సమైక్య ఉద్యమం అదే జోరు
Published Sat, Aug 10 2013 3:58 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు : రాష్ట్ర విభజనకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కూడా సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగాయి. మంగళగిరి, తాడేపల్లి, చిలకలూరిపేట, తెనాలిలో మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.
గుంటూరులో సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ నేతలు స్థానిక హిందూ కశాశాల సెంటర్‌లో అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి సమైక్య నినాదాలు చేశారు. పలు విద్యార్థి సంఘాలు రోడ్లపై సమైక్య ప్రదర్శన చేశాయి. నవోదయ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లక రాజు ఆమరణ నిరాహార దీక్షను సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ జిల్లా కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, సమైక్యాంధ్ర జేఏసీ గౌరవ అధ్యక్షులు ఆచార్య పి. నరసింహారావు, జేఏసీ కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ తదితరులు నిమ్మరసం అందించి విరమింపజేశారు. సత్తెనపల్లిలో ఆటోవర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. చిలకలూరిపేట రూరల్ గంగన్నపాలెంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నేతృత్వాన భారీ ర్యాలీ, మానవహారం జరిగింది. వినుకొండలో ముస్లింలు ప్రదర్శన నిర్వహించి, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ప్రభుత్వ వైద్యుల సంఘం, నర్శింగ్ సిబ్బంది వేర్వేరుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జాతీయ పతాకాలు పట్టుకుని నిరసన తెలిపారు.
జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో..
తెనాలిలో జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమాన్ని రోజుకోరీతిగా కొనసాగిస్తున్నారు. శుక్రవారం యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ దిష్టిబొమ్మలకు అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించారు. సమైక్యాంధ్ర బలహీన వర్గాల జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్‌లో సిటీబస్సులను అడ్డగించారు. మంగళగిరిలో విద్యార్థి జేఏసీ సభ్యులు మోకాళ్లతో నడిచి వినూత్నంగా నిరసన తెలిపారు. రేపల్లెలో వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ చేపట్టాయి. గుంటూరులో బీజేపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరండల్‌పేట స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆందోళనకారులను వదిలేశారు.
Advertisement