టీడీపీ నేతలు డ్రామాలు కట్టిపెట్టాలి
Published Wed, Aug 7 2013 3:09 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు : టీడీపీ అధినేత చంద్రబాబు జటిలమైన సాగునీటి సమస్యను ఏ మాత్రం పట్టించుకోకుండా గుడ్డిగా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర విభజనకు అంగీకరించడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అన్నారు. చంద్రబాబు విధానాలపై ప్రశ్నించకుండా టీడీపీ నేతలు ధర్నాలు, ర్యాలీలు చేస్తూ డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల మనోభీష్టాన్ని ఇప్పటికైనా గమనించి డ్రామాలు కట్టిపెట్టాలని కాంగ్రెస్, టీడీపీ నేతలకు సూచించారు.
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణాలో కలిపేందుకు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని, అదే జరిగితే శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ పరిధిలోకి వెళ్తుందని, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మున్ముందు ఆంధ్ర ప్రాంతంలో తాగునీటికి కటకటలాడుతూ ఉప్పు నీరే శరణ్యమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు పూనుకున్న కాంగ్రెస్, వత్తాసు పలికిన టీడీపీలు చరిత్ర హీన పార్టీలుగా మిగిలిపోతాయని హెచ్చరించారు.
ఇప్పటికే ఎన్టీపీసీ రామగుండం నుంచి ఆంధ్రా ప్రాంతానికి విద్యుత్తు విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, విభజన జరిగితే ఈ ఇబ్బందులు రెట్టింపవుతాయన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ పెదకూరపాడు సమన్వయకర్త నూతలపాటి హనుమయ్య, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు, బీసీ విభాగం, సేవాదళ్, ఎస్సీ సెల్ కన్వీనర్లు దేవళ్ళ రేవతి, చిన్నపరెడ్డి, సాయిబాబు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Advertisement