటించి నిండా ముంచారు.
ఈ రెండు ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కటి నిజాయితీగా వ్యవహరించినా.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తపనతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యేవని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు సీమాంధ్రులంతా కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందేనని ఛీత్కరించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలను ఏదో విధంగా మభ్యపెట్టి ఓట్లు దండు కోవడానికి రెండు పార్టీలు సిద్ధమవు తున్నాయి. ఈ విషయంలో బీజేపీ ఒకడుగు ముందుగా ఉంది.
రాజకీయ రాజధాని నుంచి..
కోస్తా జిల్లాల రాజకీయ రాజధాని విజయవాడ నుంచే సీమాంధ్రులకు సాంత్వన వచనాలు పలికేందుకు బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు రెండు రోజులుగా ప్రయత్నించారు. ఆయన విజయవాడలో మకాంవేసి ఇక్కడి ప్రజలకు జరిగిన నష్టం గురించి చెబుతూ.. ఈ ప్రాంతానికి న్యాయం చేసేందుకు తాము చేసిన ప్రయత్నాలను వివరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ 13 జిల్లాల నేతలతోనే కాకుండా.. ఈ ప్రాంత కార్యకర్తలు, పారిశ్రామికవేత్తలు, విలేకరులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అంది స్తామంటూ హామీలు గుప్పించారు. బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీని ఈ ప్రాంతానికి తీసుకువచ్చి ఆయనతో ఈ ప్రాంత అభివృద్ధికి స్పష్టమైన హామీ ఇప్పిస్తామంటూ వెంకయ్య ప్రకటించారు.
కాంగ్రెస్‌దే తప్పంటూ..
ప్రస్తుతం కాంగ్రెస్‌ను సీమాంధ్రులు చీదరించుకుంటున్న నేపథ్యంలో వారిని తమకు అనుకూలంగా మలచుకోవాలని వెంకయ్య పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. పార్టీ కార్యకర్తల సమావేశం, 13 జిల్లాల కార్యవర్గ నేతల సమావేశంలోనూ ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోవడానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనన్న అంశం ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలని సూచించారు. బీజేపీ గురించి ప్రజలు ప్రశ్నిస్తే.. ఆదినుంచి బీజేపీ విభజనకు సిద్ధంగానే ఉందని, చివర్లో రాజ్యసభలో తాను పట్టుబట్టడం వల్లనే సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ దక్కిందన్న అంశాన్ని ప్రజలకు వివరించాలంటూ నేతలకు పాలి‘ట్రిక్స్’ నేర్పారు.
టీడీపీతో పొత్తులపై ఆరా!
ఎన్నికల పొత్తు ఉన్నా, లేకపోయినా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని వెంకయ్య పార్టీ శ్రేణులకు సూచిస్తూనే.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి ఏమేరకు ఉపయోగం ఉంటుందని పార్టీ శ్రేణులను ఆరా తీసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం వెంకయ్య తొలిసారిగా జరిపిన పర్యటన ఆ పార్టీకి ఏమేరకు లాభిస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది.