సమైక్య ఉద్యమం కోసం పాతపట్నంలో వేలాది విద్యార్థులతో ర్యాలీ | Samaikyandhra bandh against Telangana in Pathapatnam | Sakshi
Sakshi News home page

సమైక్య ఉద్యమం కోసం పాతపట్నంలో వేలాది విద్యార్థులతో ర్యాలీ

Published Wed, Aug 7 2013 3:13 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

విభజన మంటలు పల్లెలకు పాకుతున్నాయి. సమైక్య ఉద్యమ స్ఫూర్తితో గ్రామీణులు చైతన్యవంతులవుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: విభజన మంటలు పల్లెలకు పాకుతున్నాయి. సమైక్య ఉద్యమ స్ఫూర్తితో గ్రామీణులు చైతన్యవంతులవుతున్నాయి. పట్టణాల్లో మొదలైన సమైక్య ఉద్యమ సెగ జ్వాజ్వలమానమై గ్రామ సీమలను జ్వలింపజేస్తోంది. సాధారణంగా ఉద్యమాలకు దూరంగా ఉండే, రాష్ట్ర విభజన అంటే ఏమిటో కూడా తెలియని గ్రామీణులు సైతం వీధుల్లోకి వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. గ్రామీణులు, యువకులు, విద్యార్థులు విభజనకు నిరసనగా సమైక్యంగా పొలికేక పెడుతున్నారు. రోజురోజుకు ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. ప్రతి ఊరు.. ప్రతి వీధీ రోడ్డెక్కి రాస్తారోకోలు చేస్తున్నాయి. 
 
 వివిధ రూపాల్లో నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. టైర్లు కాల్చి, కాగడాలు రగిలించి, కొవ్వొత్తులు వెలిగించడం ద్వారా తమ గుండెలో రేగుతున్న మంట లను ప్రదర్శిస్తున్నాయి. మంగళవారం కూడా  జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి. విద్యార్థులు తరగతులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి మంటలు వేసి నిరసన తెలిపారు. జాతీయ రహదారిలో ఎక్కడికక్కడ రాకపోకలు నిలిపివేశారు. సోనియా, కేసీఆర్, బొత్స, కిరణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. భారీ స్థాయిలో నిరసన వ్యక్తం అవుతుండటంతో మంత్రులు కోండ్రు మురళి, శత్రుచర్ల విజయరామరాజు, కిల్లి కృపారాణిలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుది కూడా అదే పరిస్థితి. 
 
 జిల్లా కేంద్రంలో..
 ఎన్జీవోలు, విద్యార్థులు, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మహా ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు కేసీఆర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి చేతిలో మద్యం బాటిల్ ఉంచి ర్యాలీ తీశారు. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద దగ్ధం చేశారు. సహాయ్ స్వచ్చంద సంస్థ కాగడాల ర్యాలీ నిర్వహించింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. వర్తక సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం జరి పారు. జర్నలిస్టులు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాల సంఘం బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించింది.
 
 రూరల్ మండలంలో..
 నైర వ్యవసాయ కళాశాల విద్యార్థుల నిరసన దీక్ష మూడో రోజుకు చేరింది. ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. వ్యవసాయ శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. బోరవానిపేట నుంచి గార వరకు యువకులు ర్యాలీలు నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 
 
 ఎచ్చెర్లలో.. 
 డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభింపజేశారు. సోనియా, కేసీఆర్‌ల ప్లెక్సీలకు దండలు వేసి పిండ ప్రదానం చేశారు. రిటైర్డ్ డీజీపీ హెచ్.జె. దొర కారును అడ్డుకున్నారు. శ్రీశివానీ కళాశాలలకు చెందిన బోధకులు, విద్యార్థులు చిలకపాలెం టోల్ ప్లాజా ముందు రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై టైర్లు కాల్చి ట్రాఫిక్ స్తంభింపజేశారు. శ్రీకాకుళం పురుషుల, మహిళల పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి సింహద్వారం వద్ద బైటాయించారు. రణస్థలం మండలం పతివాడపాలెం కూడలిలో జాతీయ రహదారిపై యువకులు రాస్తారోకో నిర్వహించారు. లావేరులో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులను అఖిలపక్ష సభ్యులు అడ్డుకున్నారు. జి.సిగడాం మండలం నిద్దాం, ఆనందపురం గ్రామాల్లో యువకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
 
 పలాసలో..
 పలాస-కాశీబుగ్గ జంట పట్టణాల్లో మంగళవారం రాత్రి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిం చారు. కేసీఆర్ దిష్టిబొమ్మతో నిర్వహించిన శవయాత్ర కాశీబుగ్గ మూడురోడ్ల కూడలి వరకు కొనసాగింది. అక్కడ మానవహారం చేపట్టారు. ఉపాధ్యాయులు, సీనియర్ సిటీజన్‌లు, నాన్ గజిటెడ్ ఉద్యోగులు, వినియోగదారుల సంఘాల సభ్యులు, వివిధ ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలు, విద్యార్థులు, గిరి జన ఉద్యోగ సంఘాల ప్రతిని దులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని సమైక్యాం ధ్రకు సంఘీభావం ప్రకటిం చారు. పలాస రెవెన్యూ అధికారులు విధులు బహిష్కరించి కార్యాలయానికి తాళం వేశారు. పలాస మండలం బొడ్డపాడు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పలాస మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన తెలి పారు. వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలిలో యువకుల రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి వంటలు చేసుకొని అక్కడే భోజనాలు చేశారు.
 
 పాలకొండలో.. 
 న్యాయవాదులు, ల్యాబ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. సీతంపేట మండలంలో సమైక్యవాదులు వంటా, వార్పు నిర్వహించారు. 1500 మందికి భోజనాలు పెట్టా రు. ఉదయం 5 గంటల నుంచే ఏజెన్సీలో బంద్ ప్రారంభిం చారు. అరగుండు, పూర్తి గుండుతో శిరోముండనం చేయిం చుకున్నారు. ఐటీడీఏ ఉద్యోగులు, గిరిజన జేఏసీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. వీరఘట్టం మండలం కడకెల్లలో విద్యార్థులు నాటుబండ్లతో రాస్తారోకో చేపట్టారు. వం డువ సెంటర్‌లో రాస్తారోకో జరిగింది. రెండు చోట్ల దిష్టిబొమ్మ లు దహనం చేశారు. భామిని మండలంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. గురండి, బిల్లుమడ గ్రామాల్లో విద్యార్థులు, యువకులు ప్లకార్డులు ప్రదర్శించి మౌన ప్రదర్శన చేపట్టారు. 
 
 రాజాంలో.. 
 రాజాంలో ఆటోవర్కర్స్, మోటార్ వర్కర్స్ యూనియన్, వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం, న్యాయవాదులు, విద్యార్థులు, యువజన సంఘాలు పట్టణ బంద్ నిర్వహించాయి. పలుచోట్ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. సంతకవిటిలో విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు, టీడీపీ నేతలు ర్యాలీలు నిర్వహించడంతో పాటు మానవహారం నిర్వహించారు. ప్రధాన రహదారిపై వంటవార్పు కార్యక్రమంతో పాటు ఆటాపాటా కార్యక్రమం నిర్వహించి బంద్ పాటించారు. ఉపాధ్యాయులు టెలికాన్పెరెన్స్ కార్యక్రమం బహిష్కరించారు. వంగర, మడ్డువల స గ్రామాల్లో ధర్నాలు, ర్యాలీలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు. రేగిడిలో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. 
 
 పాతపట్నంలో.. 
 జేఏసీ, ఎన్జీవోల పిలుపు మేరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన వేలాది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఎంసీ ఆవరణలో భారీ మానవహారం నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. స్థానికులతో పాటు ఉద్యోగులు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్.ఎన్.పేటలోబంద్‌లు, ధర్నాలు, ర్యాలీలు కొనసాగాయి. అలికాం-బత్తిలి రోడ్డులో చింతలబడవంజ, రావిచంద్రి, ఎల్.ఎన్.పేట వంటి ప్రధాన కూడళ్లలో బంద్‌లు జరిగాయి. కొత్తూరు మండలంలో ఉపాధ్యాయులు సమగ్ర మూల్యాంకన విధానంపై జరిగిన టెలీకాన్ఫరెన్స్‌ను మధ్యలో ఆపివేసి ఎంపీడీవో కార్యాలయం నుంచి కొత్తూరు వరకు బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. సాయంత్రం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో గ్రామస్తులు, యువకులు కొవ్వ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 
 
 ఇచ్చాపురంలో.. 
 పట్టణంలో జరిగిన స్కూల్ కాంప్లెక్స్‌లలో ఉపాధ్యాయులు నల్లబాడ్జీలు ధరించి నిరసన  తెలిపారు. కేశుపురం  సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేశపురం జంక్షన్ వద్ద విద్యార్థులతో మానవహారం చేపట్టారు. కవిటి మండంలోని రాజపురం, పెద్ద మెళియాపుట్టుగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ర్యాలీ, మానవహారం, కవిటిలో ఆటో ర్యాలీ నిర్వహించి  కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. 
 
 ఆమదాలవలసలో.. 
 ఆమదాలవలసలో ప్రతి వార్డులోనూ కొవ్వొత్తులు పట్టుకొని నిరసన తెలిపారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నిరసన మంటలు వేశారు. గేదెలను రోడ్డుపై ఉంచి ఈ ప్రభుత్వం గేదెల కంటే దిక్కుమాలిన ప్రభుత్వ మంటూ నిరసన తెలిపారు. ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో సుమారు 250 ఆటోలు, 50 కార్లతో  భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగులు విధులు  బహిష్కరించి పెన్‌డౌన్ చేశారు. స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో న్యాయవాధులు విధులు బహిష్కరించారు. పొందూరు మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్దులు మూయించి ర్యాలీలు నిర్వహించారు. వ్యాపారులు మార్కెట్  బంద్ చేశారు. భారీ ర్యాలీ జరిపి సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. వాహనాల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకొన్నారు. సరుబుజ్జిలి మండలం రొట్టవలసలో విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. 
 
 నరసన్నపేటలో.. 
 పట్టణంలో జట్టు కలాసీ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి సోనియ,  కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ర్యాలీ నిర్వహించాయి. జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు సాయంత్రం అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. కోమర్తి జంక్షన్ వద్ద హైవేపై ఉదయం యువకులు కొద్దిసేపు ట్రాఫిక్ నిలిపివేశారు. పోలాకిలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలిపారు. జలుమూరు మండలంలో ఐవోబీ బ్యాంకు కార్యకలాపాలు నిలిపివేశారు. జేఏసీ పిలుపుమేరకు ఉద్యోగులు సెలవు పెట్టి విధులు బహిష్కరించారు. సారవకోటలో విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ర్యాలీ నిర్వహించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement