నరసరావుపేట డివిజన్‌లో వాయిదా పడిన 11 గ్రామ పంచాయతీలు, 103 వార్డులకు, గుంటూరు రూరల్ చల్లావారిపాలెంలో గురువారం ఎన్నికలు జరగనున్నాయి.
వాయిదా పడిన పంచాయతీల్లో రేపు పోలింగ్
Published Wed, Aug 7 2013 3:11 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
సాక్షి, నరసరావుపేట : నరసరావుపేట డివిజన్‌లో వాయిదా పడిన 11 గ్రామ పంచాయతీలు, 103 వార్డులకు, గుంటూరు రూరల్ చల్లావారిపాలెంలో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. నరసరావుపేట డివిజన్‌లోని గురజాల మండలం గోగులపాడు, దాచేపల్లి మండలం సారంగపల్లి అగ్రహారం, ఈపూరు మండలం ఊడిజర్ల, వినుకొండ మండలం అందుగులపాడు గ్రామాల్లో వేలం పాటల ద్వారా సర్పంచ్ ఎన్నిక జరిగిందనే కారణంతో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
వీటికితోడు రొంపిచర్ల మండలం రొంపిచర్ల, ముత్తనపల్లి, నాదెండ్ల మండలం తూబాడు, నరసరావుపేట మండలం ఇక్కుర్రు, వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు, కండ్లకుంట పంచాయతీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనే ముందుస్తు సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్ ఈ గ్రామాల్లో ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నరసరావుపేట మండలం పెదరెడ్డిపాలెం ఎన్నికల్లో ఐదువార్డుల్లో బ్యాలెట్ బాక్సులను బావిలో పడవేయడంతో ఆ వార్డులకు ఎన్నికలను నిలుపుదల చేశారు. ఇలా నిలిచిపోయిన 11 పంచాయతీల్లో గురువారం ఎన్నికలు నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీస్‌శాఖ సిద్ధమైంది. డివిజన్ పరిధిలో మొత్తం 355 పంచాయతీలకు 51 చోట్ల ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక జరిగింది. మిగిలిన 293 పంచాయతీలకు గతనెల 31న ఎన్నికలు జరిగాయి.
గురువారం జరిగే పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 60 మంది సర్పంచ్ అభ్యర్థులు, 120 మంది వార్డు సభ్యులు బరిలో నిలిచారు. 115 పోలింగ్ కేంద్రాల్లో 25,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 457 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం జరిగే 11 గ్రామ పంచాయతీలు అత్యంత సమస్యాత్మకమైనవి కావడంతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆర్డీవోలు శ్రీనివాసరావు, మురళి, డీఎస్పీలు వెంక ట్రామిరెడ్డి, పూజలు పలుమార్లు ఎన్నికలు జరగనున్న గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించారు.
గతంలో గొడవలకు పాల్పడిన అనేక మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వారిని బైండోవర్ చేశారు. పెదరెడ్డిపాలెంలో బ్యాలెట్ బాక్సుల అపహరణ జరిగిన దృష్ట్యా పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఏ పార్టీకి చెందిన వ్యక్తులు కనిపించడానికి వీలు లేదని చెప్పారు. ఓటు ముద్ర వేసి దానిని బ్యాలెట్ బాక్సులో వేయకుండా బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. కౌంటింగ్ సమయంలో పోలింగ్ కేంద్రాల వద్దకు గుంపులు గా చేరడం, కౌంటింగ్ ముగిసి గెలిచిన తరువాత ఈలలు, కేకలు, ఊరేగింపులు వంటివి నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
భారీ పోలీస్ బందోబస్తు ... నరసరావుపేట, గురజాల పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో గురువారం జరగనున్న 11 గ్రామ పంచాయతీలు, 103 వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు నరసరావుపేట డీఎస్పీ పి.వెంకటరామిరెడ్డి తెలిపారు. నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో 7 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా ముగ్గురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 25 మంది ఎస్‌ఐలు, 270 మంది కానిస్టేబుళ్లు, 34 మంది మహిళా కానిస్టేబుళ్లు, 110 మంది హోంగార్డులు, 104 మంది స్పెషల్‌పార్టీ పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఏడుగురు రౌడీషీటర్లు, 456 మంది గొడవలకు పాల్పడే వ్యక్తులను బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల రోజు గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేసి అవసరమైతే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.
చల్లావారిపాలెంలో ...
గుంటూరు రూరల్ చల్లావారిపాలెంలో నామినేషన్ల అనంతరం సర్పంచ్ అభ్యర్థి ఫేమస్ బాబు మృతి చెందడంతో ఇక్కడ ఎన్నికలను వాయిదా వేశారు. తిరిగి నామినేషన్లు స్వీకరించి గురువారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Advertisement
Advertisement