the income
-
కన్నుపడింది..కప్పేశారు!
అమలాపురంలో గెడ్డ, చెరువు ఆక్రమణ రూ.2 కోట్ల విలువైన భూమికి టెండర్ గెడ్డ, చెరువులను కప్పేసి కొబ్బరి, టేకు సాగు ఆర్డీవో తనిఖీతో వెలుగులోకి కుంభకోణం రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానాలు నక్కపల్లి,న్యూస్‌లైన్: కన్నుపడిందే తడవు అక్రమార్కులు చెలరేగిపోయారు. ఏకంగా చెరువు, కాలువలను పొక్లయిన్‌తో కప్పేసి చదును చేసేశారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన భూమిని దర్జాగా ఆక్రమించేసి టేకు, కొబ్బరి సాగు చేపట్టేశారు. ఇంత జరిగినా మండల రెవెన్యూ సిబ్బందికి ఈ విషయం తెలియదట. అసలు వారికి సమాచారమే లేదట. గురువారం మండలంలోని ప్రభుత్వ భూముల వివరాల సేకరణకు వచ్చిన నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక రెవెన్యూ సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినందునే రెవెన్యూ సిబ్బంది నోరు మెదపలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... అమలాపురం సర్వే నంబర్ 270లో 18.7 ఎకరాలు గెడ్డ ప్రాంతం, సర్వే నంబర్ 295లో 4.17 ఎకరాలు చెరువు గర్భం ఉంది. వీటిని ఆనుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎస్.ఈశ్వరరెడ్డి కుటుంబీకులకు సర్వేనంబర్ 294/1లో 1.2 ఎకరాలు, సర్వే నంబర్ 294/2లో 1.22 ఎకరాలు, 294/3ఎలో 1.85 ఎకరాలు, 294/3బిలో 0.25 సెంట్లు జిరాయితీ భూమి ఉంది. ఈ భూములను ఆనుకుని రెవెన్యూ రికార్డుల్లో గెడ్డగా నమెదయిన 5 ఎకరాలతోపాటు పద్దరాజు చెరువుగా రికార్డుల్లో ఉన్న 4.17 ఎకరాల్లో కొంతభూమిని అప్పలకొండ, సూర్యనారాయణరాజు, ఈశ్వరరెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించేశారు. అందులో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని విస్తరించేశారు. కబ్జా భూముల్లో బోర్లు ఏర్పాటు కోసం విద్యుత్లైన్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. చెరువును అడ్డంగా తవ్వి జిరాయితీ, ఆక్రమిత భూముల్లోకి రాకపోకలు సాగించేందుకు పక్కారోడ్డు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. కొంతమంది సిబ్బంది సహాయంతో ఆక్రమిత భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు సంపాదించేందుకు కబ్జాదార్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు భోగట్టా. కోస్తాతీరం వెంబడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పీసీపీఐఆర్‌లో నక్కపల్లి మండలం క్లస్టర్‌గా ఉంది. పీసీపీఐఆర్కోసం సేకరించే భూముల్లో అమలాపురం కూడా ఉండటంతో ఆక్రమణదార్లు ప్రభుత్వ భూములపై దృష్టిసారించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో భూముల ధర ఎకరా రూ15 నుంచి 20 లక్షలు పలుకుతోంది. ప్రభుత్వం సేకరించినా దాదాపు ఇదేధర ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిరాయితీతోపాటు డీఫారం పట్టాభూములకు 70 శాతం నష్టపరిహారం వచ్చే అవకాశం ఉండటంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడుతోంది. ఆక్రమణపై ఫిర్యాదు అందడం వల్లే తనిఖీలకు వచ్చారని మరికొందరు చెప్పుకుంటున్నారు. అనుమానంతో పరిశీలన ఆక్రమణలపై ఎటువంటి ఫిర్యాదు అందలేదు. మండలంలోని ప్రభుత్వ భూముల పరిశీలనకు మాత్రమే అమలాపురం వచ్చాను. చెరువు గర్భంలోంచి రోడ్డు వేయడం చూసి అనుమానంతో ఆరాతీశాను. రోడ్డువేసిన ప్రాంతాన్ని ఆనుకుని సాగులో ఉన్న భూములు ప్రభుత్వానివని రెవెన్యూ అధికారుల నుంచి వివరణ వచ్చింది. దీంతో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని గుర్తించాను. అయితే ఎంత భూమి ఆక్రమణకు గురైందన్న దానిపై పూర్తి వివరాలు సర్వేచేసి ఇవ్వాలని తహశీల్దార్, సర్వేయర్లను ఆదేశించడం జరిగింది. నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయి. - సూర్యారావు, నర్సీపట్నం ఆర్డీవో -
లక్ష్యం సాధ్యమేనా?
రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యం రూ.435 కోట్లు గత ఏడాది కన్నా 62 శాతం ఎక్కువ కష్టమేనంటున్న సిబ్బంది విశాఖపట్నం, న్యూస్‌లైన్: జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన ్లశాఖకు ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో రూ.435.10 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దే శించింది. గత ఆర్థిక సంవత్సరంలో సమైక్యాంధ్ర సమ్మె తదితర కారణాల వల్ల రూ.389 కోట్ల లక్ష్యానికి 59 శాతం ప్రగతితో రూ.231 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కన్నా 62 శాతం అధికంగా లక్ష్యాన్ని నిర్దేశించడంతో లక్ష్య సాధన కష్ట సాధ్యమని సిబ్బంది అంటున్నారు. విశాఖపట్నం రాష్ట్ర రాజధాని అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఇంత ఆదాయం రావడం అనుమానమేనని చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడిదారుల వెనుకంజ కారణంగా రిజిస్ట్రేషన్లు పడకేశాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 71 రోజులపాటు సిబ్బంది సమ్మె చేయడంతో ఆదా యం గణనీయంగా పడిపోయింది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో విశాఖ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అత్యధికంగా రూ.120.91 కోట్ల ఆదాయం లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రోజుకు 120 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అవుతుండగా, సుమారుగా రూ.కోటి వరకు ఆదాయం వస్తోంది. పెరిగిన లక్ష్యం ప్రకారం రోజుకు రూ.1.50 కోట్ల ఆదాయం వస్తేనే లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలుంటాయి. లక్ష్యాన్ని చేరుకుంటాం ఇప్పటికే అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు లక్ష్యాలు పంపించాం. గత ఏడాది పెట్టుబడిదారుల వెనుకంజ కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం కొంతవరకే ఉంది. సాధారణంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు విశాఖలో భూములపై పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా ఉంటారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు పుంజుకుంటాయనే భావిస్తున్నాం. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకుంటాం. -ఆర్.దామోదరరావు, జిల్లా రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ల శాఖ, విశాఖపట్నం -
ఆదాయానికి సెగ
విభజన ఎఫెక్ట్ పలు రంగాలపై ప్రభావం అంతటా అనిశ్చితి.. స్తబ్ధత పడిపోయిన ఆదాయం జీహెచ్ఎంసీ, రిజిస్ట్రేషన్లు, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రానికి గుండెకాయ వంటి రాజధాని నగరంలోని పలు ప్రభుత్వ ముఖ్య విభాగాల్లో స్తబ్ధత నెలకొంది. విభజన నిర్ణయం, అనంతర రాజకీయ పరిణామాలతో అనిశ్చితి రాజ్యమేలుతోంది. పాలన, నిర్వహణ వంటివి కుంటుపడ్డాయి. ముఖ్య విభాగాల ఆదాయం అనూహ్యంగా పడిపోయింది. రాష్ట్ర విభజన రగిల్చిన సెగ.. ఆదాయానికి పొగబెడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, రిజిస్ట్రేషన్లు, ఆర్టీసీ వంటి విభాగాలు ఆదాయం తగ్గడంతో కుదేలవుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నగరాభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రాజెక్టులు చేపట్టడానికి ఆటంకంగా మారింది. గ్రేటర్లో గతంలో రియల్ వ్యాపారం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు తారస్థాయిలో జరగగా, కేంద్రం తెలంగాణకు సానుకూలంగా నిర్ణయం వెలువరించినప్పటి నుంచీ ఇవి మందగించాయి. స్థిరాస్తుల విలువలు తగ్గుముఖం పట్టాయి. ఇళ్లు, ఫ్లాట్లు కొందామనుకునే వారు ధరలు మరింత తగ్గుతాయనే ఆశతోనూ, అమ్మాలనుకునే వారు పెరగకపోతాయా అనే ధోరణితో వేచిచూడటం మొదలుపెట్టారు. దీంతో అమ్మకాలు, కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. రిజిస్ట్రేషన్లపైనే కాక ఇది స్టీలు, ఫర్నిచర్, ఇంటీరియర్స్ తదితరాలతో పాటు మార్కెట్, రవాణా తదితర రంగాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. ఆయా విభాగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. ‘రిజిస్ట్రేషన్’కు గడ్డుకాలం మహా నగరం పరిధిలోని రిజిస్ట్రేషన్ల విభాగంలో దస్తావేజుల నమోదు తగ్గిపోయింది. విభజన ప్రకటన స్థిరాస్తి రంగాన్ని గడ్డుకాలంలోకి నెట్టింది. ఇళ్లు, భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు బ్రేక్ పడింది. భూములు, ఫ్లాట్లకు డిమాండ్ తగ్గడంతో పాటు ధరలూ పడిపోయాయి. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం 60 శాతానికి పడిపోయింది హైదరాబాద్ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం జనవరి-2014 నాటికి రూ.651.69 కోట్ల లక్ష్యానికి రూ.394.76 కోట్ల ఆదాయమే లభించింది రంగారెడ్డి జిల్లాలో రూ.1809.76 కోట్ల లక్ష్యానికి రూ.1138.96 కోట్ల ఆదాయం వచ్చింది నష్టాల‘బాట’లో సిటీ బస్సు ఏ రోజుకారోజు రోడ్డెక్కితే తప్ప మనుగడలేని ‘ప్రగతి రథచక్రం’ ఈ ఏడాది తీవ్ర నష్టాలనే చవిచూసింది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం గణనీయంగా తగ్గాయి. సంస్థాగత నష్టాలను అధిగమించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నా.. రాజకీయ పరిణామాలు సంస్థ ప్రగతిపై ప్రభావం చూపాయి. కొనాళ్లుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఆర్టీసీ ఇప్పటి వరకు రూ.40.50 కోట్ల వరకు ఆదాయాన్ని కోల్పోయింది రోజూ 35 లక్షల మంది ప్రయాణికులతో కిక్కిరిసి తిరిగే సిటీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో ఒక్కోసారి 32 లక్షలకు పడిపోతోంది గతంలో 67 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా, ప్రస్తుతం 65కి తగ్గింది శంషాబాద్ ఎయిర్‌పోర్టు మార్గంలో నడిచే పుష్పక్‌లు, సిటీలో తిరిగే ఏసీ బస్సులూ ఆర్టీసీకి నష్టదాయకంగానే మారాయి గ్రేటర్ హైదరాబాద్‌లో నిత్యం ఆర్టీసీకి రూ.2.70 కోట్ల ఆదాయం లభిస్తోంది. బంద్‌లు, సమ్మెలు తదితర అనిశ్చితి కొనసాగిన రోజుల్లో రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నష్టం వాటి ల్లిందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌కు తగ్గిన ఆదాయం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగానికి భవన నిర్మాణ అనుమతులు, బెటర్మెంట్ ఫీజులు, ఇతరత్రా రూపేణా గత ఆర్థిక సంవత్సరం రూ. 515 కోట్ల మేర ఆదాయం వస్తే, ఈ ఆర్థిక సంవత్సర ం ఇప్పటికి రూ. 235 కోట్లు మాత్రమే వచ్చాయి. దాదాపు నెలలో ఆర్థిక సంవత్సరం ముగిసిపోనుండగా మహా అంటే రూ. 50 కోట్లు వస్తే గగనమే భవన నిర్మాణ అనుమతుల కోసం 2012-13లో ఒక్క ఎల్బీనగర్ సర్కిల్లోనే 4550 దరఖాస్తులు రాగా, జీహెచ్ఎంసీకి రూ. 37,45,53, 277 ఆదాయం లభించింది. అదే 2013 నుంచి ఇప్పటి వరకు కేవలం 2560 దరఖాస్తులు రాగా, రూ.23,30,67,514 ఆదాయమే లభించింది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి బహుళ అంతస్తుల భవనాల కోసం నెలకు సగటున 160 ఫైళ్లు వచ్చేవి. ప్రస్తుతం వందకన్నా తగ్గాయి. గతంలో వీటి అనుమతుల ద్వారా నెలకు సగటున రూ. 30 కోట్లు రాగా, ప్రస్తుతం రూ. 20 కోట్లు మాత్రమే వస్తున్నాయి.