ఆప్షన్ తెలంగాణే ! | IAS,IPS officers elected of option is telangana | Sakshi
Sakshi News home page

ఆప్షన్ తెలంగాణే !

Published Mon, May 19 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM

IAS,IPS officers elected of option is telangana

  సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో పనిచేస్తున్న అఖిల భారత సర్వీసులకు చెందిన అధికారుల్లో ఎక్కువ మంది ‘తెలంగాణ’ కేడర్‌నే ఎంచుకున్నట్టు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపకం చేసే ప్రక్రియలో భాగంగా తమ ప్రాధాన్యతను తెలియజేస్తూ వారు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. జిల్లాలో ఉన్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు తెలంగాణ కేడర్‌లోనే పనిచేస్తామని సాధారణ పరిపాలనా విభాగానికి సమచారం అందించారు. జిల్లా పోలీస్ బాస్ ఎ.వి.రంగనాథ్, ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ కేడర్‌నే ఎంచుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఇక ఐఏఎస్‌ల విషయానికి వ స్తే జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌ది నల్లగొండ జిల్లా. ఆయన విద్యాభ్యాసమంతా ఇక్కడే జరిగింది. ఈ పరిస్థితిలో ఆయన కూడా తన ఆప్షన్ తెలంగాణే అని, ఇక్కడే పనిచేస్తానని ప్రభుత్వానికి తెలియజేసినట్టు సమాచారం. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ ఏ కేడర్‌ను ఎంచుకున్నారనే విషయంలో కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఐటీడీఏ పీవో దివ్య తమిళనాడుకు చెందిన అధికారిణి కాగా, కలెక్టర్ ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణకే చెందుతారని అధికారవర్గాలు అంటున్నాయి. ఇక ఐఎఫ్‌ఎస్ అధికారులుగా ఉన్న కన్జర్వేటర్ ఆనందమోహన్ ఏ కేడర్‌ను ఎంచుకున్నారనేది తెలియాల్సి ఉంది. డీఎఫ్‌వోగా ఉన్న ప్రసాద్ మాత్రం తాను తెలంగాణ కేడర్‌లోనే పనిచేస్తానని తన ప్రాధాన్యతను ప్రభుత్వానికి తెలియజేశారని సమాచారం.

 వీరందరినీ తమ ఆప్షన్ తెలియజేయాలని కోరుతూ ప్రభుత్వం ఈనెల 9న సమాచారం పంపి, 16 వరకు గడువిచ్చింది. ఈ గడువులో అధికారులంతా తమ ఆప్షన్‌ను తెలియజేశారు. అయితే, తమ ప్రాధాన్యతను అయితే అడిగారు కానీ... దాని ప్రకారమే పంపకాలు చేస్తారా అనేది అర్థం కావడం లేదని అధికారులంటున్నారు. లాటరీ ద్వారా ఆలిండియా అధికారులను పంపకం చేస్తారని కొందరు చెపుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో తమను ప్రాధాన్యం ఎందుకు అడిగారో అర్థం కావడం లేదని వారంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయిన ‘ఇన్‌సైడర్స్’కి ఆప్షన్ ఏమీ లేదని, వారు పుట్టిన జిల్లా ఎక్కడ ఉంటే ఆ కేడర్ కిందకు తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో వేరే రాష్ట్రానికి చెందిన ఐటీడీఏ పీవో దివ్య కేడర్ ఎంపిక చేయడంలో ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. ఆమె మాత్రం తెలంగాణ కేడర్‌లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అయితే, ఆలిండియా సర్వీసు అధికారుల పంపకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదని, ఆ మార్గదర్శకాలు ఎలా ఉంటాయో చూస్తేనే కానీ తాము ఏ కేడర్ కిందకు వస్తామో స్పష్టత రాదని కొందరు అధికారులు చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దేశించిన అపాయింటెడ్ డే దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లాకు చెందిన ఆలిండియా సర్వీసు అధికారులు ఏ కేడర్ కిందకు వస్తారో... ఎవరిని ఏ రాష్ట్రానికి పంపుతారో వేచిచూడాల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement