ఆదాయానికి సెగ | SEGA income | Sakshi
Sakshi News home page

ఆదాయానికి సెగ

Published Fri, Feb 7 2014 5:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

SEGA income

  •  విభజన ఎఫెక్ట్
  •  పలు రంగాలపై ప్రభావం
  •  అంతటా అనిశ్చితి.. స్తబ్ధత
  •  పడిపోయిన ఆదాయం
  •  జీహెచ్‌ఎంసీ, రిజిస్ట్రేషన్లు, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం
  •   సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రానికి గుండెకాయ వంటి రాజధాని నగరంలోని పలు ప్రభుత్వ ముఖ్య విభాగాల్లో స్తబ్ధత నెలకొంది. విభజన నిర్ణయం, అనంతర రాజకీయ పరిణామాలతో అనిశ్చితి రాజ్యమేలుతోంది. పాలన, నిర్వహణ వంటివి కుంటుపడ్డాయి. ముఖ్య విభాగాల ఆదాయం అనూహ్యంగా పడిపోయింది. రాష్ట్ర విభజన రగిల్చిన సెగ.. ఆదాయానికి పొగబెడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, రిజిస్ట్రేషన్లు, ఆర్టీసీ వంటి విభాగాలు ఆదాయం తగ్గడంతో కుదేలవుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నగరాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు
     
     తీసుకోవడానికి, ప్రాజెక్టులు చేపట్టడానికి ఆటంకంగా మారింది. గ్రేటర్‌లో గతంలో రియల్ వ్యాపారం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తారస్థాయిలో జరగగా, కేంద్రం తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం వెలువరించినప్పటి నుంచీ ఇవి మందగించాయి. స్థిరాస్తుల విలువలు తగ్గుముఖం పట్టాయి. ఇళ్లు, ఫ్లాట్లు కొందామనుకునే వారు ధరలు మరింత తగ్గుతాయనే ఆశతోనూ, అమ్మాలనుకునే వారు పెరగకపోతాయా అనే ధోరణితో  వేచిచూడటం మొదలుపెట్టారు. దీంతో అమ్మకాలు, కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. రిజిస్ట్రేషన్లపైనే కాక ఇది స్టీలు, ఫర్నిచర్, ఇంటీరియర్స్ తదితరాలతో పాటు మార్కెట్, రవాణా తదితర రంగాల్లోనూ ఈ  ప్రభావం కనిపించింది. ఆయా విభాగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..
     
     ‘రిజిస్ట్రేషన్’కు గడ్డుకాలం
     మహా నగరం పరిధిలోని రిజిస్ట్రేషన్ల విభాగంలో దస్తావేజుల నమోదు తగ్గిపోయింది. విభజన ప్రకటన స్థిరాస్తి రంగాన్ని గడ్డుకాలంలోకి నెట్టింది. ఇళ్లు, భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు బ్రేక్ పడింది. భూములు, ఫ్లాట్లకు డిమాండ్ తగ్గడంతో పాటు ధరలూ పడిపోయాయి.
         
     హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం 60 శాతానికి పడిపోయింది
         
     హైదరాబాద్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం జనవరి-2014 నాటికి రూ.651.69 కోట్ల లక్ష్యానికి రూ.394.76 కోట్ల ఆదాయమే లభించింది
         
     రంగారెడ్డి జిల్లాలో రూ.1809.76 కోట్ల లక్ష్యానికి రూ.1138.96 కోట్ల ఆదాయం వచ్చింది
     
     నష్టాల‘బాట’లో సిటీ బస్సు
     ఏ రోజుకారోజు రోడ్డెక్కితే తప్ప మనుగడలేని ‘ప్రగతి రథచక్రం’ ఈ ఏడాది తీవ్ర నష్టాలనే చవిచూసింది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం గణనీయంగా తగ్గాయి. సంస్థాగత నష్టాలను అధిగమించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా.. రాజకీయ పరిణామాలు సంస్థ ప్రగతిపై ప్రభావం చూపాయి.
         
     కొనాళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఆర్టీసీ ఇప్పటి వరకు రూ.40.50 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయింది
         
     రోజూ 35 లక్షల మంది ప్రయాణికులతో కిక్కిరిసి తిరిగే సిటీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఒక్కోసారి 32 లక్షలకు పడిపోతోంది
         
     గతంలో 67 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, ప్రస్తుతం 65కి తగ్గింది
         
     శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో నడిచే పుష్పక్‌లు, సిటీలో తిరిగే ఏసీ బస్సులూ ఆర్టీసీకి నష్టదాయకంగానే మారాయి
         
     గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం ఆర్టీసీకి రూ.2.70 కోట్ల ఆదాయం లభిస్తోంది. బంద్‌లు, సమ్మెలు తదితర అనిశ్చితి కొనసాగిన రోజుల్లో రూ.50  లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నష్టం వాటి ల్లిందని అధికారులు చెబుతున్నారు.
     
     గ్రేటర్‌కు తగ్గిన ఆదాయం
     జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగానికి భవన నిర్మాణ అనుమతులు, బెటర్‌మెంట్ ఫీజులు, ఇతరత్రా రూపేణా గత ఆర్థిక సంవత్సరం రూ. 515 కోట్ల మేర ఆదాయం వస్తే, ఈ ఆర్థిక సంవత్సర ం ఇప్పటికి రూ. 235 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు నెలలో ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుండగా మహా అంటే రూ. 50 కోట్లు వస్తే గగనమే  
         
     భవన నిర్మాణ అనుమతుల కోసం 2012-13లో ఒక్క ఎల్‌బీనగర్ సర్కిల్‌లోనే 4550 దరఖాస్తులు రాగా, జీహెచ్‌ఎంసీకి రూ. 37,45,53, 277 ఆదాయం లభించింది. అదే 2013 నుంచి ఇప్పటి వరకు కేవలం 2560 దరఖాస్తులు రాగా, రూ.23,30,67,514 ఆదాయమే లభించింది
         
     జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి బహుళ అంతస్తుల భవనాల కోసం నెలకు సగటున 160 ఫైళ్లు వచ్చేవి. ప్రస్తుతం వందకన్నా తగ్గాయి. గతంలో వీటి అనుమతుల ద్వారా నెలకు సగటున రూ. 30 కోట్లు రాగా, ప్రస్తుతం రూ. 20 కోట్లు మాత్రమే వస్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement