ఊరూ వాడా సమైక్యం
**** కొనసాగుతున్న మున్సిపల్ ఉద్యోగుల పెన్‌డౌన్ సమ్మె
**** గుంటూరులో కార్పొరేషన్ ఉద్యోగుల విధుల బహిష్కరణ
**** తెలుగుదేశం నాయకుల భారీ ప్రదర్శన, ధర్నా
**** బ్రాహ్మణ సంఘాల జేఏసీ శాంతి హోమం
**** వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
**** మంత్రి డొక్కా కార్యాలయం ముట్టడించిన ఎన్జీవోలు
**** ప్రభుత్వ,ప్రైవేట్ వైద్యుల జేఏసీ ధర్నా, మానవహారం
**** విద్యుత్ ఉద్యోగుల ఎస్ఈ కార్యాలయం ముట్టడి
**** విద్యార్థుల ప్రదర్శనలు,ధర్నాలు, మానవహారాలు
సాక్షి, గుంటూరు : ఏకపక్ష నిర్ణయాలతో యూపీఏ రాష్ట్ర విభజన చేయడం సహించరాని నేరమంటూ సర్వజనం గొంతెత్తి అరుస్తోంది. చేయిచేయి కలిపి రోడ్లపైకి వచ్చి కదం తొక్కుతోంది. అధికార కాంగ్రెస్ నేతలు మౌనం వీడి రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ముందుండి నాయకత్వం వహిస్తుండగా, రాజకీయ, విద్యార్థి, ప్రజా సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో నిరసనలు మంగళవారం కూడా హోరెత్తాయి. జిల్లావ్యాప్తంగా అన్నిచోట్లా మున్సిపల్ ఉద్యోగుల 72 గంటల పెన్‌డౌన్ కొనసాగుతోంది. విద్యార్థి సంఘాలు భారీగా ర్యాలీలు, మానవహారాలు నిర్వహించాయి. గుంటూరు నగరపాలక సంస్థ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి మార్కెట్ సెంటర్లో వంటావార్పుచేసి రోడ్డుపైనే భోజనాలు ఆరగించారు. కబడ్డీ, కోకో వంటి ఆటలు ఆడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి ఏ ఒక్కర్నీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
టీడీపీ నేతల ఆధ్వర్యంలో...
టీడీపీ నేతల ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ నుంచి హిందూ కళాశాల వద్ద వున్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ప్రదర్శన చేసి అక్కడ ధర్నా చేశారు. బ్రాహ్మణ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శంకర్‌విలాస్ సెంటర్లో శాంతి హోమం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ గుంటూరు నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ మహిళావిభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. చౌడవరం, చినపలకలూరు, పెదపలకలూరులలో వైఎస్సార్ సీపీ నేతల నాయకత్వాన గ్రామస్తులు రాస్తారోకోలు చేసి సమైక్య నినాదాలు చేశారు. చిలకలూరిపేటలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగి వాహనాల్ని నిలిపేశారు. యూపీఏ అధినేత్రి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఏపీఎన్జీవో సంఘం గుంటూరులో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించింది. ప్రింటర్స్ అసోషియేషన్ కూడా భారీ ప్రదర్శన చేసి మార్కెట్ సెంటర్లో రిలేనిరాహార దీక్షలు చేపట్టింది. ఆంధ్రా సౌవార్తిక లూథరన్ సంఘం గుంటూరు సినడు అధ్యక్షుడు బిషప్ ఏలియా నాయకత్వాన నిరసన దీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల జేఏసీ నిరసన
రాష్ట్ర విభజనకు నిరసనగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ప్రదర్శన చేశారు. తెలుగుతల్లి వేషధారణతో ఉన్న విద్యార్థికి దండం పెడుతూ నల్లజెండాలు పట్టుకుని హిందూ కళాశాల సెంటర్లో మానవహారం చేశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో మెడికల్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, మానవహారం జరిగింది. వెటర్నరీ వైద్యుల సంఘం కూడా నిరసన కార్యక్రమాలు చేసింది.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో...
నరసరావుపేటలో సమైక్యాంధ్ర జేఏసీ చేపట్టిన ర్యాలీకి వైఎస్సార్ సీపీ సమన్వయకర్తడాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరై పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. సత్తెనపల్లిలో టాక్సీ ఓనర్ల, డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్ల ర్యాలీ జరిగింది. వినుకొండలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నన్నపనేని సుధ హాజరై మద్దతు తెలిపారు. చిలకలూరిపేటలో మున్సిపల్ ఉద్యోగుల నిరాహార దీక్ష శిబిరానికి జిల్లా వైఎస్సార్ సీపీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ హాజరయ్యారు. తెనాలిలో ఆటోడ్రైవర్ల సంఘం సోనియా దిష్టిబొమ్మను దహనం చేసింది. విద్యుత్‌శాఖ ఉద్యోగుల జేఏసీ జిల్లాలోని అన్ని డీఈఈ కార్యాలయాల ముట్టడి, గుంటూరు కేంద్రంలో ఎస్ఈ కార్యాలయ ముట్టడి చేశారు. బాపట్లలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. రేపల్లెలో కోర్టు ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.