విభజన కీలకాంశాలపై ఎన్నికల దెబ్బ
ఎన్నికలు పూర్తయ్యాకే ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు వెల్లడి
ఎన్నికల అంశాలుగా మారకుండా కేంద్రం జాగ్రత్తలు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన కీలకాంశాలపై ఎన్నికల దెబ్బ పడింది. కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆ రాష్ట్రంలో కలపడంపై ఇప్పటివరకు స్పష్టతలేదు. ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాల రూపకల్పనలో అత్యంత వేగంగా పనిచేసిన అధికార యంత్రాంగం వారం నుంచి వేగాన్ని తగ్గించేసింది. ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ముంపు గ్రామాలు, ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలు ఎన్నికల అంశంగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు ప్రధాన కారణమని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇటీవల రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర మంత్రి జైరాం రమేశ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ప్రత్యేకంగా గవర్నర్ నర్సింహన్‌తో సమావేశమై చర్చించారు. తెలంగాణలో ఈ నెల 30వ తేదీన, సీమాంధ్రలో మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నందున ఆలోగా ఈ అంశాలపై ఎలాంటి నిర్ణయం ప్రకటించినా రాజకీయంగా సమస్యలు తలెత్తుతాయనే అభిప్రాయం కేంద్ర పెద్దల్లో నెలకొంది. అందుకే ఈ అంశాలపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయమూ ప్రకటించకూడదని కేంద్రం నిర్ణయించుకుంది.
ఉద్యోగులకు ఆప్షన్లు ఇస్తే తెలంగాణ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, దీన్ని కేసీఆర్ రాజకీయ అంశంగా మలుచుకుంటారనే అభిప్రాయం ఉంది. ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వకపోతే సీమాంధ్ర ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని, దీన్ని కొన్ని పార్టీలు ఎన్నికల్లో లబ్ధిపొందడానికి వినియోగించుకుంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలను ఖరారు చేయరాదని కేంద్ర పెద్దలు నిర్ణయించారు.ఇప్పటికే కమలనాధన్ కమిటీ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలకు తుదిరూపు ఇచ్చింది. తొలుత స్థానికత ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులను ఆ ప్రాంత రాష్ట్రానికి కేటాయించనున్నారు. అనంతరం చట్టంలో పేర్కొన్న మేరకు ఆయా కేటగిరీల్లో ఉద్యోగులను ఆప్షన్లు కోరనున్నారు.