సాక్షి, విజయవాడ : నగరంలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతారణం ఏర్పడింది. ఏపీ యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు యూత్ కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆందోళన కారులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూనీ చేసిందని, తగిన బలం లేకపోయినా అడ్డదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు.
బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఆపార్టీ నేత జమ్మల శ్యామ్ కిషోర్ ఖండించారు. ఏపీలో ఉనికి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇవ్వడం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబుకు కర్ణాటక గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ.. ఇప్పడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు రాజకీయలకు పాల్పడుతోందిని దుయ్యబట్టారు. బీజేపీ చట్టాలను గౌరవిస్తుందని.. బలం నిరూపించుకుంటే సీఎంగా యడ్యూరప్ప కొనసాగుతారని లేదంటే పదవికి రాజీనామా చేస్తారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment