సమైక్యాంధ్రకు ‘పశ్చిమ’లో మిన్నంటుతున్న నిరసనలు
Published Thu, Aug 8 2013 3:32 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వేలాది మందితో ఉప్పు సత్యాగ్రహం.. వెల్లువెత్తిన విదేశీ వస్త్ర బహిష్కరణ.. సహాయ నిరాకరణ.. పన్నుల చెల్లింపు నిరాకరణ.. ఇవన్నీ దేశ స్వాత్రంత్య ఉద్యమం నాటి ఘట్టాలు. 70 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనల్ని అప్పటి తరం వాళ్లు చెబుతున్నా.. ఆ ఘట్టాలకు సంబంధించిన వివరాలను చదువుతున్నా శరీరం రోమాంఛితమవుతుంది. ‘అబ్బా.. అప్పట్లో ఉద్యమాలు అలా జరిగేవా.. అప్పటి ప్రజలు అంతటి పోరాట పటిమ కలిగి ఉండేవారా.. అలాంటి ఆందోళనలు ఈ తరాల వారికి సాధ్యమేనా.. వారి నిబద్ధత ప్రస్తుత సమాజానికి సాధ్యమేనా’ అనే ప్రశ్నలెన్నో ఉద్భవిస్తాయి. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం జిల్లాలో వెల్లువెత్తుతున్న ఉద్యమాలు ఆ ప్రశ్నలను పటాపంచలు చేస్తున్నాయి. పైగా ఆ కాలంలో మహా నాయకులెందరో ముందుండి చైతన్యం రగిలించారు. స్వాతంత్య్ర ఉద్యమాల్ని ముందుకు నడిపించారు. ఇప్పుడు అలాంటి నాయకులెవరూ లేరు. కానీ.. సామాన్య జనమే ఉద్యమపథంలో ఉరకలు వేస్తున్నారు. భావోద్వేగాలు రగిలినప్పుడు ఉద్యమాలు వాటికవే పుడతాయనడానికి సమైక్యాంధ్ర ఉద్యమ పోరాటం ఓ గొప్ప ఉదాహరణగా కనిపిస్తోంది. ఈ అభిప్రాయూన్ని వ్యక్తం చేస్తున్నది సాదాసీదా జనం కాదు. సాక్షాత్తు మేధావులు చెబుతున్న మాట ఇది.
ఖాకీ కవాతుల్ని తోసిరాజని...
రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు పోలీసులు చేసిన కవాతులు.. పారామిలటరీ బలగాల హడావుడి సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో చేష్టలుడిగి చూస్తున్నారుు. జిల్లా చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా, ఎవరూ ఊహించని స్థాయిలో సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజురోజుకూ విస్తరిస్తోంది. తొమ్మిది రోజుల క్రితం రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది మొదలు ఇప్పటివరకూ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ ఆందోళనలు నిరంతరాయంగా మిన్నంటుతూనే ఉన్నాయి. ఎవరి ప్రోద్బలం లేకుండానే.. ఎవరూ నాయకత్వం వహించకుండానే ప్రజలు స్వచ్ఛం దంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తుండటం మేధావుల్ని సైతం ఆశ్చర్చ చకితుల్ని చేస్తోంది. ఇక్కడి ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా రాష్ట్రాన్ని విడగొడుతున్నారనే సరికి ఒక్కసారిగా అన్ని వర్గాలవారు తమంతట తాముగా రోడ్లపైకి వస్తుం డటం ఆశ్చర్యపరుస్తోంది. విభజన ప్రకటనకు ముందు రోడ్లపై పోలీసులు చేసిన కవాతులు, పారామిలటరీ బలగాల హడావుడి ఉద్యమం ధాటికి కనుమరుగయ్యూరుు. పోలీ సులు కూడా ఏంచేయలేక అచేతనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వినాయక చవితి, దసరా ఉత్సవాలకు ప్రతి వీధి నుంచి నిమజ్జనాల ఊరేగింపులు రోడ్లపైకి వచ్చినట్లుగా ఏలూరు నగరం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నా రుు. ఉద్యమకారులు ప్రధాన కూడళ్లకు చేరుకుంటున్నారు. పల్లెలు సైతం తొలి రోజునుంచే ఉద్యమబాట పట్టారుు.
వినూత్నానికే వినూత్నం
ఉద్యమం అంటే ఒక ప్రదర్శన.. ఒక ధర్నా.. ఒక బహిరంగ సభ.. రాస్తారోకో వంటి పద్ధతులు మాత్రమే ఉంటాయని అందరికీ తెలుసు. అప్పుడప్పుడూ వినూత్న నిరసనలూ చూస్తుంటాం. కానీ సమైక్య ఉద్యమంలో చేస్తున్నన్ని వినూత్న ఆందోళనలు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న పెద్దలు చెబుతున్నారు. దిష్టిబొమ్మల దగ్ధాలు, వంటా వార్పు నుంచి పిండ ప్రదానాలు, హోమాలు, శవయాత్రలు, మానవహారాలతోపాటు రోడ్లపై ఆటలు ఆడి తమ నిరసన తెలుపుతున్నారు. తొమ్మిది రోజులుగా సాగుతున్న ఈ ఉద్యమంలో పాల్గొనని రంగం లేదంటే నమ్మక తప్పదు. ప్రతి అసోసియేషన్ సమైక్య ఉద్యమంలో పాల్గొనడం తమ బాధ్యతగా భావిస్తోంది.
వ్యక్తి నుంచి సంఘం వరకూ..
యువకులు, విద్యార్థులు ఉద్యమానికి కొండంత అండగా నిలబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో కార్యరంగంలోకి దిగారు. రైతులు, కార్మికులతోపాటు రిక్షా కార్మికులు, తోపుడు బళ్లు, ఇస్త్రీ బళ్లు, జట్టు కూలీలు, మేదరులు ఒకటేమిటి చివరకు హిజ్రాలు సైతం సమైక్య ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వ్యాపారులు షాపులు మూసివేసి షట్టర్లకు సమైక్యాంధ్రకు మద్దతుగా ఫ్లెక్సీలు వేలాడదీశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఏలూరు ఆర్‌ఆర్‌పేట మొత్తం నిర్మానుష్యంగా మారి ప్రతి షాపు ఎదుటా ఈ ఫెక్ల్సీలే కనబడుతున్నాయి. తోపుడు బండిపై పళ్లు అమ్ముకునే వ్యక్తి సైతం సమైక్యాంధ్ర నినాదాన్ని ఒక అట్టముక్కపై రాసి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడంటే ఉద్యమం ఎంత లోతుల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. కార్లు, ఆటోలు, రిక్షాలపైనా సమైక్యాంధ్ర స్టిక్కర్లే కనిపిస్తున్నాయి.
ఎక్కడికక్కడ జేఏసీలు
ప్రారంభంలో ఎవరికివారే విడిగా చేసిన ఉద్యమాలు రెండు మూడు రోజుల్లోనే ఒకే గొడుకు కిందకు వచ్చాయి. పట్టణాల్లో జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఏలూరులో 60కిపైగా సంఘాలున్న జేఏసీ సమావేశమై వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది. తాడేపల్లిగూడెం, భీమవరం జేఏసీలు తమ కార్యక్రమాలను ప్రకటించాయి. మిగిలిన పట్టణాలతోపాటు చాలా మండల కేంద్రాల్లోనూ జేఏసీలు ఉద్యమాలకు పకడ్బందీగా రూపకల్పన చేసి అమలు చేస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు కూడా తమ గ్రామాల్లో ఆందోళనలు చేయడానికి సిద్ధమవుతున్నారు. స్వాతంత్య్రోద్యమం ఎలా జరిగిందో తాము చూడలేదు కానీ.. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం అందుకు తీసిపోదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఉద్యమ కేంద్రాలుగా భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం
జిల్లాలో సమైక్య ఉద్యమానికి ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ ఉదయం నుంచి రాత్రి వరకూ ఆందోళనలతో హోరెత్తుతోంది. ప్రతిరోజూ ఈ సెంటర్‌లో 12 నుంచి 15 వరకూ ఆందోళనలు జరుగుతున్నాయి. లారీ, ట్యాక్సీ, జీపు, ట్రాక్టర్ల ఓనర్లు, వర్కర్లు, కళాకారులు, రైతాంగ సమాఖ్య, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, విద్యుత్, హాస్టల్ ఉద్యోగులతోపాటు ఇతర రంగాలకు చెందిన 23 సంఘాలు బుధవారం ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ఆందోళనలు జరపాయంటే ఉద్యమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. భీమవరం ప్రకాశం చౌక్‌లోనూ నిత్యం 15కిపైగా ఆందోళనలు జరుగుతున్నాయి. సమైక్య నినాదంతో ఈ సెంటర్ దద్ధరిల్లుతోంది. తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్‌లో కూడా ప్రతిరోజూ పదికిపైగా ఆందోళనలు నమోదవుతున్నాయి. ఇక మిగిలిన పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ నిరసనలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. మారుమూల గ్రామాలు సైతం సమైక్యాంధ్ర కోసం పోరుబాట పట్టాయి.
Advertisement