బెజవాడ రానున్న జైరాం రమేష్
- బెజవాడ రానున్న జైరాం రమేష్
- కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశం
- నేతల హాజరుపై అనుమానాలు
సాక్షి, విజయవాడ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఉండేదెవరో, పోయేదెవరో మంగళవారం తేలిపోయే అవకాశముంది. కేంద్ర మంత్రి, రాష్ట్ర విభజనలో కీలక పాత్ర పోషించిన జైరాం రమేష్ మంగళవారం విజయవాడకు రానున్నారు. ఆయన కాంగ్రెస్ జిల్లా, నగర నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎంతమంది నాయకులు వస్తారనేదానిపై అనుమానాలు నెలకొన్నాయి. పార్టీలో కొనసాగాలనుకునేవారు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉండగా, గోడ దూకేవారు ఈ సమావేశానికి వచ్చే అవకాశం కనపడటం లేదు.
ఇప్పటికే దయనీయం...
ఇప్పటికే జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైంది. సీమాంధ్ర ప్రజల అభీష్టానికి విరుద్ధంగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడంతో ఈ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొంది. రెండు పార్లమెంట్ స్థానాలకు కూడా ఈసారి కొత్త అభ్యర్థులను చూసుకోవాల్సి ఉంది.
రాష్ట్ర విభజన జరిగిపోవడంతో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి కొత్త పార్టీ పెట్టించే దిశలో పావులు కదుపుతున్నారు. ఆయన జైరాం రమేష్ పెట్టిన సమావేశానికి వచ్చే సూచనలు కనపడటం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి రంగంలోకి వస్తారో.. మాటకు కట్టుబడి రాజకీయాలకు దూరంగా ఉంటారో చూడాల్సి ఉంది.
మరోవైపు మచిలీపట్నం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాడిగ రామకృష్ణ ఈసారి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన కూడా సమావేశానికి హాజరయ్యే పరిస్థితి లేదు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. మంత్రి కొలుసు పార్థసారథి కూడా దాదాపు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పినట్లే ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగుదేశంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాజధానిలో చంద్రబాబునాయుడు సారథి చేరిక అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం.
మిగిలినవారిదీ అదే దారి...
మరోవైపు పామర్రు శాసనసభ్యుడు డీవై దాస్ బాపట్ల తెలుగుదేశం ఎంపీగా రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకోగా తిరువూరు శాసనసభ్యురాలు దిరిశం పద్మజ్యోతి తిరుపతి ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం తరఫున పోటీకి దిగేందుకు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున మిగిలిన సెంట్రల్ శాసనసభ్యుడు మల్లాది విష్ణు కూడా వేరే పార్టీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి తాను పార్టీ మారడం లేదని చెబుతున్నా కాంగ్రెస్‌లో ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.
ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో విలీనమైన విజయవాడ తూర్పు, పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి రవి, వెల్లంపల్లి శ్రీనివాసరావులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కొంటున్నారు. విజయవాడ తూర్పు సీటుకు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ నుంచి పోటీ ఉండటంతో యలమంచిలి వేరే పార్టీలవైపు చూస్తున్నట్లు సమాచారం. వెల్లంపల్లి శ్రీనివాసరావు మాత్రం తాను జైరాం రమేష్ మీటింగ్‌కు వస్తున్నట్లు నగర నాయకులకు చెప్పినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ స్థానానికి మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) కుమారుడు అవినాష్‌ను రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమంతో అవినాష్ పేరు జిల్లా మొత్తం తెలియడంతో ఆయనను పోటీలోకి దింపడం ద్వారా గెలవకపోయినా రాజకీయంగా బలపడవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఆయన రెండురోజుల క్రితం ఆంధ్రరత్న భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటుచేసి వెళ్లిపోయేవారు వెళ్లిపోతే యువరక్తం పోటీకి సిద్ధంగా ఉందని ప్రకటించారు. మంగళవారం సమావేశానికి ఎంతమంది వస్తారన్న దాన్నిబట్టి పార్టీలో మిగిలేదెవరో తెలుస్తుందని నాయకులు చెబుతున్నారు.