మెట్రోరైలుకు కదలిక | Metro train movement | Sakshi
Sakshi News home page

మెట్రోరైలుకు కదలిక

Published Tue, Mar 25 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

మెట్రోరైలుకు కదలిక

మెట్రోరైలుకు కదలిక

  • నాలుగు రూట్లతో ప్రాథమిక నివేదిక
  •  రూట్లవారీ భూ సేకరణపై త్వరలో సర్వే
  •  సాక్షి, విశాఖపట్నం: మెట్రో రైలు ప్రాజెక్టుపై అధికారుల చర్యలు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖతోపాటు గుంటూరు-విజయవాడ మధ్య కూ డా మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనలున్నాయి. గతంలో ఇవే ప్రాజెక్టులకు కేంద్రం 50 శాతం, రాష్ట్రం 50 శాతం నిధులు సమకూర్చే విధంగా నిబంధనలు రూపొందించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టు వ్యయంలో ఏకంగా 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరించనున్న నేపథ్యంలో ప్రాజెక్టులపై జీవీఎంసీ త్వరితగతిన సన్నద్ధమవుతోంది.
     
    నాలుగు రూట్లు గుర్తింపు!
     
    విశాఖ సిటీ డెవలప్‌మెంట్ ప్లాన్(సీడీపీ)లో భాగంగా గతంలోనే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం(ఎంఆర్‌టీఎస్) పేరిట మూడు మెట్రో కారిడార్లను ప్రతిపాదించారు. వీటిని సీడీపీ రెండో దశలో చేపట్టాలనుకున్నారు. ఇందులో పాతపోస్టాఫీసు నుంచి హనుమంతవాక(8 కి.మీ.), ఆశీలుమెట్ట నుంచి లంకెలపాలెం(15 కి.మీ.), కాన్వెంట్ కూడలి నుంచి పెందుర్తి(20 కి.మీ.) కారిడార్ల ప్రతిపాదనలున్నాయి. ఈలోగానే కేంద్రం మెట్రో రైలు ప్రాజెక్టుతో ముందుకు రావడంతో ఆ ప్రతిపాదనలు మరుగునపడి కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. 20-25 కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు కారిడార్లకు ప్రాథమిక సర్వేలు చేశారు. ప్రయాణికులు, వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే నాలుగు మార్గాలను  ఎంపిక చేశారు.
     
    జనాభా, జనసాంద్రత అంచనాలు
     
    జీవీఎంసీలో అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీల విలీనానికి ముందున్న అంచనాల మేరకు జనాభా, జన సాంద్రత వివరాలను జీవీఎంసీ తన ప్రాథమిక నివేదికలో పొందుపరిచింది. జిల్లాలోని మొత్తం ట్రాఫిక్ రద్దీలో 59 శాతం జీవీఎంసీ పరిధిలోనే నెలకొంది. దీని మేరకు మెట్రోరైలు ప్రాజెక్టుపై అధికారులు ముందుకెళ్లారు. కానీ ప్రస్తుతం ఈ అంచనాల్లో మార్పులు తప్పనిసరికానుంది.
     
    స్థల సేకరణ, స్టాప్‌లపై సర్వే!
     
    జీవీఎంసీ ప్రతిపాదించిన నాలుగు రూట్లలో ఒకదానిని నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత ఏజెన్సీ ఖరారు చేయనుంది. లో కార్బన్ మొబిలిటీ, ట్రాఫిక్ రద్దీ ఆధారంగా ఈ ప్రక్రియ జరగనుంది. మెట్రోరైలు మార్గంపై నిర్ణయానికొచ్చాక.. నెల రోజుల వ్యవధిలో ఆ మార్గంలో ఎంత స్థలం సేకరించాల్సి ఉంటుంది?

    స్థలాల్లో ప్రభుత్వ, ప్రయివేటు కేటగిరీ ఎంతెంత? కిలోమీటర్‌కో స్టాప్ చొప్పున ఎక్కడెక్కడ వాటిని ఏర్పాటు చేయాలన్నదానిపై సర్వే చేపట్టి, సమగ్ర నివేదిక రూపొందించాల్సి ఉంది. గత ప్రతిపాదనల మేరకు కిలోమీటర్‌కు రూ.185 కోట్లు మేర వ్యయ అంచనాలున్నాయని, ప్రాజెక్టు తుది రూపుకొచ్చేసరికి ఈ వ్యయం కిలోమీటర్‌కు రూ.215-220 కోట్లు మధ్య ఉండవచ్చని జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ తెలిపారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement