ప్రజలే సమైక్యాంధ్ర ఉద్యమ సారథులు
Published Fri, Aug 9 2013 2:28 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో సకల జనోద్యమంగా మారింది. అన్నివర్గాల ప్రజలు ఎక్కడిక్కడ రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ధర్నాలు చేస్తున్నారు. రాస్తారోకోలు, మానవహారాలతో నిరసన తెలుపుతున్నారు. సోనియాగాంధీ, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలను దహనం చేసి కర్మకాండ నిర్వహిస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియలు పలు సంఘాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ సీపీ రాష్ర్ట నేత ధర్మాన కృష్ణదాస్ అందరికంటే ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. జిల్లాలోని వివిధ కులాలు, ఉద్యోగ సంఘాలవారు నేరుగా ఉద్యమ బాట పడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా వారు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు నేత లు మద్దతు పలుకుతున్నారు.
ఉద్యమంలో అగ్రభాగాన ఉద్యోగ సంఘాల జేఏసీ
జిల్లాలో ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో సమైక్యాంధ్ర జేఏసీ అగ్రభాగాన ఉంది. గురువారం శ్రీకాకుళం పట్టణంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపింది. ఉద్యమకారులు మోటారు సైకిళ్లు, ఇతర వాహనాలు, కాలినడకన ర్యాలీలో పాల్గొన్నారు. డే అండ్ నైట్ జంక్షన్‌లో ఉద్యమకారులు నినాదాలు చేసి నిరసన తెలిపారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. రోడ్డుపై వంటావార్పు చేసి భోజనాలు చేశారు. తెలంగాణ ప్రకటన వెలువడిన రోజు నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. విద్యుత్, జిల్లా పరిషత్, వ్యవసాయ, పశుసంవర్థక శాఖల ఉద్యోగులు కూడా దీక్షలు చేపట్టారు.
దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ నేతలు
సమైక్య ఉద్యమం రోజురోజుకు ఉద్ధృతమవుతుండటంతో కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలోని 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నీలకంఠంనాయుడు ఒక్కరే రాజీనామా చేయడంతో మిగిలినవారు కూడా అదే బాట పట్టక తప్పని పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావును ధర్మసందేహం ఇంకా వీడినట్లు లేదు. వెంటనే రాజీనామా చేయాలని పార్టీలోని ముఖ్యనాయకులంతా పట్టుబట్టడంతో ఆయన కూడా నేడో రేపో రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజీనామా చేసి ఉద్యమబాట పట్టకుంటే వారి ఇళ్లను ముట్టడించడంతోపాటు ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేసేందుకు సమైక్య వాదులు వ్యూహం రూపొందిస్తున్నారు.
ఉద్యమంలో ముందున్న వైఎస్‌ఆర్ సీపీ
సమైక్య ఉద్యమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ముందున్నారు. అందరికంటే ముందుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ధర్మాన కృష్ణదాస్ ఇప్పటికే పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నరసన్నపేటలో జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ ఆయన పాలు పంచుకుంటున్నారు. సమైక్య ఉద్యమ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. ఇక నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల కన్వీనర్ల ఆధ్వర్యం లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉద్య మం ఈ నెల 12 నుంచి మహోద్యమంగా మారుతుందని నేతలు చెబుతున్నారు. సమ్మెకు పిలుపునిచ్చిన ఎన్‌జీవోలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామంటున్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో ధర్మాన ప్రద్మప్రియతోపాటు అంధవరపు సూరి బాబు, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర ఇతర నాయకులు పాల్గొన్నారు.
అడపాదడపా కనిపిస్తున్న టీడీపీ నేతలు
ఆందోళనల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడక్కడ, అడపాదడపా కనిపిస్తున్నారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో బ్రాహ్మణులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలతోపాటు టీడీపీవారు కూడా పాల్గొన్నారు. టీడీపీ నాయకులు మాటలకే పరిమితమవుతున్నారని, పెద్దగా ఆందోళనల్లో పాల్గొనటం లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఐక్య ఉద్యమానికి విద్యార్థులు సన్నద్ధం
జిల్లాలో ఇకముందు ఐక్యంగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించేందుకు పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రణాళిక రూపొం దించారు. ఇప్పటివరకు ఎవరికివారు నేరుగా ఆయా పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. ఇకమీదట ఐక్యంగా ఉద్య మ పథంలో నడవాలని నిర్ణయించారు.
ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీలో ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. కమిటీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చా వేదికలు ఏర్పాటు చేసి వివిధ పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులతో మాట్లాడించి అందరినీ చైతన్యవంతం చేస్తున్నారు.
Advertisement